జోరుగా మట్టిదందా
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:30 AM
జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి మాఫియా తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి జేబులు నింపుకుంటు న్నారనే ఆరోపణలున్నాయి.
- ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి
- అనుమతులు లేకుండా తవ్వకాలు
- రాత్రి, పగలు అక్రమ రవాణా
- పట్టించుకోని అధికారులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి మాఫియా తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి జేబులు నింపుకుంటు న్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని గుట్టల నుంచి రాత్రింబవళ్లు అక్రమ రవాణా చేపడుతుండగా, మరికొన్ని గుట్టల నుంచి పట్టపగలే రవాణా చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మట్టి మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుట్టల నుంచి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపట్టడం వల్ల పర్యావరణం సమతుల్యం దెబ్బతింటున్నది.
పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికోసం కావలసిన మట్టిని సమీపంలో ఉండే గుట్టల నుంచి పెద్దఎత్తున తరలిస్తున్నారు. కొందరు గనులు భూగర్భ శాఖ నుంచి నామమాత్రంగా అనుమతులు తీసుకుంటున్నప్పటికీ, అనుమతుల గురించి పెద్ద ఎత్తున మట్టి రవాణా చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలోనీ పెద్దపల్లి మండలం రాఘ వపూర్, పాలితం, బొంపెల్లి, తుర్కలమద్దికుంట, కాల్వశ్రీరాంపూర్ మండలం లోని పాండవులగుట్ట, రాయపేటగుట్ట, పెగడపల్లిగుట్ట, గంగారం గ్రామాల్లోని కోతిగట్టు, వెన్నంపల్లి, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, జూలపల్లి మండలం కాచాపూర్, చీమలపేట, తేలుకుంట, కుమ్మరికుంట, వడుకాపూర్ శివారులో గల ప్రభుత్వ భూముల నుంచి పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు. ఎలిగేడు మండలంలోని ర్యాకల్‌దేవ్‌పల్లి, సుల్తాన్‌పూర్ వివిధ గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టల నుంచి మట్టిని తవ్వి రోడ్ల కోసం తరలిస్తున్నారు. సుల్తానాబాద్, పెద్దపల్లిలో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్‌ల కోసం మట్టిని సమీపంలోని గుట్టల నుంచి కాంట్రాక్టర్లు తీసుకువస్తున్నారు. ఇందులో కొంతమేరకు మాత్రమే అనుమతులు తీసుకొని అంతకుమించి మట్టిని తీసుకువచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లకు సైతం మట్టి తరలిస్తున్నారు. మంథని, రామగుండం నియోజకవర్గాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలకు, నేషనల్ హైవే పనులకు సైతం మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మంథని, ముత్తారం, పలు మండలాల్లోని గ్రామాల గుట్టలు నుంచి నామమాత్రంగా అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో కూడా అక్రమ మట్టి రవాణా సాగుతున్నట్లు సమాచారం.
ఫ గుల్ల అవుతున్న కన్నాల బోడ గుట్ట..
పాలకుర్తి మండలం కన్నాల బోడగుట్ట నుంచి రోజు రాత్రి పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. 50 నుంచి 60 లారీల మట్టిని తరలిస్తుం డగా, వేసవిలో 100కు పైగా లారీల్లో మట్టిని ఆక్రమంగా తరలిస్తున్నారు. ఈ గుట్ట నుంచి మట్టి, బండ తవ్వకుండా గనులు భూగర్భ శాఖ అధికారులు బోర్డ్ ఏర్పాటు చేసినప్పటికీ మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. ఒక్కో లారీలో 20 నుంచి 25 టన్నుల వరకు తరలిస్తున్నారు. ఒక్కో టన్నుకు ప్రభుత్వానికి 53 రూపాయలు చెల్లించకుండానే మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇల్లు నిర్మించుకునే వారికి మట్టిని విక్రయిస్తున్నారు. రోజుకు వెయ్యి నుంచి 1500 టన్నుల మట్టిని అక్రమంగా తరలిపోతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
ఫ జిల్లాలో పర్యవేక్షణ కరువు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైంది. గనులు భూగర్భ శాఖ అధికారులు, రెవె న్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెండు నెలలుగా గనులు భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. జగిత్యాల అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన సక్రమంగా జిల్లాకు రావడం లేదని విమర్శలున్నాయి. కార్యాలయంలో కూడా ఏజీ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఒక ఆర్‌ఐ, ఒక సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది మినహా మరెవ్వరూ లేరు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే శాఖలో పోస్టులు ఖాళీ ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వాళ్ళు కరువయ్యారు. కలెక్టర్ స్పందించి రెవెన్యూ, పోలీస్ శాఖాధికారులతో మట్టి మాఫియాపై కొరడా ఝులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.