Rajanna Sircilla: బోనస్ దుర్వినియోగానికి చెక్
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:46 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) సన్నరకం వడ్ల సాగుని పెంచేందుకు ప్రభుత్వం రైతులకు క్వింటాలుకు
- సన్నరకం వరి సాగుపై సర్కార్ కొత్త నిబంధన
- విత్తనాల కొనుగోలు నుంచే ఆన్‌లైన్ నమోదు
- ఇప్పటికే ఏడు రకాల సన్నాలను సూచించిన సర్కార్
- ప్రభుత్వం ఖరారు చేసిన సన్న రకాల సాగుకే రూ 500 బోనస్
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సన్నరకం వడ్ల సాగుని పెంచేందుకు ప్రభుత్వం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తోంది. కాగా బోనస్ దుర్వినియోగం కాకుండా దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్నరకం వరి వంగడాల కొనుగోలు నుంచి పక్కాగా నజర్ పెడుతోంది. గతంలో సన్నరకం వడ్లకు అందిస్తున్న బోనస్ డబ్బులు భారీగా దుర్వినియోగం అయినట్లుగా ప్రభుత్వం దృష్టికిరావడంతో ఈసారి ఖరీఫ్‌లో పకడ్బందీగా దృష్టి పెట్టింది. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.48లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో సాగు ఇబ్బందులు పడుతున్నా రైతులు వరి సాగును మాత్రం తగ్గించడం లేదు. 1.91లక్షల ఎకరాలు వరి సాగుకు సిద్ధమైన రైతులు ఆలస్యంగా నాట్లు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 50వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో సన్నరకం సాగుచేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే 80వేల ఎకరాల్లో సన్నరకం సాగు చేసే దిశగా రైతులను ఒప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం సన్నరకం వరి వంగడాలు వేసుకునే రైతులు విత్తన కొనుగోలు నుంచి ఆన్‌లైన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డీలర్లు ఆన్‌లైన్‌లో రైతులు కొనుగోలు చేసిన విత్తనాల వివరాలు నమోదు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సన్నవడ్ల సాగు చేస్తున్న రైతులు ఆన్‌లైన్ బుకింగ్ తర్వాత వ్యవసాయ శాఖ చేపట్టే క్రాప్ బుకింగ్ లెక్కలతో డీలర్ల వద్ద తీసుకున్న విత్తనాల లెక్కలతో సరిపోవాలి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట దిగుబడి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ వివరాలు పరిశీలిస్తారు.
ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు
ప్రభుత్వం సన్నరకం వడ్ల కొనుగోలు నుంచి క్రాప్‌బుకింగ్ వరకు ఆన్లైన్ విధానం కొనసాగిస్తుంది. విత్తన కొనుగోలు సమయంలోనే నమోదుచేసే దిశగా ప్రత్యేకంగా వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. డీలర్ సులభంగా లాగిన్ కావడానికి వీలుగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. వెబ్‌సైట్‌లో రైతు కొనుగోలు చేసిన వరిరకం, రైతు పేరు, తండ్రిపేరు, మొబైల్ నంబర్, పట్టాదార్ పాస్ పుస్తకం, వంటి ప్రాథమిక వివరాలతోపాటు విత్తన రకం, కంపెనీ పేరు, లాబ్ నంబర్, సీడ్ ప్యాకెట్ సైజ్, కొనుగోలు చేసిన తేదీని ఖచ్చితంగా నమోదు చేస్తారు. ఇది కేవలం ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే ఉపయోగిస్తారు. దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత రైతులు వివరాలు నమోదు చేసే ప్రక్రియ ముందుకు రావడంతో విత్తన డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు ఫోన్‌చేసి యాప్‌లో వివరాలు నమోదు చేయాలని రమ్మని కోరినా పట్టించుకోవడంలేదని డీలర్లు వాపోతున్నారు. వివరాలు నమోదు కాకుంటే మాత్రం ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు.
ఏడు రకాల సన్నాలకే బోనస్..
ప్రభుత్వం సన్న రకాల్లో ఏడు రకాల ధాన్యానికి మాత్రమే క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఏడు రకాల్లో బీపీటీ-5204, జైశ్రీరామ్, ఆర్‌ఎన్‌ఆర్ - 15048, కేఎన్‌ఎ-1638, కేఎన్‌ఎం-7715, డబ్ల్యూజీయల్- 44,హెచ్‌ఎంటీ సోనా రకాల వంగడాలు విత్తుకోవాలని ప్రకటించారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన మొదట్లో జిల్లాలో 25వేల ఎకరాల వరకు సన్నరకం సాగుచేశారు. ఆ తర్వాత సాగు 10వేల వరకు పడిపోయింది. జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా దొడ్డురకం వడ్లు మాత్రమే రైతులు పండిస్తూ వస్తున్నారు. సన్నరకం విత్తనాల వల్ల దిగుబడి రావడానికి ఎక్కువ రోజులు సమయం పట్టడంతో పాటు తెగుళ్లు ఎక్కువగా వస్తాయని ఆందోళన ఉంది. దిగుబడి కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
సొంత విత్తన సాగు రైతులకు వెసులుబాటు
సన్నరకం వరిసాగు చేసే రైతులు గతేడాది తాము పండించిన పంట నుంచి సొంతంగా విత్తనాలు భద్రపరచుకున్న రైతులకు వెసులుబాటు కల్పించారు. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయకుండా రైతులు విత్తనాలు భద్రపరుచుకున్న సంప్రదాయం ఉండడంతో అలాంటి రైతులు ఆందోళన చెందకుండా తమ గ్రామపరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.
జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం
మండలం మొత్తం సాగు(ఎకరాల్లో) వరి(ఎకరాల్లో)
గంభీరావుపేట 19871 19200
ఇల్లంతకుంట 38238 23800
ముస్తాబాద్ 26879 25000
సిరిసిల్ల 5447 4600
తంగళ్లపల్లి 24052 21600
వీర్నపల్లి 8296 8096
ఎల్లారెడ్డిపేట 21914 18600
బోయినపల్లి 21260 13000
చందుర్తి 21512 15600
కోనరావుపేట 24187 19200
రుద్రంగి 10287 6180
వేములవాడ 10942 5440
వేములవాడ రూరల్ 15622 11050
--------------------------------------------------------------------------
మొత్తం 248507 191366
------------------------------------------------------------------------