రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:06 AM
జిల్లాలో యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు రాగా అంచనాకు మించి కొనుగోళ్లు చేశారు. జిల్లాలో తొలుత అంచనా 5.12 లక్షల మెట్రిక్ టన్నులు కాగా జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో 5,42,258 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
జగిత్యాల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు రాగా అంచనాకు మించి కొనుగోళ్లు చేశారు. జిల్లాలో తొలుత అంచనా 5.12 లక్షల మెట్రిక్ టన్నులు కాగా జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో 5,42,258 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 2025-26 యాసంగి సీజన్‌లో జిల్లాలో 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగి సీజన్‌లో అనుకూల వాతావరణ పరిస్థితులు, అధిక దిగుబడులతో జిల్లాలో ధాన్యం దిగుబడి పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 436 కొనుగోలు కేంద్రాల ద్వారా 95,367 మంది రైతుల నుంచి 5,42,258 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు 5,15,437 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. జిల్లాలో 5,15,437 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 94,392 మంది రైతులకు రూ. 1,231.38 కోట్ల డబ్బులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో 436 కొనుగోలు కేంద్రాలు తెరిచి వంద శాతం కొనుగోళ్లు జరిపి 436 కేంద్రాలను మూసివేశారు.
ఫగతంలో కొనుగోళ్లు ఇలా..
కాగా జిల్లాలో 2021-22 యాసంగి సీజన్‌లో 2.70 లక్షల మెట్రిక్ టన్నులు, 2022-23 యాసంగి సీజన్‌లో 4.21 లక్షల మెట్రిక్ టన్నులు, 2023-24 యాసంగి సీజన్‌లో 4.27 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25 యాసంగి సీజన్‌లో 4.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో రానున్న రెండు, మూడు రోజుల్లో మరో వెయ్యి మెట్రిక్ టన్నుల లోపు ధాన్యం సేకరణ జరగవచ్చన్న అంచనాతో అధికారులున్నారు.
ఫసమస్యలను అధిగమించి కొనుగోళ్లు...
ప్రస్తుత సీజన్‌లో ధాన్యం సేకరణ ప్రారంభించిన తొలి వారం రోజుల్లో అమలు చేసిన ఆన్‌లైన్ విధానం, ఇరాన్‌లో యుద్ధం కారణంగా నెలకొన్న పెట్రోలు, డీజిల్ కొరత, బీహార్, బెంగాల్‌లో ఎన్నికలతో హమాలీల కొరత, ట్రాన్స్‌పోర్టు తదితర సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ అధికారులు సమన్వయంతో స్పందించి సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో నల్గొండ, నిజామాబాద్ జిల్లాల తర్వాత మూడో స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో ధాన్యం సేకరణ జరగడం రైతాంగానికి ఊరటనిచ్చే అంశంగా మారింది.
అన్ని వర్గాల సమన్వయంతో లక్ష్యానికి మించి కొనుగోళ్లు
-సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లలో అన్ని వర్గాల సహకారం, సమన్వయంతో లక్ష్యానికి మించి సేకరించాం. జిల్లా వ్యాప్తంగా 5.14 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరిపాము. పలు ఇబ్బందులు ఎదురయినప్పటికీ పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ కొనుగోళ్లు వేగవంతం చేశాం.