Rajanna siricilla : నారుమడులు.. నోరెళ్లబెడుతున్నాయ్..
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:55 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) అన్నదాతల ఆశల సాగు దిగాలు నింపింది. ఎల్‌నినో రూపంలో కరువు కష్టాన్ని తెచ్చింది.
- వర్షాలు కురవక ఎండిపోతున్న వరినారు
- వరి సాగుపై ఆచితూచి అడుగు
- ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు
- వరి సాగు అంచనా 1.91 లక్షల ఎకరాలు
- నాట్లు పడింది 42 వేల ఎకరాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్నదాతల ఆశల సాగు దిగాలు నింపింది. ఎల్‌నినో రూపంలో కరువు కష్టాన్ని తెచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్ మాసంలో కురిసిన తొలకరి జల్లులకు వానాకాలం పంటల కోసం రైతులు వరి పంటను ప్రధానంగా వేసుకోవడానికి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు అడపాదడప వర్షాలు పడడంతో రైతులు పత్తి విత్తనాలు వేసుకొని సాగు కష్టాలను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో దాదాపు 50 రోజులు గడిచిపోయినా లోటు వర్షపాతమే కొనసాగుతోంది. వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగును ఆచితూచి రైతులు సాగు చేస్తున్నారు. నోరెళ్లబెడుతున్న నారుమడలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మొలకలు భూమిలోనే మాడిపోతున్నాయి. బోరు బావుల వద్ద వేసుకున్న వరి నాట్లు నీరు అందగా వాడిపోతున్నాయి. దీంతో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా వరి 1.91 లక్షల ఎకరాలు, పత్తి 47120 ఎకరాలు, ఇతర పంటలు 1021 ఎకరాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. వర్షాలు లేక పత్తి సాగు మినహా ఇతర పంటలు అనుకున్న మేరకు ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 92వేల 565 ఎకరాలు మీద పంటలు సాగు చేశారు. మరోవైపు 50 రోజులు గడుస్తున్న లోటు వర్షపాతం కొనసాగుతోంది.
నారు పోసుకున్న నీరు లేదాయె..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ప్రధానంగా వరి సాగు పైనే ఆధారపడి ఖరీఫ్ సాగు మొదలుపెడతారు. ప్రతి వర్షాకాలంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పంట చివరకు చేతికొచ్చే పరిస్థితులు కొనసాగేవి. ఈసారి మాత్రం వర్షాలు లేక ఖరీఫ్ సాగు కష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు వరి సాగు చేయాలా..వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరి సాగు కోసం రైతులు 1.80 ఎకరాలకు సరిపడే నారు మడులను గత నెలలోనే సిద్ధం చేసుకున్నారు. వర్షాలు లేకపోవడంతో నారుమడులు ఎండిపోయి నీళ్లు లేక భూములు నోరెళ్లబెడుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 42 వేల ఎకరాల్లో నాట్లు వేసుకున్నారు. రైతులు వరి విత్తనాలు నారు పోసిన నాటి నుంచి వర్షాలు లేక భూమిలో తేమకు వేసిన విత్తనాలు సక్రమంగా మొలక రాక, మొలకొచ్చిన నారు ఎదిగే తరుణంలో వర్షాలు ముఖం చాటేయడంతో నెలలు నెర్రలు వారుతున్నాయి. రైతులు టాంకర్ల నీటిని తెచ్చి నారును బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు బోయినపల్లిలో 1500 ఎకరాలు, వేములవాడలో 1530 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 3వేల ఎకరాలు, చందుర్తిలో 2640 ఎకరాలు, కోనరావుపేటలో 2195 ఎకరాలు, రుద్రంగిలో 450 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 6800 ఎకరాలు, గంభీరావుపేటలో 4680 ఎకరాలు, వీర్నపల్లిలో 2600 ఎకరాలు, ముస్తాబాద్‌లో 6 వేల ఎకరాలు, సిరిసిల్లలో 1500 ఎకరాలు, ఇల్లంతకుంటలో 3400 ఎకరాలు, తంగళ్ళపల్లిలో 6300ఎకరాల్లో వరి నాట్లు వేసుకున్నారు. నాట్లుపడ్డ నీళ్లు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల్లో తొందరపడి వరి నాట్లు చేపట్టడం నష్టమే జరుగుతుందని రైతులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. సిద్ధం చేసుకున్న నారుమడులను కొందరు రైతులు వదిలేస్తున్నారు.
