Share News

ఖరీఫ్‌ను కాటేస్తున్న వర్షాభావం

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:04 AM

వర్షాభావ పరిస్థితులు జిల్లాను కరువుకోరల్లోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తున్నది. రుతుపవనాలు ప్రారంభమై 43 రోజులు గడిచినా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక జిల్లావ్యాప్తంగా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొన్నది.

ఖరీఫ్‌ను కాటేస్తున్న వర్షాభావం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వర్షాభావ పరిస్థితులు జిల్లాను కరువుకోరల్లోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తున్నది. రుతుపవనాలు ప్రారంభమై 43 రోజులు గడిచినా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక జిల్లావ్యాప్తంగా నాట్లు వేయలేని పరిస్థితి నెలకొన్నది. కోసిన నారు మడులు ముదిరిపోతుండగా అడపాదడపా కురిసిన కొద్దిపాటి వర్షానికి వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక కొన్ని, మొలకెత్తినవి ఎండిపోతూ మరికొన్ని రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. జూన 1 నుంచి నైరుతీ రుతుపవనాల కాలం ప్రారంభం కాగా గడిచిన 43 రోజుల్లో కేవలం 11 రోజుల్లో మాత్రమే అక్కడక్కడ వర్షం కురిసింది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 210.4 మి.మీ, వర్షం పడాల్సి ఉండగా కేవలం 133.6 మి.మీ, వర్షపాతం మాత్రమే నమోదైంది.

ఫ రెండు మండలాల్లో మినహా జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతం

గంగాధర, రామడుగు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగితా అన్ని మండలాల్లోనూ సగటున 37 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 2.79 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయడానికి వీలుగా నారుమళ్లను పోశారు. ఎక్కడ సాధారణ వర్షం కూడా పడక పోవడంతో జలాశయాలకు చుక్కనీరు రాని పరిస్థితి నెలకొన్నది. మెట్టప్రాంతాల్లోని మండలాల్లో భూగర్భ జలాలు 17 మీటర్ల లోతుకు పడిపోగా సగటున జిల్లాలో ఎనిమిది మీటర్లలోతుకు పోతేగానీ నీరు లభించడం లేదు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో 15 మీటర్ల లోతుకు నీరుపడిపోయింది.

ఫ ముదురుతున్న వరి నార్లు, ఎండుతున్న పత్తి మొలకలు

అన్ని మండలాల్లోనూ బావుల కింద పోసిన నారు మడులు ముదిరిపోతున్నాయి. బోరుబావుల ఆధారంగా రైతులు కేవలం 31,866 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. 2.47,000 ఎకరాల్లో వర్షం లేని కారణంగా నాట్లు వేయలేని పరిస్థితి ఉన్నది. అప్పుడప్పుడు కురిసిన బట్టతడుపు వానతో రైతులు వర్షాలు కురుస్తాయనే ఆశతో 35,550 ఎకరాల్లో వేలాది రూపాయలు వెచ్చించి పత్తి విత్తనాలు వేశారు. ప్రస్తుతం అవి కూడా ఎండిపోతున్న దశలోనే ఉన్నాయి. బిందెలతో నీళ్ళు పోస్తూ వాటిని దక్కించుకుంటున్నారు. 4,800 ఎకరాల్లో వేస్తారనుకున్న మొక్కజొన్న పంట కేవలం 1,290 ఎకరాలకు పరిమితమైంది. 450 ఎకరాల్లో మాత్రమే పెసర, కంది పంటలు వేశారు. ఈనెలాఖరు వరకు వర్షాలు కురవక పోతే ప్రత్యామ్నాయ సాగుకు వెళ్లాల్సిందేనని భావిస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ జూలై 30 వరకు వర్షాలు పడని పక్షంలో సుమారు 26,983 ఎకరాల్లో వరికి బదులుగా, 5,294 ఎకరాల్లో పత్తికి బదులుగా కంది, పెసర, బబ్బెర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నది. ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికనుకూడా సిద్ధం చేసి ఆయా విస్తీర్ణానికి సరిపోయే విధంగా విత్తనాలు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

Updated Date - Jul 14 , 2026 | 01:04 AM