‘మహిళాశకి’్తతో అద్దె బస్సులు
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:12 AM
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను సంఘటిత శక్తిగా మార్చి వారందరిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను సంఘటిత శక్తిగా మార్చి వారందరిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ఏడాది క్రితం మార్చి 8న ప్రారంభించింది. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండే వారికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ ఉపాధికల్పన, బీమా లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నది. ఈ మహిళా సంఘాల ద్వారా పలు స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఆర్టీసీకి అద్దె బస్సులు సమకూర్చే సంస్థలుగా వీటిని తీర్చిదిద్దాలని భావించింది. సెర్ప్, మహిళా సమాఖ్యల ఆర్థిక తోడ్పాటుతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలనెలా ఆదాయాన్ని పొందే విధంగా పథకాన్ని రూపొందించారు. ఆ ఆదాయంపై వచ్చే కొంత భాగాన్ని వడ్డీకి చెల్లించి మిగిలిన మొత్తాన్ని తిరిగి మహిళలకు ఫైనాన్స చేయడం ద్వారా వారందరిని ఆర్థికంగా మరింత ఎదిగేందుకు దోహదపడేందుకు దీనితో వీలుకలుగుతుంది.
ఫ రీజియన పరిధిలో 47 బస్సులు
ఆర్టీసీ కరీంనగర్ రీజియన పరిధిలో 47 బస్సులను నడిపేందుకు మహిళా సంఘాలకు అవకాశం కల్పించారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్-1 డిపో ద్వారా 3 బస్సులు, హుజూరాబాద్ డిపో ద్వారా 6, హుస్నాబాద్ డిపో ద్వారా 6 బస్సులను మొత్తం 15 బస్సులను మహిళా సంఘాలు కొనుగోలుచేసి ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని చిగురుమామిడికి చెందిన ఉదయలక్ష్మి, చొప్పదండికి చెందిన నవభారతి, ఇల్లందకుంటకు చెందిన శ్రీసీతారామ, గంగాధరకు చెందిన ప్రగతి, గన్నేరువరం మండలానికి చెందిన శ్రీలక్ష్మినర్సింహస్వామి, హుజూరాబాద్‌కు చెందిన శ్రీసౌమ్య, జమ్మికుంటకు చెందిన అరుణోదయ, కరీంనగర్ రూరల్‌కు చెందిన నవభారతి, కొత్తపల్లికి చెందిన మానేరు, మానకొండూరుకు చెందిన రుద్రమ ఝాన్సీ లక్ష్మి, రామడుగుకు చెందిన శ్రీరామ, సైదాపూర్‌కు చెందిన శాంతి సమత, శంకరపట్నంకు చెందిన వెలుగుబాట, తిమ్మాపూర్‌కు చెందిన వసుంధర, వీణవంకకు చెందిన జీవనజ్యోతి మండల సమాఖ్యలకు ఈ బస్సులు కేటాయించారు.
ఫ బస్సు కొనుగోలుకు రూ. 30 లక్షల ఆర్థిక సహాయం
మండల సమాఖ్యలకు ప్రభుత్వం సెర్ప్ నుంచి 30 లక్షల రూపాయలను బస్సు కొనుగోలు కోసం ఆర్థిక సహాయంగా అందిస్తున్నది. మండల సమాఖ్య ఈ బస్సు కోసం తనవంతు వాటాగా ఆరు లక్షల రూపాయలను చెల్లిస్తుంది. 36 లక్షలతో బస్సును కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇస్తారు. ఆర్టీసీ ఏడు సంవత్సరాలపాటు ఈ బస్సులను నిర్వహించి వివిధ రూట్లలో తిప్పుకునేందుకు మండల సమాఖ్యలతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. ఏడేళ్లపాటు ప్రతి నెలా ఒక్కో బస్సుకు 69,468 రూపాయల అద్దెను చెల్లిస్తుంది. సమాఖ్యలు ఇందులోని 50 వేల రూపాయలను తమ పరిధిలోని మహిళా సంఘాల్లోని మహిళలకు అంతర్గతంగా రుణాలుగా సమకూర్చి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనందిస్తాయి. ఈ డబ్బు ఇలా లావాదేవీలు జరుపడం ద్వారా సమాఖ్యకు అదనపు ఆదాయం సమకూరుతుంది. మిగిలిన 19,468 రూపాయలతో వడ్డీ చెల్లించి, సమాఖ్య నిర్వహణ అవసరమయ్యే ఇతర ఖర్చులకు వాడుకుంటారు.
