చిక్కిపోతున్న రాజీవ్ రహదారి
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:07 AM
అధికారుల ఉదాసీనత, పట్టింపులేని తనం, పర్యవేక్షణ లోపంతో జిల్లాలోని కీలకమైన రాజవ్‌రహదారి కుదించుకుపోతోంది.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్ )
అధికారుల ఉదాసీనత, పట్టింపులేని తనం, పర్యవేక్షణ లోపంతో జిల్లాలోని కీలకమైన రాజవ్‌రహదారి కుదించుకుపోతోంది. రోడ్డుకిరువైపులా ఉన్న స్థలాలు కబ్జాకు గురవుతుండడంతో ఎక్కడికక్కడే ఈ మార్గం చిక్కిపోతోంది. నిత్యం వందల సంఖ్యల్లో వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి స్థలాలను కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారు. అడిగేవారు లేరనే ఽధీమాతో అందినకాడికి సర్కారు స్థలాలను తమ వశం చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రహదారికి ఆనుకుని ఉన్న స్థలాలు కోట్ల రూపాయల విలువ పలుకుతుండడంతో కొందరు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు.
ఫ నగర పరిసరాల్లో ఇష్టారాజ్యంగా...
సిద్దిపేట జిల్లా సరిహద్దు నుంచి పెద్దపల్లి జిల్లా శివారు వరకు 47 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంటుంది. రేణికుంట టోల్ ప్లాజా నుంచి కరీంనగర్ వరకు పలుచోట్ల గతంలో రోడ్డు పక్కన ఉన్న స్థలాలు ఇతరులు ఆక్రమించకుండా ఇనుప కంచెలను అధికారులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఈ నాలుగు వరుసల రోడ్డును ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ సమయంలోనే రోడ్డుకిరువైపులా సేకరించి హద్దులు పెట్టారు. ఈ సేకరించిన భూమని రక్షించేందుకు కొన్నిచోట్ల కోట్లాది రూపాయలు పెట్టి కంచెలను ఏర్పాటు చేయించారు. కానీ స్థిరాస్తి వ్యాపారులు కొందరు రోడ్ల పక్కన ఉన్న స్థలాల కోసం అడ్డుగా ఉన్న కంచెల ఆనవాళ్లు లేకుండా చేశారు. కొన్ని చోట్ల పొలాల వద్దకు వెళ్లేందుకు వీటిని తొలగించారు. మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న రోడ్డును చూస్తే ఇది రాజీవ్‌రహదారి అంటే నమ్మని దుస్థితి నెలకొంది. తిమ్మాపూర్ నుంచి ఇరుకుల్ల వరకు రోడ్డుకిరువైపులా కొన్నేళ్ల క్రితమే స్థలాలు కబ్జాకు గురయ్యాయి. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి బొమ్మకల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు కొన్ని చోట్ల 40 అడుగుల దారి కూడా లేదు. వాస్తవానికి మధ్యలో ఉన్న డివైడర్‌పోను ఆయా ప్రాంతాలనుబట్టి 80 నుంచి 100 అడుగుల మేర ఈ రోడ్డుని గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ఆక్రమణలు తొలగించకపోతే భవిష్యత్తులో ఈ రోడ్డుని 180-200 అడుగులకు పెంచాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫ దర్జాగా చెరబట్టేస్తున్నారిలా..
- ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరుకుల్ల వద్ద రాజీవ్‌రహదారిని ఓ రియల్టర్ తన వెంచర్ కోసం ఆక్రమించి పైప్‌లైన్లు ఏర్పాటు చేశారని స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోనే పనులు ఆపాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ ఆక్రమణల వ్యవహారం నేషనల్ హైవే అథారిటీ, ఆర్‌ఆండ్‌బీ శాఖ దృష్టికి వెళ్లింది.
- తీగల వంతెన చౌరస్తాతోపాటు హౌసింగ్‌బోర్డు రోడ్డులో రహదారి ఇరుకుగా మారిపోయింది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, షెడ్ల ఏర్పాటు, ఇతర నిర్మాణాలు చేపట్టిన వాళ్లంతా రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలాలను 2 నుంచి 5 మీటర్ల వరకు కబ్జా చేశారు. బోర్డులు, సూచికల ఏర్పాటుతోపాటు ఇష్టానుసారంగా వాహనాలను నిలుపుతున్నారు.
- ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. పలుచోట్ల వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ద్విచక్రవాహనదారులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకోవాల్సి వస్తోంది. ఆక్రమణలతో రోడ్డు ఇరుకుగా మారడంతో వేగంగా వచ్చే వాహనాల నియంత్రణ కష్టమై ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫ సమన్వయంతో స్పందిస్తేనే రక్షణ
రోడ్డు భవనాల శాఖ, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన అధికారులు సమన్వయంతో స్పందించి కలిసికట్టుగా రాజీవ్‌రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణల్ని తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. గతంలో ఉన్న హద్దుల ఆధారంగా రోడ్డు పరిధిలో ఉన్న స్థలాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోలేదని, వాహనాల పత్రాలు లేవని పదే పదే తనిఖీలు చేస్తూ జరిమానాలు వేసే పోలీసులకు ఇలా రోడ్డు పక్కనే ప్రమాదాలకు ఆస్కారమిచ్చే విధంగా కబ్జాలు కనబడకపోవడం శోచనీయం. రోడ్డు భద్రతను బాధ్యతగా గుర్తించే అధికారులు ఇకమీదటనైనా ఈ ఆక్రమణల పర్వానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.