Rajanna Sircilla: వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:09 AM
వేములవాడ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహర్దశ పట్టింది.
- తాజాగా రూ.99.40కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ
- రెండున్నరేళ్లలో రూ.249.40కోట్లకు చేరిన నిధులు
- ఇప్పటికే 45శాతం పూర్తైన ఆలయ అభివృద్ధి పనులు
- ఫలించిన ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కృషి
- హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు
వేములవాడ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహర్దశ పట్టింది. రాజన్న ఆలయంతో పాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న కృషి ఫలించింది. రాజన్న ఆలయాభివృద్ది 100 తరాల మాస్టర్ ప్లాన్‌తో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రూ.249.40కోట్లకు చేరిన రాజన్న ఆలయాభివృద్ధి నిధులు..
ఆధ్యాత్మికత వైభవం ఉట్టిపడేలా, ఆలయానికి వచ్చే భక్తులకు భక్తి భావం నెలకొనేలా ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు మొదలయ్యాయి. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్దంగా ఆగమశాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 2024-25సంవత్సర బడ్జెట్‌లో రూ.50కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.100కోట్లు, తాజాగా రూ.99.40కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో ఇప్పటివరకు రాజన్న ఆలయాభివృద్ధి కోసం రెండున్నరేళ్లలో విడుదల చేసిన నిధులు రూ.249.40కోట్లకు చేరుకున్నాయి.
ఇప్పటికే 45శాతం అభివృద్ధి పనులు పూర్తి..
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి మొదటి దశలో రూ.150కోట్లు విడుదల చేయడంతో ఆలయాభివృద్ధి పనులు ప్రారంభిం చారు. టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పనుల్లో భాగంగా మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రూ.47 కోట్లతో 80ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల వేగంగా జరుగుతున్నాయి. డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, రోడ్డుపై కంకరతో 50శాతం పనులు పూర్తి అయ్యాయి. రూ.35కోట్లతో రాజన్న ఆలయ సమీపంలో అన్నదాన సత్రం పనులు, రూ. 76కోట్లతో ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజన్న ఆలయాభివృద్ది పనులు 45శాతం పూర్తి అయినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం శనివారం మరో రూ.99.40కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో పట్టణ ప్రజలు, భక్తుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
తరాలు గుర్తిండిపోయేలా ఆలయాభివృద్ధి
- ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం దేవాలయాలాభివృద్ధికి పెద్దపీఠ వేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న ఆలయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. శృంగేరి పీఠాధిపతుల సలహాలు, సూచనలు, స్థానిక ప్రజల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని ఆగమశాస్ర్తానికి అను గుణంగా తరాలు గుర్తిండిపోయేలా రాజన్నఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇది రాజన్న భక్తులతోపాటు, పరిసర ప్రాంతాల ప్రజలు, పట్టణ ప్రజల చిరకాలవాంఛ. రాజన్న ఆలయాభివృద్ధి నా హయాంలో జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆలయాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 45శాతం పనులు పూర్తి అయ్యాయి. ప్రభుత్వం శనివారం రూ.99.40కోట్లు మంజూరు చేయడం ఆనందంగా ఉంది.