రిజర్వేషన్ల టెన్షన్
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:35 AM
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమవుతుండగా ఆశావహులకు రిజర్వేషన్ల ఖరారు టెన్షన్ పట్టుకుంది.
- ఆశావహుల్లో మార్పుల గుబులు
- రెండు మున్సిపాలిటీల్లో 1,22,836 మంది ఓటర్లు
- సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో తుది ఓటర్ జాబితా వెల్లడి
- మహిళా ఓటర్లే కీలకం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమవుతుండగా ఆశావహులకు రిజర్వేషన్ల ఖరారు టెన్షన్ పట్టుకుంది. సోమవారం జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో తుది ఓటర్ జాబితా వెల్లడి కావడంతో ఏ క్షణమైనా రిజర్వేషన్ల ఖరారు మొదలు కానుంది, చైర్మన్ రిజర్వేషన్లు మున్సిపల్ డైరెక్టర్, వార్డు కౌన్సిలర్ రిజర్వేషన్లు కలెక్టర్ ఆధ్వర్యంలో ఖరారు కానున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ కోర్టు తీర్పులు, కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో 2019లో అమలు చేసిన విధంగానే 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. బీసీ డెడికేషన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు అవుతాయని చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం జరగనున్నాయి. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అదే పద్ధతిలో జరిగే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో రిజర్వేషన్ల మార్పులపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వార్డులోనే అవకాశం లభిస్తుందా, ఇతర వార్డులు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయా అనే సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు. పోటీకి సిద్ధమైన ఆశవహులు వార్డులో పర్యటిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. టికెట్ల కోసం ఆయా పార్టీల నేతలు చుట్టూ తిరుగుతున్నారు. టికెట్లు ఆశిస్తూ పార్టీలు మారుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో పట్టు సాధించే దిశగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. సంక్రాంతి పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2020 రిజర్వేషన్ల ప్రకారం సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్సీలకు మూడు స్థానాలు కేటాయించగా రెండు జనరల్, ఒకటి మహిళా, బీసీలకు 15 స్థానాలు కేటాయించగా 8 జనరల్, 4 మహిళలకు, జనరల్‌కు 15 స్థానాలు కేటాయించగా 9 జనరల్, 11 మహిళలకు రిజర్వ్ చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్సీలకు నాలుగు కేటాయించగా రెండు జనరల్, రెండు మహిళలకు, బీసీలకు 9 స్థానాల్లో కేటాయించగా జనరల్ అయిదు, మహిళకు నాలుగు స్థానాలు, జనరల్ స్థానాలు 14 ఉండగా ఆరు జనరల్, 8 మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్లలో మార్పుల విషయమై ఆశావహుల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఓటర్ల లెక్క తేలింది...
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో ఓటర్ ముసాయిదా జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సోమవారం తుది ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాష, అన్వేష్‌లు వెల్లడించారు. సిరిసిల్లలో 47, వేములవాడలో 117 అభ్యంతరాలు వచ్చాయి. నిర్దిష్ట గడువులో పరిష్కరించి ప్రకటించిన జాబిత ప్రకారం రెండు మున్సిపాలిటీల్లో 1,22,836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59,522 మంది, మహిళలు 63,290 మంది, జెండర్లు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3,768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81,959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942 మంది, మహిళలు 42,011 మంది, జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40,877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580 మంది, మహిళలు 21,279 మంది, జెండర్లు 18మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,699 మంది ఎక్కువగా ఉన్నారు.
అభ్యర్థుల ఎంపిక కసరత్తులు
పంచాయతీ ఎన్నికల్లో ఆశాజనకంగా ఫలితాలు రావడంతో మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించే దిశాగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలతో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల పాలక పగ్గాలను చేపట్టింది. ఈసారి అధికారంలో కాంగ్రెస్ ఉండడంతో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రెండు రోజులుగా సిరిసిల్లలోని 39 వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళలను తమవైపు తిప్పుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికలో వార్డులో ఉన్న సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థిక పరిస్థితులు ఇతర అభ్యర్థులతో బలబలాలను చూస్తూ ఎంపికకు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతోనే అభ్యర్థులను ప్రకటించే విధంగా మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఆశావహుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. అధికార పార్టీ ద్వారా సులువుగా గెలవచ్చని ఆ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉండడంతో బీఆర్‌ఎస్ ద్వారా గెలుపనుకు ఆయన వంతు కృషి ఉంటుందని భావించి టికెట్ ఆశిస్తూ ఆ పార్టీ నేతలు చుట్టూ తిరుగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల పరిధిలో లభించిన ఆదరణ దృష్టిలో పెట్టుకొని బీజేపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్న వారు ఉన్నారు. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు గెలుపొంది పాలక పగ్గాలు దక్కించుకునే దిశగా దృష్టి సారించారు. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ అభ్యర్థులు ఎంపికపై దృష్టి పెట్టారు. 2020 ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో 67 వార్డులు ఉండగా ఐదు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందుగానే ఏకగ్రీవం కాగా బీఆర్‌ఎస్ 38, కాంగ్రెస్ మూడు, బీజేపీ 9 మంది, ఇతరులు 17 మంది గెలుపొందారు. సిరిసిల్లలో 39వార్డులో 22 మంది బీఆర్‌ఎస్, రెండు కాంగ్రెస్, మూడు బీజేపీ, 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ రెబల్స్ గెలిచారు. తర్వాత వారు బీఆర్‌ఎస్ గూటీకి చేరారు. వేములవాడలో 28 వార్డుల్లో బీఆర్‌ఎస్ 16 మంది, బీజేపీ ఆరుగురు, కాంగ్రెస్ ఒకరు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. ఈసారి పరిస్థితులు మారే విధంగా ఉన్నాయి.