విజృంభిస్తున్న విషజ్వరాలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:30 AM
జిల్లాలో వివిధ రకాల వ్యాధులు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్‌లతో పాటు మలేరియా, డెంగీ రోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ వైపు ప్రజారోగ్యం మెరుగుదలకు ఏటా లక్షలాది రూపాయల్ని కుమ్మరిస్తున్నా.. వ్యాధులను నియంత్రించడంలో మాత్రం జిల్లా యంతారంగం విఫలమవుతోంది. ముఖ్యంగా దోమల నిర్మూలనలో కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలతో పాటు గ్రామపంచాయతీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి
- రోగులతో కిక్కిరిస్తున్న ఆస్పత్రులు
- దోమల దండుతో వ్యాధుల ముప్పు
- వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైతే మేలు
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
- కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌కు గత మూడు రోజులుగా సగటున 1600 నుంచి 1800 మంది పేషెంట్లు వచ్చారు. వీరంతా జ్వరం, జలుబు, గొంతునొప్పి సమస్యలను డాక్టర్ల వద్ద ఏకరువు పెట్టారు. దీంతో పాటు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలలో ఇక్కడి ఆస్పత్రికి సగటున 800 నుంచి 1000 మంది ఔట్ పేషెంట్లు (ఓపీ) రాగా.. ఈ నెలలో గత నాలుగు రోజులుగా వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్య దాదాపుగా రెట్టింపు అయింది.
- ఇంకా ఈసారి అసలు అనుకున్న విధంగా వర్షాలు సమృద్ధిగా కురియలేదు. కురిస్తే ఇప్పుడున్న పరిస్థితి మరింత దయనీయంగా మారేవీలుంది. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపా లిటీల్లో పారిశుధ్యం మరింత అస్తవ్యవస్తంగా తయారయ్యేది. పల్లెల్లోనూ మురికికూపాలు పెరిగేవి. ఇటీవల వాతావరణంలోని మార్పులే ఈ వ్యాధుల పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఎండ, వానల పరిస్థితుల వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
==================
జిల్లాలో వివిధ రకాల వ్యాధులు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్‌లతో పాటు మలేరియా, డెంగీ రోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ వైపు ప్రజారోగ్యం మెరుగుదలకు ఏటా లక్షలాది రూపాయల్ని కుమ్మరిస్తున్నా.. వ్యాధులను నియంత్రించడంలో మాత్రం జిల్లా యంతారంగం విఫలమవుతోంది. ముఖ్యంగా దోమల నిర్మూలనలో కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలతో పాటు గ్రామపంచాయతీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దోమలు ప్రజలపై దండెత్తుతున్నాయి. కరీంనగర్‌లో సాయంత్రం అయిందంటే ఆయా డివిజన్‌లలో రక్తం పీల్చడానికి ఇవి సిద్ధమవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా నగరంలోని కొన్ని చోట్ల ఫాగింగ్ చేపట్టినా దోమల స్వైరవిహారం మాత్రం తగ్గడం లేదు. ఇక పల్లెల్లో మాత్రం అసలు ఫాగింగ్ చేద్దామన్నా.. చేయని దుస్థితి నెలకొంది. యంత్రాలు పాడైపోవడం.. ఇవి ఉన్న చోట నిధులు లేకపోవడంతో ప్రజారోగ్యాన్ని పాలకులు, అధికారులు గాలికొదిలేస్తున్నారు.
ఫ పెరుగుతున్న డెంగీ కేసులు
ఈ ఏడాదిలో కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌లో ఆరు డెంగీ కేసులను వైద్యసిబ్బంది నిర్ధారించారు. వైద్యారోగ్యశాఖ పరిశీలనల్లోనూ ఆయా పీహెచ్‌సీల పరిధిలో మరికొన్ని కేసుల్ని గుర్తించినట్లు తెలిసింది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నది. 2025లో ఆగస్టు నుంచి మూడు నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 88 డెంగీ కేసులను గుర్తించారు. మలేరియా కేసులను కూడా పలు ప్రాంతాల్లో గుర్తించి అక్కడ దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 40కి పైగా గతేడాది కేసులు గుర్తించినట్లు సమాచారం. డ్రైనేజీల పూడిక తీయకపోవడం. మురుగు నీరు ఎక్కడిక్కడ నిలుస్తుండటం, చెత్తను తొలగించని ప్రాంతాల్లో దోమలు దండిగా వృద్ధి చెందుతున్నాయి. పాతటైర్లు, నీటి ట్యాంకుల్లో పెరిగే లార్వాను అరికట్టడానికి జిల్లాలో ముందస్తు చర్యలు ఇంకా తీసుకోలేదు. డ్రైడేను పాటించాలని ఇటీవలే నిర్ణయించారు. మురికి కూపాల్లో గంబూషియా చేపల్ని వదిలి దోమలు పెరుగ కుండా చూసే ప్రక్రియను ఇంకా మున్సిపల్ సిబ్బంది ప్రారంభించలేదు. దీంతో మురికివాడల్లోని జనాలు దోమల తాకిడిని తట్టుకోలేకపోతున్నారు.
ఫ అప్రమత్తత అవసరం
సీజనల్ వ్యాధులు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు వరుస కడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో జ్వరం, జలుబు, గొంతునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు, మెడికల్ దుకాణాలకు పరుగెత్తి జ్వరాల కోసం ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోకుండా చూడటానికి వైద్యారోగ్యశాఖ ముందస్తుగానే అప్రమత్తమవ్వాలి. గతేడాది నిర్వహించిన విధంగా ముందుగా ఇంటింటి సర్వే నిర్వహించి ఉచితంగా మాత్రలను పంపిణీ చేయాలి. పురపాలిక, కార్పొరేషన్, వైద్యారోగ్యశాఖ పరిధిలోని సిబ్బంది కలిసికట్టుగా పారిశుధ్య నిర్వహణ లోపాలున్న చోట సత్వర చర్యలు తీసుకోవాలి. మలేరియా, డెంగీ వ్యాప్తి ఉన్న పరిసరాలను గుర్తించాలి. మున్సిపాలిటీ రెస్క్యూ, శానిటేషన్ టీం కల్వర్టులు, నాలాలు శుభ్రపర్చాలి. నిలిచిన మురికి నీటిని తొలగించాలి. అవసరమైన చోట ఫాగింగ్ చేయాలి. కేవలం ఫాగింగ్‌తో సరిపెట్టకుండా దోమల లార్వా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ఇక జిల్లా ఆసుపత్రి నుంచి పీహెచ్‌సీ, బస్తీ, పల్లె దవాఖానా వరకు ఈ సీజన్‌కు సరిపడే విధంగా మాత్రలను, సిరప్‌లను, ఇంజక్షన్‌లను తెప్పించి పెట్టుకోవాలి. ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని మాత్రల కొరత ఉందని తెలిసింది. ఇప్పటికైనా వైద్యారోగ్యశాఖ ముందస్తుగా చర్యలు తీసుకుని ఔషధాల లోటు లేకుండా చూడాలి.