Share News

Rajanna Sircilla: ఎదురుచూపులకే పరిమితమా?

ABN , Publish Date - Jul 13 , 2026 | 01:01 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) చెరువులు, కుంటలు జలాశయాల పర్యవేక్షణలో కీలకంగా పనిచేసిన సాగునీటి

Rajanna Sircilla:  ఎదురుచూపులకే పరిమితమా?

- సాగునీటి సంఘాల ఏర్పాటుకు నిరీక్షణ

- పునరుద్ధరించాలని గతంలోనే రైతు సంక్షేమ కమిషన్‌ సిఫార్సు

- గత సెప్టెంబర్‌లో ఎన్నికల నిర్వహిస్తామని మంత్రి ఉత్తమ్‌ హామీ

- 15 ఏళ్లుగా కమిటీలు లేక చెరువుల నిర్వహణ అస్తవ్యస్తం

- జిల్లాలో చెరువులు, కుంటలపై పర్యవేక్షణ కరువు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

చెరువులు, కుంటలు జలాశయాల పర్యవేక్షణలో కీలకంగా పనిచేసిన సాగునీటి సంఘాలకు గత ప్రభుత్వం మంగళం పాడింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలపై ప్రకటనలు చేసినా ఆచరణలోకి రావడం లేదు. మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునర్దరించాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిచెరువుకు ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని 2025సంవత్సరాన్ని చెరువులు సంవత్సరంగా ప్రకటించి చెరువుల పునరుద్దరణ, తూములు, కట్టలు, కాలువలు, చెరువుల మరమ్మతులు చేపట్టాలని సూచనలు చేసింది. దీంతో సాగునీటి సంఘాలకు మోక్షం కలుగుతుందని రైతులు భావించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లుగా కనిపించినా ఆచరణలోకి మాత్రం రాలేదు.

మంత్రి హామీకి తొమ్మిది నెలలు..

గత సంవత్సరం సెప్టెంబర్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నీటి వినియోదారుల సంఘాలకు పూర్వవైభవం తెస్తామని ప్రకటించారు. స్థానికఎన్నికలు ముగిసిన తర్వాత సాగునీటి వినియోగ దారులను ఏర్పాటు చేయడానికి నీటిపారుదలశాఖ అధికారులను నియమిస్తామని ప్రకటించారు. మంత్రి హామీకి తొమ్మిది నెలలు గడిచినా ఆచరణలోకి మాత్రం రాలేదు. రైతు సంక్షేమ కమిషన్‌ సిఫార్సు, మంత్రుల హామీలు నెరవేరకపోవడంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో సాగునీటి వనరుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

ప్రశ్నార్థకంగా సాగునీటి సంఘాల ఉనికి..

జల వనరుల నిర్వహణ కోసం రైతులను భాగస్వామ్యం చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో 1997లో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశారు. నీటిపారుదల సంఘాలు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో పనిచేశాయి. కానీ నీటి పారుదల శాఖలో మార్పులు చేర్పులు చేస్తూ గత ప్రభుత్వం చిన్ననీటి పారుదలశాఖను నీటిపారుదల శాఖలో విలీనం చేయడంతో చిన్న నీటివనరులను పర్యవేక్షించే వారే లేకుండా పోయారు. దీంతోపాటు గత ప్రభుత్వ హాయంలో అదర్శరైతుల విధానాన్ని రద్దుచేసి రైతు సమన్వయ సమితు లను ఏర్పాటు చేశారు. వారికే చెరువుల బాధ్యతలు కూడా అప్పగిస్తారని భావించినా అచరణలోకి రాలేదు. కొత్త ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను రద్దు చేసింది. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉన్న 666 చిన్న నీటివనరులు, చెరువులు, కుంటలపై మళ్లీ నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి పర్యవేక్షిస్తారా లేదా నిస్తేజంగా వదిలేస్తారా అనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఉమ్మడి రాష్ట్ర హయాంలో 2010లో నీటిసంఘాల ఓటర్ల సవరణతోనే నిలిచిపోయింది. ఆ తరువాత 2015లో తెలంగాణ ప్రభుత్వం నీటిసంఘాల ఎన్నికల్లో కదలిక వచ్చినా తరువాత నిలిపివేశారు.

గత సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి జిల్లాలో వంద ఎకరాల పైన ఆయకట్టు ఉన్న చెరువులు 106, వంద ఎకరాలలోపు 560 చెరువులు ఉన్నాయి. గతంలో మిషన్‌కాకతీయ పథకంలో దాదాపు 294చెరువులను మరమ్మతులు చేసుకున్నారు. మిగతా చెరువులకు మరమ్మతులు జరగాల్సి ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో మానేరు, మూలవాగులపై 24చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. ఇందులో మానేరువాగులో కొట్టుకుపోయిన చెక్‌డ్యాంలు వివాదాస్పదంగానే మారి పోయాయి. నీటిసంఘాలు లేకపోవడంతో చెరువుల మరమ్మతులు, కొట్టుకుపోయిన చెక్‌డ్యాంలు, ఇతర పనుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లేకుండాపోయారు. నీటిసంఘాల ఎన్నికలపై కొత్త ప్రభు త్వమైనా స్పందించాలని కోరుతున్నారు.

జిల్లాలో 2.48లక్షల ఎకరాల్లో సాగు..

రాజన్నసిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.48లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. యాసంగిలో 1.88లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంది. గతంలో ఖరీఫ్‌, రబీ రెండుపంటలకు సంబంధించి ఆయకట్టు రైతులు చెరువుల నీటిని రైతు సంఘాల ద్వారా క్రమబద్ధంగా వాడుకునేవారు. ప్రస్తుతం నీటి సంఘాలు లేకపోవడంతో రైతులు నీటిని వాడుకోవడంలోనూ చెరువుల నిర్వహణలోనూ ఇబ్బందులు పడు తున్నారు. నీటిసంఘాలు వస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 01:01 AM