5 నిమిషాల్లోనే నమోదు..
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:40 AM
తెలంగాణలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆపత్కాలంలో ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది.
- ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదులో మార్పులు
- దరఖాస్తు ఫారం లేకుండా ఆన్‌లైన్‌లోనే స్వీకరణ
- గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొదలైన ప్రక్రియ
- కుటుంబ పెద్దదిక్కు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక భరోసా
- వేములవాడలో ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తెలంగాణలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆపత్కాలంలో ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. ముందుగా అనుకున్న ఇందిరమ్మ భీమా నమోదుకు ప్రింట్ చేసిన దరఖాస్తులు ఇచ్చే ప్రక్రియకు స్వస్తి పలికారు. నేరుగా వెబ్ ద్వారా ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు నంబర్‌తో నమోదు చేసే విధంగా మార్పులు చేశారు. దీంతో కేవలం ఐదు నిమిషాల్లోనే బీమా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండటాల్లో 260 గ్రామపంచాయతీలు, సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా నమోదు ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో వేములవాడ మున్సిపల్ పరిధిలో భీమా నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. సిరిసిల్లతో పాటు చీర్లవంచలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ శిబిరాలను పరిశీలించి, బీమా అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగే విధంగా ముందుగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి వివరాలను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో వార్డు కార్యదర్శి ద్వారా దరఖాస్తు ఫాంలో వివరాలు నింపి వాటిని కుటుంబ సభ్యులకు వినిపించిన తర్వాత సంబంధిత వ్యక్తి సంతకం తీసుకొని స్కాన్ కాపీలను బీమా సంస్థకు పంపించడంతోపాటు, దరఖాస్తులను జిల్లా స్థాయిలో భద్రపరిచే విధంగా చర్యలు చేపట్టారు. అనంతరం బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపించే విధంగా నిర్ణయించారు. డిసెంబరు19 వరకు వచ్చే దరఖాస్తులు ఆన్‌లైన్ చేసే విధంగా నిర్ణయించారు. ఇదంతా ఇబ్బందికరంగా ఉందని భావించిన ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.
ఆన్లైన్ ద్వారా నమోదు ప్రక్రియ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా చేపట్టారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసి మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్ వివరాలు నమోదు చేస్తున్నారు. కేవలం రేషన్ కార్డు నంబర్ నమోదు చేయడంతోనే కుటుంబ సభ్యుల వివరాలు కనిపిస్తాయి. వాటిలో బీమాదారుడు పేరు, నామినీల వద్ద ‘టిక్’ చేయగానే ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఇదంతా కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయడంతోనే కార్డు సభ్యుల జాబితాతో అప్లికేషన్ వస్తుంది. దానిలో బీమా ఎవరికి కావాలో వారికి వర్తింపచేస్తారు. ఏదైనా కారణాలతో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తికి వచ్చే రూ.5 లక్షల సొమ్మును ఒకరికి, లేదా కుటుంబ సభ్యులందరికీ ముందే వర్తించే విధంగా ఆప్షన్లు ఇచ్చే సదుపాయం కల్పించారు. ఒకే నామినీకి పూర్తిగా వర్తించాలంటే 100 శాతంగా నమోదు చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన అనంతరం దరఖాస్తుదారుడి మొబైల్‌కు మెసేజ్, రసీదు వస్తుంది. ఎలాంటి పత్రాలు స్కాన్ చేయడం కానీ, ప్రింట్ చేసి సంతకం చేయించడం కానీ, జిరాక్స్ పత్రాలు ఇవ్వడం కానీ అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఎలాంటి ఖర్చు లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది.
జిల్లాలో 1.97 లక్షల కుటుంబాలు
ప్రభుత్వం కులం, మతం పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వర్తింపజేయాలని ఆలోచిస్తోంది. ముందుగా ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే బీమాలో నమోదు చేస్తున్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని ఒక సభ్యుడికి వర్తింపచేస్తారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉండాలన్న నిబంధన ప్రకారం బీమా చేయించే వ్యక్తి 19 నవంబరు 1967 నుంచి 18 నవంబరు 2008 మధ్య పుట్టిన వారు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. బీమా పాలసీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో బీమా సొమ్ము ఎవరికి ఎంత వాటా చెల్లించాలో కూడా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పొందపరుస్తున్నారు. దీంతో పాటు కుటుంబంలో ఎవరైనా గతంలో ప్రభుత్వం అమలు చేసిన బీమా పథకం పరిధిలో ఉన్నారా అనే వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ కార్డులు 1.97 లక్షల కుటుంబాలు కలిగి ఉండగా కార్డులో 5.44 లక్షల మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో దీని ప్రకారం 1.97 లక్షల కుటుంబాలు బీమా పథకం వర్తించనుంది.
జిల్లాలో మండలాల వారీగా రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు
మండలం కుటుంబాలు సభ్యులు
బోయినపల్లి 13379 37886
చందుర్తి 12315 35576
ఇల్లంతకుంట 17471 49700
గంభీరావుపేట 16017 47000
కోనరావుపేట 15778 46528
ముస్తాబాద్ 16773 49738
రుద్రంగి 5597 17769
సిరిసిల్ల 30756 92761
తంగళ్లపల్లి 16234 46786
వీర్నపల్లి 4842 15213
వేములవాడరూరల్ 8301 2433
వేములవాడ 22409 67388
ఎల్లారెడ్డిపేట 17653 51608
----------------------------------------------------------------------
మొత్తం 197525 51608
----------------------------------------------------------------------------