Share News

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:46 AM

అగ్రిగోల్డ్‌ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెట్టి ఏళ్ల తరబడి వాటి కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ఎట్టకేలకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట

పెద్దపల్లి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెట్టి ఏళ్ల తరబడి వాటి కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ఎట్టకేలకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. తమ కష్టార్జితాన్ని తిరిగి పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, అధికారులకు వినతిపత్రాలు అందజేస్తూ, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్తూ వచ్చిన బాధితులకు బాండ్ల వెరిఫికేషన్‌కు తేదీలు ప్రకటించడం కొంత ఊరటనిస్తోంది. ఏళ్లుగా సాగుతున్న నిరీక్షణకు పరిష్కారం దిశగా మరో అడుగు పడటంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఫ ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?

అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారే. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ, చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ సంపాదించిన మొత్తాన్ని భవిష్యత్తుపై ఆశతో సంస్థలో జమ చేశారు. కొందరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, మరికొందరు వృద్ధాప్య అవసరాల కోసం దాచుకున్న సొమ్మును డిపాజిట్‌ చేశారు. సంస్థ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా వారి ఆశలు ఆవిరయ్యాయి. డిపాజిట్‌ చేసిన సొమ్ము తిరిగి వస్తుందన్న నమ్మకంతో బాధితులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని బాధితుల సంఘాల ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ధర్నాలు, నిరసనలు, వినతిపత్రాల రూపంలో తమ గోడును వినిపించారు. అయినప్పటికీ పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ బాండ్ల వెరిఫికేషన్‌కు షెడ్యూల్‌ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫ కరీంనగర్‌లో ప్రత్యేక కేంద్రం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని బాధితుల కోసం కరీంనగర్‌ సిటీ పోలీస్‌ టైన్రింగ్‌ సెంటర్‌లో ప్రత్యేక వెరిఫికేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని 11 మండలాల బాధితుల ఖాతాలను డిసెంబరు 31 నుంచి జనవరి 22 వరకు విడతల వారీగా పరిశీలించనున్నారు.

ఫ పెద్దపల్లి జిల్లా బాధితులకు తేదీలివే

కరీంనగర్‌ కేంద్రంలో ప్రకటించిన మండలాల వారీ షెడ్యూల్‌ ప్రకారం..

ఫ ధర్మారం: జనవరి 1, 2027 ఫ జూలపల్లి: జనవరి 1, 2

ఫ కమాన్‌పూర్‌: జనవరి 2, 4, 5, 6

ఫ మంథని: జనవరి 6, 7

ఫ ముత్తారం: జనవరి 7, 8

ఫ ఓదెల: జనవరి 8, 11 ఫ పెద్దపల్లి: జనవరి 11, 12, 14

ఫ రామగిరి: జనవరి 14, 16

ఫ రామగుండం: జనవరి 16, 18, 19

ఫ శ్రీరాంపూర్‌: జనవరి 19, 20

ఫ సుల్తానాబాద్‌: జనవరి 20, 21, 22

బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీని అధికారిక షెడ్యూల్‌తో సరిపోల్చుకోవాలి.

ఫ ఏయే పత్రాలు తీసుకెళ్లాలి?

వెరిఫికేషన్‌కు వెళ్లే బాధితులు అసలు అగ్రిగోల్డ్‌ బాండ్‌ లేదా నగదు రసీదు, వాటి స్వీయ ధ్రువీకరణ చేసిన జిరాక్స్‌ ప్రతులు, ఆధార్‌, పాన్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటో, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నంబరు, ఏజెంట్‌ వివరాలు తీసుకెళ్లాలి. అసలు బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు. పరిశీలన అనంతరం సమర్పించిన పత్రాలకు రసీదు ఇవ్వనున్నట్లు సీఐడీ స్పష్టం చేసింది. పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది.

ఫ వెరిఫికేషన్‌తోనైనా న్యాయం జరిగేనా?

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.65 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నట్లు గుర్తించిన సీఐడీ, రూ.447 కోట్లకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా బాండ్ల పరిశీలన చేపడుతోంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. అయితే బాండ్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయినంత మాత్రాన బాధితులకు వెంటనే నగదు అందదు. తదుపరి పరిహారం లేదా రిఫండ్‌ ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది. ఏళ్ల తరబడి తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ఈ ప్రక్రియ కొత్త ఆశలు కల్పిస్తోంది. ప్రకటించిన తేదీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెరిఫికేషన్‌ పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వారి పెట్టుబడులు తిరిగి అందేలా ప్రభుత్వం, సీఐడీ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:46 AM