రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:05 AM
జిల్లాలో గడిచిన యాసంగి సీజన్ రైతులకు లాభాల పంటగా మారడమే కాకుండా, ధాన్యం కొనుగోళ్లలోనూ కొత్త రికార్డులను నమోదు చేసింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో గడిచిన యాసంగి సీజన్ రైతులకు లాభాల పంటగా మారడమే కాకుండా, ధాన్యం కొనుగోళ్లలోనూ కొత్త రికార్డులను నమోదు చేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో జిల్లాలో కొనుగోళ్లు గడిచిన ఐదేళ్ల సీజన్ల కంటే ఈ సీజన్‌లో కొనుగోళ్లు అధిగమించడం విశేషం. గడిచిన యాసంగి సీజన్‌లో 1,92,329 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. గురువారం ధాన్యం కొనుగోళ్లు ముగిసే నాటికి 1031 కోట్ల 85 లక్షల రూపాయల విలువైన 4,35,502.68 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 59,342 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఏ గ్రేడ్ ధాన్యం 7,437.96 మెట్రిక్ టన్నులు, కామన్ గ్రేడ్ ధాన్యం 4,28,064.72 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి 34,390 మెట్రిక్ టన్నుల మేర అదనంగా ధాన్యం సేక రించడం విశేషం. అనుకూల వాతావరణ పరిస్థితులు, సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండటం, రైతులు మెరుగైన సాగు పద్ధతులు పాటించడం వల్ల దిగుబ డులు పెరిగాయి. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెల్లువలా చేరింది. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని సేకరించారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు గిట్టుబాటు ధర పొందగలిగారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు, సకాలంలో చెల్లింపులు జరిపేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీఎస్‌ఓ శ్రీనాఽథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం ముప్పిడి శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీమాల, డీఆర్‌డీఓ కాళిందిని, తదితరులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ మక్కాన్‌సింగ్ ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించి అధికారులను పురమాయించారు. కొను గోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపుల్లోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో నిలుస్తోంది. ఇప్పటి వరకు రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో 93 శాతం 958 కోట్ల 31 లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన చెల్లింపులను కూడా త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు, వేగవం తమైన చెల్లింపులతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. యాసంగి సీజన్‌లో సాధించిన ఈ విజయంతో వ్యవ సాయ రంగంలో జిల్లా మరో మైలురాయిని చేరుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఫ తీపి జ్ఞాపకాలను మిగల్చిన యాసంగి..
జిల్లా రైతాంగానికి గడిచిన యాసంగి సీజన్ తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రకృతి పూర్తిగా సహకరించ డంతోపాటు సాగునీటి లభ్యత, రైతుల శ్రమ కలిసి వచ్చి జిల్లాలో వరి పంట రికార్డు స్థాయిలో దిగుబడిని చ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం ఉత్పత్తి కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి ప్రారంభం నుంచి కోతల వరకు వాతావరణం అనుకూలంగా ఉండటం రైతులకు కలిసి వచ్చింది. కీలక దశల్లో వర్షాలు, ఉష్ణోగ్రతలు పంటకు అనుకూలంగా మారడంతో వరి ఏపుగా పెరిగింది. తెగుళ్లు, చీడపీడల ప్రభావం కూడా తక్కువగా ఉండటంతో దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఎకరాకు ఆశించిన దానికంటే అధికంగా ధాన్యం చేతికొచ్చింది. ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయి. జిల్లాలో సాగు చేసిన పంటలో విత్తనోత్పత్తి కోసం 20 వేల ఎకరాలకు పైగా సాగు చేయగా, ఆ పంటను అంతా ఆయా విత్తన కంపెనీలు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. మిగతా పంట మొత్తం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది.
ఫగడిచిన ఐదేళ్లలో వానాకాలం, యాసంగి సీజన్లలో ధాన్యం కొనుగోళ్లు..
--------------------------------
సంవత్సరం వానాకాలం యాసంగి
--------------------------------------------
2021-22 314908 274309
2022-23 299757 349350
2023-24 188857 335616
2024-25 297379 401118
2025-26 354174 435508
--------------------------------------------