Share News

వైభవంగా రాఖీ పౌర్ణమి

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:25 AM

రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరీమణులు వారి సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.

వైభవంగా రాఖీ పౌర్ణమి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు తన నివాసంలో రాఖీ కడుతున్న సోదరి శైలజ

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరీమణులు వారి సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. సోదర ప్రేమను ఆకాంక్షిస్తూ ఆడపడచులు పసుపు కుంకుమలతో, మంగళహారతులతో అందమైన విభిన్న రీతుల రాఖీలతో సందడిగా కన్పించారు. ఈ సందర్భంగా రాఖీలు, స్వీట్‌ షాపులు జనంతో కిటకిటలాడాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్యాలయాలు, ఆలయాల్లో రక్షాబంధనం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన మంత్రులు, నాయకులు వేడుకల్లో పాలు పంచుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణులు, వటువులు యజ్ఞోపవీతాలు మార్చుకుని ఉపాకర్మ పూజలు జరిపారు. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అతని సోదరులు శ్రవణ్‌కుమార్‌, సంపత్‌కుమార్‌కు మంత్రి నివాసంలో సోదరి కావేటి శైలజ రాఖీ కట్టారు. హైదరాబాద్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సోదరులు పొన్నం అశోక్‌గౌడ్‌, పొన్నం రవిచంద్రకు సోదరీమణులు పుల్ల రాణి, మల్లెపూల విమల రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో ఆయనతోపాటు సోదరులు గంగుల వెంకన్న, గంగుల సుధాకర్‌కు సోదరీమణులు పుష్పలత, స్వర్ణలత, అరుణలత రాఖీలు కట్టారు. వేదభవనంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వరప్రసాదాచార్యస్వామి ఆధ్వర్యంలో శ్రీవైష్ణవ వైదిక సేవా సంఘం సమన్వయంతో వటువులకు ఉపాకర్మలు జరిగాయి. దేవుళ్లపురిలో శివభక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఆలయ సంక్షేమ ట్రస్టు ఆధ్వర్యంలో గాయత్రీదేవి పూజ, హవనం, యజ్ఞోపవీత ధారణలు జరుగగా ట్రస్టు వ్యవస్థాపకుడు చిలుక నరసప్ప పాల్గొన్నారు. సరస్వతీ శిశు మందిర్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో మంచిర్యాల, కోర్ట్‌, భగత్‌సింగ్‌, కమాన్‌ చౌరస్తాల్లో ఉన్న దుకాణాలు, కార్యాలయాలు, వివిధ సంస్థల బాధ్యులకు రాఖీలు కట్టారు. ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Aug 29 , 2026 | 12:25 AM