Share News

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో రికార్డు

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:08 AM

ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ ఐటీ (ఐఐఐటీ) ప్రవేశాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలలో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు.

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో రికార్డు

జగిత్యాల, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ ఐటీ (ఐఐఐటీ) ప్రవేశాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలలో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. 126 మంది విద్యార్థులు సీట్లు సాధించి జిల్లాను రెండో స్థానంలో నిలిపారు. కాగా 312 సీట్లతో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయంతో పాటు కొత్తగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు అయిన ట్రిపుల్‌ ఐటీలోనూ ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పేద, మద్య తరగతి విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రధానంగా బాసర ట్రిపుల్‌ ఐటీ (ఆర్‌జీయూకేటీ)లో జిల్లా నుంచి ప్రతి యేటా గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో సీట్లు సాధిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా మల్లాపూర్‌ మండలంలో 23 మంది విద్యార్థులు సీట్లు సాధించారు.

ఫప్రభుత్వ పాఠశాలల హవా..

జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ (జిల్లా పరిషత్‌), ఆదర్శ, మోడల్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా వరసగా రెండు సంవత్సరాలు నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌లలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ సీట్లు పొందుతున్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు కేవలం ట్రిపుల్‌ ఐటీలకే పరిమితం కాకుండా, ఐఐటీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లలో సైతం జిల్లాకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించి సీట్లు సొంతం చేసుకుంటున్నారు.

ఫగ్రామీణ విద్యార్థుల ప్రతిభ..

జిల్లాలోని పలువురు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలు సాధించే విజయాల్లో ఎక్కువ శాతం మంది గ్రామీణ నేపథ్యం ఉన్న వారే కావడం విశేషం. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్యా విధానం కూడా విద్యార్థులకు ఎంతో దోహదపడుతోంది. దీనికి తోడు డీఈవో రాము ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పదో తరగతిలో మంచి ఫలితాలు రాబట్టడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. రెండేళ్ల క్రితం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు పొందారు. గత యేడాది పదో తరగతిలో కొత్తగా మార్కులు విధానాన్ని అమలు చేయడంతో వాటినే ప్రామాణి కంగా తీసుకున్నారు. ఈసారి సైతం మార్కుల విధానాన్నే అమలు చేయనున్నారు.

ఫవిద్యార్థులకు సన్మానాలు

ట్రిపుల్‌ ఐటీ సీట్లు సాధించడంలో జిల్లాను రెండో స్థానంలో నిలబెట్టిన విద్యార్థులను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినం దిస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, డీఈవో రాము తదితర పలు సందర్బాల్లో పలువురు విద్యార్థులను సత్కరించారు. కోరుట్ల నియోజకవర్గంలోని 42 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సాధించగా రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ విద్యార్థులను సత్కరించి జ్ఞాపికలను అందించారు. విద్యార్థుల విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, విద్యాశాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడం సంతోషకరం

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో జిల్లా నిలవడం సంతోషకరం. నిరంతర కృషి, ప్రణాళికబద్ధమైన బోధన, సమర్థవంతమైన పర్యవేక్షణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయి. పదో తరగతి ఫలితాల్లో కూడా రాష్ట్రంలో వరుసగా జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.

మండలాల వారీగా సీట్లు సాధించిన విద్యార్థులు

--------------------------------------------------------------------------------

మండలం...విద్యార్థుల సంఖ్య

--------------------------------------------------------------------------------

బీర్‌పూర్‌ - 13

బీమారం - 3

బుగ్గారం - 2

ధర్మపురి - 3

ఎండపల్లి - 1

గొల్లపల్లి - 7

ఇబ్రహీంపట్నం - 6

జగిత్యాల - 8

జగిత్యాల రూరల్‌ - 15

కథలాపూర్‌ - 4

కోరుట్ల - 13

మల్లాపూర్‌ - 23

మల్యాల - 4

మేడిపల్లి - 5

రాయికల్‌ - 8

సారంగపూర్‌ - 3

----------------------

మొత్తం - 126

----------------------

Updated Date - Jun 04 , 2026 | 01:08 AM