నమోదు సరే.. ‘ధీమా’ ఎలా?
ABN , Publish Date - Sep 11 , 2026 | 02:15 AM
రైతు కుటుంబాల్లో ఇంటి పెద్ద ఎలా చనిపోయినా రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు నామినీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రైతు కుటుంబాల్లో ఇంటి పెద్ద ఎలా చనిపోయినా రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు నామినీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. దీంతో ఆ కుటుంబానికి ఓదార్పుగా ఉండేది. గతనెల 13వ తేదీతో రైతు బీమా పథకంలో రైతుల పాలసీ రెన్యూవల్ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వంపై రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మరణాలను నమోదు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో రైతు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆగస్టు 14 నుంచి రైతు మరణాలను నమోదు చేయాలని సర్క్యూలర్ జారీ చేసింది. గత నెలలో మూసివేసిన రైతు బీమా పోర్టల్‌ను మళ్లీ తెరిచారు. మరణాల నమోదు చేస్తున్నా ఏ విధంగా ధీమాగా బీమా సొమ్ము చెల్లిస్తారు అనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు మరణించిన రైతు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 2018 సంవత్సరంలో రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ప్రభుత్వమే ప్రీమియం డబ్బులు చెల్లించి రెన్యూవల్ చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని యథావిధిగా కొనసాగించింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు. గుంట భూమి ఉన్న సరే ఆ రైతుకు బీమా పథకం వర్తింపచేయడం ద్వారా రూ.5 లక్షల ధీమా కుటుంబానికి ఉండేది. సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బీమా సొమ్ము వచ్చేది. ప్రభుత్వం రైతు బీమా పథకానికి ప్రత్యామ్నాయంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చే యోచనలో ప్రీమియం చెల్లించలేదని తెలుస్తోంది.
పరిహారంపై అయోమయం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు మరణించిన రైతుకు సంబంధించిన వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తున్న వారికి పరిహారం డబ్బులు ఎలా చెల్లిస్తారనే దానిపై రైతు కుటుంబాల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం మరణించిన రైతుకు 2025-26 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ఎల్‌ఐసీ ఐడీ ఉండడంతోపాటు 2026-27 సంవత్సరానికి బీమా పాలసీ కవరేజీకి అర్హుడై ఉండాలని సూచిస్తుంది. బీమా అర్హత ఉండాలంటే 1967 సంవత్సరం ఆగస్టు 14 నుంచి 2008 సంవత్సరం ఆగస్టు 14మధ్య కాలంలో జన్మించి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నమోదు చేస్తున్న రైతు మరణాల వివరాలు ప్రకారం ఆ కుటుంబానికి ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లిస్తారా.. లేక ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలైన తర్వాత పరిగణనలోకి తీసుకుంటారా అని అయోమయం మాత్రం నెలకొంది. ఈ సంవత్సరం నవంబర్ 19 నుంచి కొత్త బీమా పథకం అమల్లోకి వస్తుందని చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే రైతు బీమా పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించి వివరాలు నమోదు చేస్తున్నారని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం జరిపిన వ్యవసాయ గణాంకాల ప్రకారం జిల్లాలో 110883 మంది రైతులకు సంబంధించి 243157.16 ఎకరాల వ్యవసాయ భూమి లెక్కలోకి వచ్చింది. ఇందులో 2.47 ఎకరాలకు సంబంధించి 75931 రైతులకు 81416.67 ఎకరాలు, 2.48 నుంచి 4.93 ఎకరాల వరకు 25092 మంది రైతులకు 86460.76 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు వరకు 8346 మంది రైతులకు 53560.38 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాల వరకు 1427 మంది రైతులకు 18962.56 ఎకరాలు, 24.71 ఎకరాలకు పైగా ఉన్నవారు 87 మందికి 2756.79 ఎకరాలు ఉంది. ఇందులో ఎస్సీలకు సంబంధించి 15219 మంది రైతులకు 25242.04 ఎకరాల భూమి ఉంది. ఎస్టీలకు సంబంధించి 3742 మంది రైతులకు 8769.14 ఎకరాల భూమి ఉండగా ఇతర సామాజికవర్గాల్లో 91919 మంది రైతులకు 209627.17 ఎకరాలు ఉంది. 20879 మంది మహిళా రైతులకు 44460.15 ఎకరాల భూమి ఉంది.
రైతు కుటుంబాలకు రూ.1970 కోట్ల పరిహారం
రైతు బీమా పథకంలో గతంలో పాలసీలో ఉన్న వారందరి డేటాను పరిశీలించి పునరుద్ధరించేవారు. ఇందులో 60 సంవత్సరాలు నిండిన రైతులను తొలగించేవారు. రైతు బీమా నమోదు చేసుకున్న రైతులు వారి నామినీ ఏదైనా కారణంతో మృతిచెందినా, కొత్త నామినీలను నమోదు చేసే అవకాశం కల్పించింది. కొత్త నామినీ ఆధార్, బ్యాంక్ ఖాతాతో పాటు ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 15న గత ప్రభుత్వం ప్రారంభించగా దేశవ్యాప్తంగా కూడా బీమా పథకం గుర్తింపు వచ్చింది. రైతు ఏ విధంగా మృతిచెందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందే విధంగా ప్రభుత్వం ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించింది. ఒక్కో రైతుకు ప్రీమియం మొదట్లో రూ.2271 ఉండగా తర్వాత రూ.3536కు చేరినా చెల్లిస్తూ వచ్చింది. ప్రసుత్తం నూతన బీమా పథకం తీసుకువస్తున్న రైతు చనిపోతే ఆ కుటుంబానికి ధీమా ఎలా ఇస్తారనే దానిపై జిల్లా రైతుల్లో సందిగ్ధం ఏర్పడింది. రైతు బీమా పథకంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 సంవత్సరాల్లో 3941 మంది రైతులు మృతిచెందగా, బాధిత కుటుంబాలకు రూ.1970 పరిహారం అందించారు. 2025-26 సంవత్సరంలో జిల్లాలో 394 మంది రైతులు మృతిచెందగా 308 కుటుంబాలకు రైతు బీమా కింద రూ.15.40 కోట్లు పరిహారం చెల్లించారు. 2018-19లో 318 మంది, 2019-20లో 337 మంది, 2020-21లో 536 మంది, 2021-22లో 387 మంది, 2022-23లో 376మంది, 2023-24లో 385 మంది, 2024-25లో 336 మంది, 2025-26లో 391మంది రైతులు చనిపోగా వారి కుటుంబాలు బీమా సాయాన్ని పొందారు. ఇప్పటివరకు రూ 1970 కోట్ల వరకు బీమా పరిహారం పొందారు.