మూల్యాంకనంలో సంస్కరణలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:47 AM
ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల మూల్యాంకన విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులు రాసిన ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 పరీక్షల జవాబు పత్రాలను అదే పాఠశాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులే మూల్యాంకనం చేస్తుండగా ఇకపై ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ చేయించాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాల, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల మూల్యాంకన విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులు రాసిన ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 పరీక్షల జవాబు పత్రాలను అదే పాఠశాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులే మూల్యాంకనం చేస్తుండగా ఇకపై ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ చేయించాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మూల్యాంకనంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొన్నప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్న తరుణంలో ఉన్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు మూల్యాంకనం కోసం పంపిస్తే బోధన ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్ర మాలు నిర్వహిస్తుండగా మరోవైపు ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం విద్యార్థులకు నష్టమేనని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. జిల్లాలో 819 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 3,935 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
ఫపాత పద్ధతే మేలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ఎస్‌ఏ పరీక్షల అనంతరం సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులే జవాబు పత్రాలను పరిశీలించేవారు. తమ వద్ద చదువుతున్న విద్యార్థుల స్థాయి, వారి సామర్థ్యం, బలహీనతలు, ఏడాది పొడవునా చూపిన ప్రగతిపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండేది. మూల్యాంకనం ద్వారా ఏ పాఠ్యాంశంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారో గుర్తించి తదుపరి బోధనలో ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశం ఉండేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పుడు ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తే విద్యార్థి వాస్తవ అభ్యసన స్థాయిని అంచనా వేయడం ఎంతవరకు సాధ్యమవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఫవాల్యుయేషన్‌కు ఉపాధ్యాయులు.. బడిలో విద్యార్థి
కొత్త విధానంపై ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే పలు చోట్ల ఉపాధ్యాయుల సర్దుబాటు కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మూల్యాంకనం కోసం ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపిస్తే ఆ సమయంలో వారి తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పేదెవరని ప్రశ్నిస్తున్నారు. వాల్యుయేషన్ కార్యక్రమం పూర్తయ్యే వరకు బోధనలో ఏర్పడే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి.
ఫలోపాలపై దృష్టి సారిస్తే మేలు..
మూల్యాంకనంలో ఎక్కడైనా లోపాలు జరిగితే వాటిని గుర్తించి సరిదిద్దాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కొంత మంది చేసే తప్పులకు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థనే బాధ్యులను చేయడం సమంజసం కాదని అంటున్నాయి. మూల్యాం కనంలో పారదర్శకత పెంచాలంటే అకడమిక్ మానిటరింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని సూచిస్తున్నాయి. ర్యాండమ్ చెకింగ్, మోడరేషన్ విధానాలను బలోపేతం చేయవచ్చని పేర్కొంటున్నాయి. అవసరమైతే అనుమానం ఉన్న జవాబు పత్రాలను రెండోసారి మూల్యాంకనం చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నాయి.
ఫఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్‌తో ప్రయోజనమెంత..?
ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయిస్తే మరింత నిష్పపక్షపాతంగా మార్కులు కేటాయించే అవకాశం ఉంటుందని విద్యాశాఖ భావిస్తోంది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాల కంటే బోధనకు జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. విద్యార్థి జవాబు పత్రాన్ని పరిశీలించడం ఒక్కటే మూల్యాంకనం కాదని, అతడి మొత్తం అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుడు గుర్తించగలగాలని చెబు తున్నారు. పరీక్షలో వచ్చిన మార్కులు మాత్రమే విద్యార్థి సామర్థ్యానికి కొలమానం కాకూడదని అభిప్రాయపడుతున్నారు. కొత్త మూల్యాంకన విధానాన్ని అమలు చేసే ముందు విద్యా రంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, క్షేత్రస్థాయి అధికారులతో విస్తృతంగా చర్చిం చాలని సంఘాల నాయకులు అంటున్నారు. శాస్త్రీయ అధ్య యనం చేయకుండా హఠాత్తుగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి పాత మూల్యాంకన విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులకు నష్టమే..
-తిరుక్కోవెల శ్యామ్‌సుందర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఒక పాఠశాల విద్యార్థులు రాసిన పరీక్షల జవాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇలా చేస్తే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గుర్తించడం కష్టమవుతుంది. ఉపాధ్యాయులు వాల్యుయేషన్ కోసం ఇతర పాఠశాలలకు వెళ్తే బోధనకు ఆటంకం ఏర్పడి విద్యార్థులు నష్టపోతారు.
ప్రభుత్వం పునరాలోచించాలి
-బైరం హరికిరణ్, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
కొత్త మూల్యాంకన విధానాన్ని అమలు చేసే ముందు విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారులతో విస్తృతంగా చర్చించాల్సి ఉంది. దీనిపై శాస్త్రీయ అధ్యయనం జరిపి..విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి.
ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు..
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చే ఆదేశాల మేరకే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి సంబంధించి జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు చేపడతారు. కొత్త విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తదనుగుణంగా అమలు చేస్తాము.