Share News

‘సర్‌’కు సిద్ధం

ABN , Publish Date - May 26 , 2026 | 12:58 AM

ఎన్నికలు వచ్చాయంటే ఓటరు దేవోభవ.. అంటూ రాజకీయ నేతలు పరుగులు తీస్తారు. సామాన్యుడి నిర్ణయాలతో రాజకీయాలు, దేశ భవిష్యత్‌లోను మార్పులు వస్తాయి.

‘సర్‌’కు సిద్ధం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎన్నికలు వచ్చాయంటే ఓటరు దేవోభవ.. అంటూ రాజకీయ నేతలు పరుగులు తీస్తారు. సామాన్యుడి నిర్ణయాలతో రాజకీయాలు, దేశ భవిష్యత్‌లోను మార్పులు వస్తాయి. ఓటుకు రాజకీయ నేతల భవిష్యత్త్‌ చూపుడు వేలుకు పెట్టే సిరా చుక్కతో తారుమారవుతుంది. ఓటర్లే నిర్ణేతలుగా ఉంటారు. మనిషికి ఒక వజ్రాయుధంగా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు ఓటు హక్కు. అది పొందడానికి ఎన్నికల కమిషన్‌ విసృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే ప్రజాస్వామ్య బలోపేతానికి స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పన అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్‌ జాబితా ప్రక్షళనకు పూనుకుంది. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గాల్లో బీఎల్‌వోలు ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ను కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 79.63 శాతం పూర్తి చేశారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 76.31శాతం, వేములవాడ నియోజకవర్గంలో 83.66 పూర్తి చేశారు. సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు, తహసీల్దారులు క్షేత్రస్థాయిలో బోగస్‌, డబుల్‌ ఓట్లు, జాబితాలో మృతుల పేర్ల తొలగించే లక్ష్యంగా ఓటర్ల సమగ్ర సవరణ కొనసాగిస్తున్నారు.

జిల్లాలో 382492 మంది ఓటర్ల మ్యాపింగ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 480343 మంది ఓటర్లు ఉండగా ఎస్‌ఐఆర్‌లో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటి సర్వేలో 382492 మంది ఓటర్లకు మ్యాపింగ్‌ చేశారు. రెండు నియోజకవర్గాల్లో 79.63 శాతం పూర్తయింది రాష్ట్రంలో 13 స్థానంలో ఉంది. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్ళపల్లి, ముస్తాబాద్‌ మండలాల్లో 249763మంది ఓటర్లు ఉండగా, 190594 ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేశారు. 76.31 శాతం జరిగింది. వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్‌, రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్‌, వేములవాడ అర్బన్‌, కోనరావుపేట మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 230580 మంది ఓటర్లు ఉండగా 191898 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేశారు. 83.22 శాతంగా ఉంది.

జూన్‌ 25 నుంచి ఇంటింటి సర్వే..

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌లో భాగంగా మ్యాపింగ్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్‌ 15 నుంచి 24 వరకు సన్నాహ సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్‌ 25నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే. జులై 24 నాటికి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 31న ఓటర్‌ జాబితా ముసాయిదా వెల్లడిస్తారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరిస్తారు. తుది ఓటర్‌ జాబితాను అక్టోబర్‌ 1వ తేదిన వెల్లడిస్తారు. ఓటర్‌ జాబితాలో చనిపోయిన వారు, డూప్లికేట్‌, శాశ్వతంగా వలసపోయిన వారు, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు.

చివరిసారిగా 2002లో సర్వే..

ఓటర్‌ జాబితా ప్రక్షాళన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో ఎస్‌ఐఆర్‌ సర్వే జరిగింది. అప్పటి ఓటర్‌ జాబితాతో పాటు 2025 ఓటర్‌ జాబితాను బీఎల్‌వోలకు అందించి దీని ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి పాత లిస్టులోని పేర్లు కొత్త జాబితాలోను ఉంటే మ్యాపింగ్‌ చేస్తున్నారు. వారి సంతాన వివరాలను కూడా సేకరిస్తున్నారు. కుటుంబీకుల పేర్లు జాబితాలో ఉంటే మ్యాపింగ్‌ చేస్తున్నారు. ప్రతి బూత్‌స్థాయి అధికారులు 2025 ఓటర్‌ జాబితాలోని 40ఏళు,్ల ఆపైన ఉన్న వారి ఓటర్లను 2002 ఓటర్‌ జాబితాలో గుర్తించి బీఎల్‌వోలు యాప్‌లో అప్డేట్‌ చేస్తున్నారు. తర్వాత వారి పిల్లల పేర్లను వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఓటర్‌జాబితా మ్యాపింగ్‌ సర్వేలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎస్‌ఐఆర్‌ సర్వే తర్వాత ఓటర్లు జిల్లాలో తగ్గిపోతారని భావిస్తున్నారు.

ఓటర్‌ జాబితా మ్యాపింగ్‌ లెక్క ఇది

సిరిసిల్ల నియోజకవర్గం

మండలం మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ ఓటర్లు శాతం

వీర్నపల్లి 11,688 10,006 85.61

ఎల్లారెడ్డిపేట 40,567 32,739 80.70

గంభీరావుపేట 37,321 31,350 84.00

సిరిసిల్ల 81,592 52,547 64.40

తంగళ్ళపల్లి 40,213 30,306 75.36

ముస్తాబాద్‌ 38,382 33,646 87.66

మొత్తం 2,49,763 1,90,594 79.31

వేములవాడ నియోజకవర్గ

మండలం మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ ఓటర్లు శాతం

మేడిపల్లి 24,523 20,390 84.37

భీమారం 17,735 14,987 84.51

కథలాపూర్‌ 38,172 29,785 78.03

రుద్రంగి 87,77 8,583 97.79

చందుర్తి 28,296 25,510 90.15

వేములవాడ రూరల్‌ 19,002 16,999 89.46

వేములవాడ అర్బన్‌ 58,613 45,678 77.93

కోనరావుపేట 35,462 29,666 83.66

మొత్తం 2,30,580 1,91,898 83.22

Updated Date - May 26 , 2026 | 12:58 AM