పత్తి రైతుకు సాగు కష్టాలు
జిల్లాలో గతంలో కంటే పత్తి సాగును రైతులు తగ్గించుకుంటూ వస్తున్న ఈసారి వర్షాలు లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. జూన్‌లో తొలకరి వర్షాలకే విత్తనాలు వేసుకున్నారు. వ్యవసాయ శాఖ అంచనా వేసిన లక్ష్యం చేరుకుంటున్నారు. చినుకు జాడ లేకపోవడంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. పత్తి మొక్కలను కాపాడుకోవడానికి రైతులు శ్రమిస్తున్నారు. జిల్లాలో 47120 ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా పెట్టుకోగా రైతులు ఇప్పటికే 45921 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. పత్తిని కాపాడుకోవడానికి రైతులు పలు మార్గల్లో అన్వేషిస్తున్నారు. స్పీకర్లు, ట్రిప్పులు, రంధ్రాలు చేసి పైపులను ఏర్పాటు చేసి నీటితడులు పెడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు బోయినపల్లిలో 6680 ఎకరాలు, వేములవాడలో 4602 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4250 ఎకరాలు, చందుర్తిలో 5862 ఎకరాలు, కోనరావుపేటలో 4241 ఎకరాలు, రుద్రంగిలో 2370 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3186 ఎకరాలు, గంభీరావుపేటలో 120 ఎకరాలు, వీర్నపల్లిలో 400 ఎకరాలు, ముస్తాబాద్‌లో 500 ఎకరాలు, సిరిసిల్లలో 650 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12570 ఎకరాలు తంగళ్ళపల్లిలో 490ఎకరాలో పత్తి సాగు చేసుకున్నారు.
జిల్లాలో 40 శాతం లోటు వర్షపాతం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు చిరుజల్లులే తప్ప భారీ వర్షం కురువకపోవడంతో లోటు వర్షపాతం కొనసాగుతోంది. జిల్లాలో 11.55 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. గడిచిన 50రోజుల్లో సాధారణ వర్షపాతం 252.1 మిల్లీమీటర్ల కంటే 40 శాతం లోటు వర్షపాతం నమోదయింది. 152.1 రోజుల్లో మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ప్రధానంగా ఉన్న ప్రాజెక్టులలో కూడా నీటిమట్టం భారీగా పడిపోయింది మిడ్ మానేరు ప్రాజెక్టులో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 7.43 టీఎంసీల నీరు ఉంది. అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.50 టీఎంసీల సామర్థ్యానికి 1.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ మానేరులో 2టీఎంసీలకు 0.612 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మల్కపేట పాజెక్ట్‌లో 3 టీఎంసీలకు 1.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు బోరు బావుల్లోను భూగర్భ జలాలు పడిపోయి పంటలకు నీటిని అందించలేని పరిస్థితి కనిపిస్తోంది.
జూలై 19 వరకు జిల్లాలో వర్షపాతం(మిల్లీమీటర్లలో)
మండలం సాధారణం కురిసింది లోటు
రుద్రంగి 281.2 134.0 52.0
చందుర్తి 294.6 201.2 32.0
వేములవాడ రూరల్ 267.5 155.2 42.0
బోయినపల్లి 238.4 139.7 41.0
వేములవాడ 272.8 179.9 34.0
సిరిసిల్ల 266.7 129.8 51.0
కోనరావుపేట 233.7 181.0 23.0
వీర్నపల్లి 249.3 200.9 19.0
ఎల్లారెడ్డిపేట 244.3 140.2 43.0
గంభీరావుపేట 240.9 162.2 33.0
ముస్తాబాద్ 213.3 129.7 39.0
తంగళ్లపల్లి 271.2 125.6 54.0
ఇల్లంతకుంట 203.1 98.4 52.0
-----------------------------------------------------------------------------------------------------
సగటు వర్షపాతం 252.1 152.1 40
-----------------------------------------------------------------------------------------------------
జిల్లాలో ఖరీఫ్ ఎకరాల్లో..
మండలం సాగు అంచనా సాగయ్యింది(ఎకరాల్లో)
బోయినపల్లి 21,,260 8,440
వేములవాడ 10,942 6,222
వేములవాడ రూరల్ 15,622 7,280
చందుర్తి 21,512 8,731
కోనరావుపేట 24,187 6,652
రుద్రంగి 10,287 4,940
ఎల్లారెడ్డిపేట 21,914 10,040
గంభీరావుపేట 19,871 4,811
వీర్నపల్లి 8,296 3,020
ముస్తాబాద్ 26,879 6,670
సిరిసిల్ల 5,447 2,250
ఇల్లంతకుంట 38,238 16,584
తంగళ్లపల్లి 24,052 6,925
-------------------------------------------------------------------------------------------------
మొత్తం 2,48,507 92,565
---------------------------------------------------------------------------------------------------