ఫ ఏడాదికి రూ. 1.25 కోట్ల ఆదాయం
జిల్లా పరిధిలోని 15 మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలనెలా 10,42,020 అద్దెను ఏడాదికి 1,25,04,240 రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాయి. ఇందులో నెలకు 7.5 లక్షల చొప్పున ఏడాదికి 90 లక్షల రూపాయలను మహిళలకు అప్పుగా ఇచ్చి వాటి ద్వారా వడ్డీని పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నాయి. కరీంనగర్ ఆర్టీసీ రీజియన పరిధిలోని పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో 32 బస్సులను మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు తిప్పుతున్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా ఆ మూడు జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు 22,22,976 రూపాయలు, ఏడాదికి 2,66,75,712 రూపాయల ఆదాయం సమకూరుతున్నది. కరీంనగర్ రీజియన పరిధిలో 47 మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సుల ద్వారా నెలనెలా 32,64,996, ఏడాదికి రూ.3,91,79,952 రూపాయల ఆదాయం సమకూరుతున్నది. ఏడేళ్ళపాటు ఆర్టీసీ ద్వారా ఈ సమాఖ్యలు ఇదే ఆదాయాన్ని పొందుతాయి. బస్సుల నిర్వహణ, డ్రైవర్, కండక్టర్లను సమకూర్చుకొని జీతాలు ఇవ్వడం, డీజిల్, ఆయిల్ ఇతరత్రా నిర్వహణను ఆర్టీసీ చూసుకుంటుంది. మహిళా సంఘాలకు ఈ ఆర్టీసీ బస్సుల నిర్వహణ మంచి లాభసాటి వ్యవహారంగా మారడంతో ఆయా సంఘాల్లో సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఫ మంచి ఆదాయం సమకూరుతోంది..
- ఎం. మయూరి, నవభారతి మండల సమాఖ్య, నగునూరు
బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా మండల సమాఖ్యకు మంచి ఆదాయం వస్తోంది. ఆర్టీసీ నెలనెలా 69,468 రూపాయల అద్దె చెల్లిస్తున్నది. ఈ మొత్తం నుంచి వడ్డీ చెల్లించి, మిగతా 50 వేల రూపాలయను సమాఖ్యలోని 21 వీవో సంఘాలతోపాటు, చిరువ్యాపారులకు రుణాలు అందిస్తున్నాము. వడ్డీ ద్వారా మంచి ఆదాయం వస్తోంది.
ఫ ఆర్థికంగా బలోపేతం అవుతున్నాం...
- జి సుకన్య, మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు, హుజూరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా కొనుగోలు చేసిన బస్సు ద్వారా ప్రతి నెలా 69,468 రూపాయల ఆదాయం సంఘానికి వస్తుంది. ఈ డబ్బుల ద్వారా సంఘంలోని సభ్యులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. రెండు, మూడు నెలలుగా డబ్బులు పడుతున్నట్లుగా మెస్సెజీ రావడం లేదు. అధికారులు దృష్టిసారించి పకడ్బందీగా డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టాలి .
ఫ ఇబ్బందులు తప్పాయి...
- సంధ్యారాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు, సైదాపూర్
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘానికి ఎంతో ఆర్థికంగా అండగా ఉంటోంది. సంఘం ద్వారా కొనుగోలు చేసిన బస్సును ఆర్టీసీ డిపోనకు కేటాయించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘంలోని సభ్యులకు రుణాల ద్వారా అందించడం ద్వారా సభ్యులకు ఆర్థికంగా ఊరట కలిగిస్తోంది.