Share News

రెడ్‌ అలర్ట్‌..

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:49 AM

జిల్లాలో భానుడు భగ భగ మండుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.

రెడ్‌ అలర్ట్‌..

జగిత్యాల, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భానుడు భగ భగ మండుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. జిల్లాలో వచ్చే రెండు, మూడు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు రెడ్‌ అలర్డ్‌ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మంగళవారం జిల్లాలోని మేడిపల్లిలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఫ బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం..

ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలు విరామం లేకుండా నడుస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా బయటకు వెళ్లే వారు శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా జిల్లాలో వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. మూగజీవాలు దాహార్తితో అల్లాడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో, బస్టాండులలో స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రాలు, నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు.

ఫజిల్లాలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో మంగళవారం అత్యధికంగా మేడిపల్లి మండల కేంద్రంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అధికారులు 45 డిగ్రీల పైన నమోదు అయితే రెడ్‌ అలర్ట్‌, 40 నుంచి 45 డిగ్రీల లోపు నమోదు అయితే ఆరెంజ్‌ అలర్ట్‌, 40 డిగ్రీల నుంచి 35 డిగ్రీల లోపు నమోదు అయితే ఎల్లో అలర్ట్‌, 35 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. అయితే జిల్లాలో మంగళవారం నాలుగు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో 45.2 డిగ్రీలు, మల్లాపూర్‌లో 45.1 డిగ్రీలు, రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మిగిలిన జిల్లా అంతటా ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

ఫవడదెబ్బతో జాగ్రత్త..

వృద్ధులు, చిన్నారులు, మహిళలు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. జిల్లాలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వడదెబ్బకు గురయ్యే కారణాలు, వడదెబ్బ లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వడదెబ్బ అంటే పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమవడం అని వైద్యులు వివరిస్తున్నారు. చాలా వేడియైున వాతావరణంలో, సరియైున మోతాదులో ద్రవ పదార్థాలని తీసుకోకుండా తీవ్ర వ్యాయమంలాంటి చురుకైన పనుల వలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుందని అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయని, వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైనదని చెబుతున్నారు. ఎండ తగలకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు.

ఫవడదెబ్బ లక్షణాలు..

శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. నీరసంగా అనిపిస్తుంది. కొందరికి కాళ్లు లాగుతాయి. తలనొప్పి వస్తుంది. శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు అవుతాయి. దాహం ఎక్కువగా ఉంటుంది. తల తిరగడం, మతి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె లయ తప్పి మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు కూడా సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఫతీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వడదెబ్బకు గురయినప్పుడు శరీరాన్ని వేగంగా చల్లబరిచే ప్రయత్నం చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకవెళ్లాలి. చల్లని నీళ్లు చల్లడం, ఫ్యాను గాలి ధారాళంగా తగలనీయాలి. దుస్తులను వదులుగా చేసి తడి గుడ్డతో ఒళ్లంతా తుడవాలి. రోగికి తగినంత గాలి ఆడేటట్లు చేయాలి. రోగి చుట్టూ గుమిగూడకూడదు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‌ పెట్టుకోవాలి. గొడుగు తీసుకవెళ్లాలి. రోజుకు ఐదు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఉప్పు కలిపిన ద్రవాలు లేదా ఓఆర్‌ఎస్‌ ద్రావణం త్రాగాలి. వదులైన కాటన్‌ దుస్తులను ధరించాలి. నూనె పదార్థాల వాడకం తగ్గించాలి. వేసవిలో శీతల పానీయాలు అంతగా మంచివి కావని వైద్యులు సూచిస్తున్నారు. వాటికి బదులు కొబ్బరి బోండాం, మజ్జిగ తాగడం మంచిది. వడదెబ్బతో కళ్లు పొడిబారే అవకాశం ఉంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా కూలింగ్‌ అద్దాలు పెట్టుకోవాలి.

అప్రమత్తంగా ఉండాలి

-డాక్టర్‌ నీలారపు శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జగిత్యాల

జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు అత్యవసర పనులు ఉంటే మినహా ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు. వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకవెళ్లి చికిత్స తీసుకోవాలి.

జిల్లాలో కొన్ని రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు..

--------------------------------------------------------------------------

తేదీ...గరిష్ఠ ఉష్ణోగ్రత (డిగ్రీలు)...ప్రాంతం

--------------------------------------------------------------------------

28 - 45.5 మేడిపల్లి మండల కేంద్రం

27 - 45.8 ధర్మపురి మండలం బుద్దేశుపల్లి

26 - 44.3 మల్లాపూర్‌ మండలం రాఘవపేట

25 - 44.3 ఎండపల్లి మండలం గుల్లకోట

24 - 44.1 రాయికల్‌ మండలం అల్లీపూర్‌

23 - 44.1 ధర్మపురి మండలం జైనా

22 - 43.6 బీర్‌పూర్‌ మండలం కొల్వాయి

21 - 43.6 బీర్‌పూర్‌ మండల కొల్వాయి

Updated Date - Apr 29 , 2026 | 12:49 AM