Share News

ఫీజుల ప్రదర్శనకు వెనకడుగు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:11 AM

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ చేపట్టిన చర్యలకు యాజమాన్యాల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.

ఫీజుల ప్రదర్శనకు వెనకడుగు..

- పోర్టల్‌లో అప్‌లోడ్‌కు ప్రైవేటు విద్యా సంస్థలు అనాసక్తి

- జిల్లాలో 292 పాఠశాలలు

- ఇప్పటి వరకు పోర్టల్‌లో నమోదైనవి ఎనిమిది..

- మిగతా విద్యా సంస్థలకు జారీ కానున్న నోటీసులు

జగిత్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ చేపట్టిన చర్యలకు యాజమాన్యాల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాలల్లో తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించడంతో పాటు, వాటిని అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆగస్టు 7వ తేదీన ఆదేశించినా జిల్లాలో అత్యధిక పాఠశాలలు ఆ దిశగా ముందుకు రావడం లేదు. పాఠశాలల ఫీజుల వివరాలు, సౌకర్యాలపై ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐఎస్‌ఎంఎస్‌ తెలంగాణ) పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. పాఠశాలల ఫీజుల వివరాలతో పాటు ఫైర్‌, సౌండ్‌, శానిటరీ, ట్రాఫిక్‌ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచాలి. కానీ జిల్లాలో అధిక శాతం పాఠశాలలు ముందుకు రాలేదు. దీంతో వివరాలు నమోదు చేయని పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఫ77,592 మంది విద్యార్థులు

జిల్లాలో మొత్తం 292 విద్యాసంస్థలు ఉండగా.. వీటిల్లో సుమారు 77,592 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 8 పాఠశాలలు మాత్రమే ఫీజుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసినట్లు విద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 284 పాఠశాలలు ఫీజుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. పాఠశాల ప్రాంగణంలోని నోటీసు బోర్డుతో పాటు, పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లోనూ తరగతుల వారీగా ఫీజుల వివరాలను ప్రదర్శించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫీజుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతోంది. తొలుత ఆయా యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఫఫీజుల పేరుతో భారం..

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. పాఠశాల ఫీజుతో పాటు వివిధ రకాల పేర్లతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ముందస్తుగా భారీ మొత్తాలు చెల్లించాలని ఒత్తిడి చేయడం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం, ఇతర విద్యా సామగ్రిని యాజమాన్యాలు సూచించిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

ఫఫిర్యాదులకు ఆన్‌లైన్‌ అవకాశం..

ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి తల్లిదండ్రులు తమ సమస్యలను ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు పోర్టల్‌లో అవకాశం కల్పిస్తున్నారు. ఫీజులు, ఇతర సమస్యలపై మొబైల్‌ నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలను జత చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం అవసరమైతే సంబంధిత పాఠశాల యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.

ఫకారణాలు ఇవేనా..?

జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు వివిధ పేర్లతో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కొద్దిపాటి పాఠశాలలకు మాత్రమే సీబీఎస్‌ఈ అనుమతులు ఉండగా మరికొన్ని పాఠశాలల అనుమతులు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై స్పష్టత అవసరమన్న చర్చ జరుగుతోంది. దీంతో ఫీజుల వివరాలను బహిర్గతం చేసేందుకు కొన్ని యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చర్యలు తీసుకోవాలి

-కంబ శంకర్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకుడు

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ప్రైవేటు పాఠశాలలు పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. తరగతుల వారీగా ఫీజుల వివరాలను నోటీసు బోర్డులతో పాటు వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. నిబంధనలు పాటించని పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఫీజు వివరాలు ప్రదర్శించాలి

-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలను ప్రదర్శించాలి. సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసి ఫీజుల వివరాలను ప్రకటించాలి. లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

-------------------------------------------------------------------------

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు..

-------------------------------------------------------------------------

పాఠశాలల స్థాయి సంఖ్య విద్యార్థులు

ప్రాథమిక 12 3,257

ప్రాథమికోన్నత 150 19,838

ఉన్నత పాఠశాలలు 130 54,497

-------------------------------------------------------------------------

మొత్తం పాఠశాలలు...292 - విద్యార్థుల సంఖ్య...77,592

-------------------------------------------------------------------------

Updated Date - Sep 22 , 2026 | 01:11 AM