ఇందిరమ్మ ఇళ్లకు ‘రామ్‌జీ’.. రాంరాం
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:40 AM
పేదవాళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్‌జీతో భారాన్ని మోపారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పేదవాళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్‌జీతో భారాన్ని మోపారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మార్పులు తీసుకొచ్చి ఈనెల 1వ తేదీ నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్(వీబీజీరామ్‌జీ)న అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉపాధిహామీ పథకానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా ప్రతి ఇంటి నిర్మాణానికి ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారుడికి 90 రోజుల పని దినాలకు వేతనంగా రూ.27 వేల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు చేసింది. నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకంలో మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉపాధి కూలీ పనులను తొలగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇళ్లపై దాదాపు రూ.27 వేల వరకు అదనపు భారం పడనుంది. దీని ద్వారా ప్రస్తుతం నిర్మించే ఇళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8.91 కోట్ల వరకు అదనపు భారం పడనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు విడతల్లో 7,367 ఇళ్లను మంజూరు చేశారు. 5,874 ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఇందులో ఇప్పటివరకు 3,139 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు. వివిధ దశల్లో 2,735 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిని కూడా వేగవంతంగా పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.
ఉపాధిహామీకి 4,064 ఇళ్లు అనుసంధానం
ప్రభుత్వం రూ 5 లక్షల వ్యయంతో నిరుపేదలకు సొంత ఇంటి నిర్మాణాలను చేపట్టిన ఇందిరమ్మ పథకంలో 7,367 ఇళ్లు మంజూరు కాగా, సిరిసిల్ల నియోజకవర్గానికి 3,242 ఇళ్లు, వేములవాడ నియోజకవర్గానికి 2,866 ఇళ్లు, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో ఉన్న జిల్లాలోని బోయినపల్లి మండలానికి 646 ఇళ్లు, ఇల్లంతకుంట మండలానికి 613 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఉపాధిహామీ పథకానికి 4,064 ఇళ్లు మంజూరు ఇచ్చారు. దీని ద్వారా 5,718 మంది కూలీలకు 3,65,760 వేతన పనిదినాలను సమకూర్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 90 రోజుల పని దినాలను 415 జాబ్‌కార్డు కూలీలు పూర్తిచేశారు. ఇందులో బోయినపల్లిలో 48 మంది, చందుర్తిలో 23మంది, ఇల్లంతకుంటలో 35 మంది, గంబీరావుపేటలో 44 మంది, కోనరావుపేటలో 57 మంది, ముస్తాబాద్‌లో 31 మంది, రుద్రంగిలో నాలుగురు, తంగళ్లపల్లిలో 65 మంది, వీర్నపల్లిలో 8 మంది, వేములవాడలో 7 మంది, వేములవాడ రూరల్‌లో 62 మంది, ఎల్లారెడ్డిపేటలో 31మంది కూలీలు ఉన్నారు. వీబీ జీ రామ్ జీ పోర్టల్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈనెల 10వ తేదీ వరకు అప్లోడ్‌కు వెసులుబాటు ఉంది. ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారుడికి ప్రభుత్వం దశలవారీగా చెల్లింపులు చేస్తున్నారు. ఈ పథకానికి గతంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేసి ఉపాధిహామీ పథకం నుంచి 90 రోజుల పని దినాలను కల్పిస్తూ అందుకు వేతనంగా రూ 27 వేల వరకు అందిస్తున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ 12 వేలు, ఇంకుడు గుంతకు రూ 6 వేలు చెల్లిస్తున్నారు. మిగతా డబ్బులు ప్రభుత్వం మూడు విడతలుగా చెల్లింపులు చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ పథకంలో 318 పనులను మార్గదర్శకాల్లో చూపించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని తొలగించింది. దీంతో ఉపాధిహామీ నుంచి అందాల్సిన 90 రోజుల పని దినాల వేతనాలు అందని పరిస్థితి ఉంటుంది. స్వచ్ఛభారత్ మిషన్‌కు సంబంధించి రూ 12 వేలు, ఇంకుడుగుంతకు రూ 6 మాత్రం వర్తించనున్నాయి. ఇకముందు నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి చెల్లించే కూలీల వేతనాలు నిలిచిపోతాయని భావిస్తున్నారు.
జిల్లాలో ఉపాధిహామీలో మంజూరు చేసిన ఇళ్లు, పని దినాలు
మండలం మంజూరైన ఇళ్లు పని దినాలు కూలీలు
బోయిన్‌పల్లి 481 43,290 205
చందుర్తి 371 33,390 908
ఇల్లంతకుంట 526 47,340 498
గంభీరావుపేట 346 31,140 797
కోనరావుపేట 406 36,540 666
ముస్తాబాద్ 361 32,490 400
రుద్రంగి 168 15,120 306
తంగళ్ళపల్లి 408 36,720 748
వీర్నపల్లి 157 14,130 57
వేములవాడ 188 16,920 256
వేములవాడ రూరల్ 254 22,860 203
ఎల్లారెడ్డిపేట 398 35,820 674
మొత్తం 4,064 3,65,760 5,718
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు..
మండలం మంజూరైన ఇళ్లు పూర్తయిన ఇళ్లు
గంభీరావుపేట 525 204
ముస్తాబాద్ 252 231
సిరిసిల్ల 857 317
తంగళ్ళపల్లి 554 280
వీర్నపల్లి 207 68
ఎల్లారెడ్డిపేట 574 236
చందుర్తి 506 201
కోనరావుపేట 499 286
రుద్రంగి 248 119
వేములవాడ అర్బన్ 750 122
వేములవాడ రూరల్ 336 180
వేములవాడ మున్సిపల్ 527 208
బోయిన్‌పల్లి 646 356
ఇల్లంతకుంట 613 331
మొత్తం 7367 3139