ఊరటనిచ్చిన వర్షాలు
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:21 AM
జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు ఢోకా లేకుం డా పోయింది. మూడు రోజుల క్రితం వరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్న క్రమంలోనే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా కరువు తీరా వర్షాలు పడి జిల్లా ముఖచి త్రాన్నే మార్చి వేసింది.
- జిల్లాలో మూడు రోజులపాటు కురిసిన వానలు
- సాఽధారణానికి మించి 22శాతం అదనంగా వర్షపాతం నమోదు
- 75 శాతం చెరువులకు జలకళ
- శ్రీపాద ఎల్లంపల్లికి కొనసాగుతున్న ఎత్తిపోతలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు ఢోకా లేకుం డా పోయింది. మూడు రోజుల క్రితం వరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్న క్రమంలోనే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా కరువు తీరా వర్షాలు పడి జిల్లా ముఖచి త్రాన్నే మార్చి వేసింది. 33 శాతం లోటు వర్షపాతం ఉన్న జిల్లాలో సాధారణానికి మించి 22 శాతం అద నంగా వర్షాలు కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో 2,33,207 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వరి 1,79,915 ఎకరాలు, పత్తి 51,241 ఎకరాలు, మొక్కజొన్న 900 ఎకరాలు, కందులు 135 ఎకరాలు, ఆయిల్‌పామ్ 436 ఎకరాలు, కూరగాయలు 330 ఎకరాలు, ఇతర పంటలు 250 ఎకరాల్లో సాగయ్యాయి. మూడు రోజుల పాటు దంచి కొట్టిన వానల వల్ల చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటల్లో 75 శాతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా, కొన్ని చెరువులు, కుంటల్లో నీళ్లు మత్తడి దూకాయి. భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టకుండా ఈ వర్షపాతం తోడ్పడనున్నది. అలాగే ఉత్తర తెలంగాణ లైఫ్‌లైన్ అయిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండు వానలకే జలకళను సంతరించుకున్నది. అంతేగాకుండా మిడ్ మానేరుకు ఇప్పటి వరకు 3 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తి పోయగా, గురువారం రాత్రి 7 గంటల నుంచి దిగువకు గేట్ల ద్వారా ఇప్పటి వరకు 30 టీఎంసీలకు పైగా అదనపు నీటిని వదిలి పెట్టాల్సి వచ్చింది.
ఫ ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు 3 టీఎంసీల తరలింపు
జూలై 29న ఉదయం 6 గంటల వరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 8.63 టీఎంసీలు ఉండగా, రాత్రి కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 11,675 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. సాయంత్రం వరకు 75,328 క్యూసెక్కులకు పెరగడంతో ప్రాజెక్టు నీటిమట్టం 11.110 టీఎంసీలకు పెరగడంతో నంది పంప్‌హౌస్‌లోని 4 మోటార్లు ఆన్ చేసి 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం ఆరంభించారు. ఆ మరుసటి రోజు మరింత వరద పెరగడంతో మరొక మోటార్ ఆన్ చేసి 15,750 క్యూసెక్కులకు పెంచారు. ఇప్పటి వరకు మిడ్ మానేరుకు 3 టీఎంసీల నీటిని ఎత్తి పోయడంతో దాని నీటిమట్టం 11 టీఎంసీలకు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి దిగువకు సుమారు 30 టీఎంసీల నీటిని 24 గంటల్లో వదిలి పెట్టారు. ప్రస్తుతం శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 50,555 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 5 గేట్ల ద్వారా 26,775 వేల క్యూసెక్కుల నీటిని వదిలి పెడుతున్నారు. గురువారం రాత్రి ఒక దశలో 4,44,930 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టడం గమనార్హం. జిల్లాకు వరప్రదా యిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 23 టీఎంసీలకు చేరుకున్నది. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందనే భరోసాతో రైతులు ఉన్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి వరద కొనసాగితే నీళ్లను మిడ్ మానేరుకు, లోయర్ మానేరు డ్యామ్‌కు కూడా తరలించనున్నారు.
ఫ చిన్న నీటి వనరులకు జలకళ..
జిల్లాలో గల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మొత్తం 1027 చెరువులు, కుంటలు ఉండగా, ఇందులో 100 ఎకరాలకు పైబడి సాగు నీటిని అందించే చెరువులు 113 ఉండగా, 100 ఎకరాల లోపు చెరువులు, కుంటలు 914 ఉన్నాయి. 25 నుంచి 50 శాతం వరకు నిండిన చెరువులు, కుంటలు 108 ఉండగా, 50 నుంచి 75 శాతం వరకు నిండినవి 247 ఉన్నాయి. 75 నుంచి 100 శాతం వరకు 449 ఉన్నాయి. వంద శాతానికి మించి మత్తడులు దూకిన చెరువులు, కుంటలు 231 ఉన్నాయని జిల్లా నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.
ఫ సాధారణానికి మించి వర్షపాతం..
జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూలై నెలాఖరు వరకు 443.6 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను, 541.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంతర్గాం మండలంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవగా, ధర్మారం, పాలకుర్తి, రామగుండం, రామగిరి, కమాన్‌పూర్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో సాధారణానికి మించి వర్షాలు పడ్డాయి. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ముత్తారం, మంథని మండలాల్లో సాధారణ వర్షపాతానికి చేరుకున్నాయి. మొత్తంగా ఎల్‌నినోతో రైతులు భయాందోళనలకు గురి కాగా, మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు ఊరటను కలిగించాయి.