వర్షం.. రైతుల్లో హర్షం
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:25 AM
వానాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా జిల్లా అంతటా విస్త్తారంగా వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది.
(కరీంనగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
వానాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా జిల్లా అంతటా విస్త్తారంగా వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో 42.7 మిమీ వర్షపాతం నమోదైంది. గంగాధర, చొప్పదండి రామడుగు మండలాల్లో అత్యధిక వర్షంపాతం నమోదైంది. గంగాధర మండలంలో 88.6, చొప్పదండి మండలంలో 85.6, రామడుగు మండలంలో 79.6 మిమీ వర్షపాతం నమోదైంది. జమ్మికుంటలో 40.2, మానకొండూర్‌లో 40.2, కరీంనగర్ 36.8, చిగురుమామిడి 34.8, కరీంనగర్ రూరల్ మండలంలో 34.2, ఇల్లందకుంట మండలంలో 32.4, వీణవంక మండలంలో 31.2, సైదాపూర్ మండలంలో 30.0, గన్నేరు వరం మండలంలో 28.2, హుజూరాబాద్ మండలంలో 28.2, శంకరపట్నం మండలంలో 28.6, తిమ్మాపూర్ 22.4 వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తంగా 42.7 సగటు వర్షపాతం నమోదు కావడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ప్రధానంగా పత్తి చేలకు అధిక లాభం చేకూరనున్నది. వాడిపోతున్న మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఈ వానలు దోహదపడుతాయి.
ఫ ప్రత్యామ్నాయ పంటలపై ప్రచారం
వర్షాలు కురుస్తున్నాయని తొందరపడి నాట్లు వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఇబ్బందులు ఉండవని అధికారులు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 2.79 లక్షల ఎకరాల్లో వరినాట్లు , 48 వేల ఎకరాల్లో పత్తి, 4,800 ఎకరాల్లో మొక్కజొన్న, 15 వేల ఎకరాల్లో కూరగాయలు, పప్పు ధాన్యాలు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడు ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం వరకు కూడా జిల్లాలో 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఒకటి రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడగా మంగళవారం నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తు న్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై 57 రోజులు కాగా బుధవారంతో పద్దెనిమిది రోజులు మాత్రమే వర్షం పడిన దినాలుగా నమోదయ్యాయి. బుదవారం 42.7 మిమీల వర్ష పాతం నమోదు కావడంతో ఒక రోజులోనే లోటు వర్షం పాతం -39 నుంచి -29కి పది శాతం పడిపోయింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 1.49,486 ఎకరాల్లో వరి, 44,799 ఎకరాల్లో పత్తి 3,880 మొక్కజొన్న, 1,037 ఎకరాల్లో కంది, 145 ఎకరాల్లో పెసర, 12 ఎకరాల్లో మినుము, 12 ఎకరాల్లో అనుములు, 13 ఎకరాల్లో ఆముదం, 6 ఎకరాల్లో జనుము, సాగు చేశారు. మరో లక్షా ముప్పై ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉన్నది. మరో 3,200 ఎకరాల్లో పత్తి, వేయి ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి నీరు రాక నాట్లు వేయడానికి రైతులు భయపడుతున్నారు. బావులు, బోరు బావులు కింద మాత్రమే వరి నాట్లు వేశారు. సెప్టెంబరు నుంచి ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్ర తరమయ్యే అవకాశముందని వాతా వరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆగస్టు మాసంలో కురిసే వర్షాలపై సాగు ఆధా రపడి ఉంటుంది. వర్షాలపై భారం వేసి రైతులు నాట్లు వేస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ సాగు మాత్రమే మార్గమని ప్రచారం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ సాగులో వేయాల్సిన పంటల గురించి వివరిస్తూ విత్తనాలను కూడా రైతు వేదికల్లో అందుబాటులో ఉంచు తున్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల్లోకి నీరు వస్తే తప్ప నాట్లు వేసి నష్టపోవద్దని అధికారులు చెబుతున్నారు.