అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరట
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:35 AM
రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్లు, నగదు రశీదుల ధ్రువీకరణ, నమోదు ప్రక్రియ ఈనెల 25 నుంచి ప్రారంభమైంది.
జగిత్యాల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్లు, నగదు రశీదుల ధ్రువీకరణ, నమోదు ప్రక్రియ ఈనెల 25 నుంచి ప్రారంభమైంది. జగిత్యాల జిల్లాకు చెందిన బాధితుల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం, ఉపశమనం కల్పించే లక్ష్యంతో సీఐడీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. డిసెంబరు 11 వరకు మండలాల వారీగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రతీ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధ్రువీకరణ కొనసాగించనున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన 3,635 మంది బాధితుల కోసం ప్రక్రియను చేపట్టనున్నారు. అసలు బాండ్లు, నగదు రశీదులను పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, వాటిని అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఫదశల వారీగా పరిశీలన...
వేలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ, అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) ప్రకటించింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన బాధితుల కోసం కరీంనగర్‌లో ఈ ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఐడీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాల బాధితుల కోసం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అల్కాపురి కాలనీ, కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డు, డీర్ పార్క్ పక్కన, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో గల సిటీ పోలీస్ టైన్రింగ్ సెంటర్ (సీటీసీ)లో ప్రత్యేక ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో మండలాల వారీ షెడ్యూల్ ప్రకారం ధ్రువీకరణ ప్రక్రియ జరుపుతున్నారు. ప్రతీ రోజు గరిష్ఠంగా 250 ఖాతాలను పరిశీలించడానికి ఏర్పాటు చేశారు.
ఫజిల్లా షెడ్యూల్ ఇలా...
జగిత్యాల జిల్లాకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. నవంబర్ 25న బీర్పూర్ (246 డిపాజిటరకు చెందిన ఖాతాలు), 26న ధర్మపురి (250 డిపాజిటర్ల ఖాతాలు), 27న ధర్మపురి (13), ఎండపల్లి (237), నవంబర్ 28న ఎండపల్లి (14), గొల్లపల్లి (236), నవంబర్ 30న గొల్లపల్లి (14), ఇబ్రహీంపట్నం (235) మండలాల ఖాతాలను పరిశీలిస్తారు. డిసెంబరు1న ఇబ్రహీంపట్నం (12), కథలాపూర్ (238), డిసెంబరు 2న కథలాపూర్ (11), కోరుట్ల (239), డిసెంబరు 3న కోరుట్ల (8), మల్యాల (242) డిసెంబరు 4న మల్యాల (32), మల్లాపూర్ (218), డిసెంబరు 5న మల్లాపూర్ (73), మేడిపల్లి (177), డిసెంబరు 7న మేడిపల్లి (75), మెట్‌పల్లి (175), డిసెంబరు 8న మెట్‌పల్లి (97), పెగడపల్లి (153), డిసెంబరు 9న పెగడపల్లి (126), సారంగాపూర్ (124), డిసెంబరు 10న సారంగాపూర్ (122), వెల్గటూర్ (128) డిసెంబరు 11న వెల్గటూర్ (142) డిపాజిటర్ల ఖాతాలను పరిశీలించనున్నారు. డిపాజిటర్లు తమ మండల తేదీలను కేంద్రం వద్ద ముందుగా నిర్ధారించుకొని సమీప పోలీస్ స్టేషనలో తెలియపరిస్తే వారిని కరీంనగర్‌లో గల సీటీసీ కేంద్రానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.
ఫపరిశీలనకు అవసరమైన పత్రాలు..
ధ్రువీకరణ కోసం వచ్చే వారు ఒరిజినల్ బాండ్లను కేవలం పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, వాటిని అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే అసలు బాండ్/రసీదుతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ జిరాక్స్, ఆధార్, పానకార్డు జిరాక్స్, పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ స్పష్టంగా ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్, ఏజెంట్ వివరాలు తెలిస్తే సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిటర్ మరణించి నామినీ జీవించి ఉంటే నామినీ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ ఆధార్, పాన, రేషన కార్డు లేదా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, నామినీ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫొటో, బ్యాంక్ లింక్ట్ మొబైల్ నంబర్ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణించినట్లయితే చట్టబద్ధ వారసుడు సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఇద్దరి మరణ ధ్రువీకరణ పత్రాలు, వారసుడి ఆధార్, పాన, చట్టబద్ధ వారసుల/కుటుంబ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫొటో, మొబైల్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది. పత్రాల పరిశీలన అనంతరం అధికారులు రసీదు అందజేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
- అశోక్ కుమార్, ఎస్పీ
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ, అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధ్రువీకరణ, నమోదు ప్రక్రియను బాధితులు సద్వినియోగం చేసుకోవాలి. డిపాజిటర్లు ముందుగా తమ మండల తేదీలను ముందుగా నిర్ధారించుకొని సమీప పోలీస్ స్టేషనలో తెలియపరచాలి. ధ్రువీకరణకు అవసరమైన జిరాక్స్ పత్రాలు, ఫొటోలను వెంట తీసుకెళ్లాలి.