Share News

Raajanna siricilla :దిగుబడిపై దిగాలు..

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:32 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఎన్నో ఆశలతో యాసంగి సాగుచేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నదాతలకు ఎండిపోతున్న పంటలతో దిగుబడి దిగాలు మొదలైంది.

Raajanna siricilla :దిగుబడిపై దిగాలు..

- యాసంగి సాగు ప్రశ్నార్థకం

- అడుగంటుతున్న భూగర్భ జలాలు

- ‘బోరు’మంటున్న బావులు

- జిల్లాలో 80,389 బోరుబావులు

- మిడ్‌ మానేరు ప్రాజెక్టులో సగానికి పడిపోయిన నీటి నిల్వ

- వేసవి ప్రారంభంలోనే మండుతున్న ఎండలు.. తడారిపోతున్న వరి పైర్లు

- పశువులకు మేతగా పొలాలు

- జిల్లాలో 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎన్నో ఆశలతో యాసంగి సాగుచేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నదాతలకు ఎండిపోతున్న పంటలతో దిగుబడి దిగాలు మొదలైంది. వేసవి ప్రారంభంలోనే మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్తుండడంతో వరి పంటకు నీళ్లు అందక తడారిపోతున్న పొలాలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పొట్ట దశకు చేరుకున్న పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ బోరు బావుల పైనే ఆధారపడ్డ రైతులకు భూగర్భ జలాలు అడగండిపోవడంతో బోరు బావులు నీళ్లు పోయలేక బోరుమంటున్నాయ్‌. జిల్లాలో 1.94 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు ఇందులో వరి సాగు 1.83 లక్షల ఎకరాల్లో వేసుకున్నారు. ప్రధానంగా వరి సాగు చేయగా మొక్కజొన్న 2,135 ఎకరాలు, నువ్వులు 49 ఎకరాలు, పొద్దుతిరుగుడు 1,107 ఎకరాలు కందులు 375 ఎకరాలు, వేరుశనగ 35 ఎకరాలు, పెసర 81 ఎకరాలు, చెరుకు 20 ఎకరాలు, జొన్న 4 ఎకరాలు, ఇతర పంటలు 6,745 ఎకరాల్లో సాగు చేసినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ సర్వే పూర్తి అయితే సమగ్రంగా సాగు లెక్కలు తెలుస్తాయి.

జిల్లాలో 9.08 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. జనవరి మాసంలో 7.50 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోగా, ఫిబ్రవరిలో 9.08 మీటర్లకు పడిపోయింది. దీనికి తోడుగా ప్రాజెక్టుల్లో కూడా దిగువకు నీటిని వదలడంతో ప్రాజెక్టుల్లో నీటి నిలువ తగ్గుతోంది. జిల్లాలో ప్రధానంగా ఉన్న మిడ్‌ మానేరు ప్రాజెక్టులో ఫిబ్రవరి మాసంలో 27.55 టీఎంసీల సామర్థ్యంగా 24టీఎంసీల వరకు నీటి నిల్వ ఉంచారు. మార్చిలో దిగువకు నీళ్లు వదలడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 14.44 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయాయి. అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.50 టీఎంసీలకు 2.86 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మిడ్ట్‌ మానేరు ప్రాజెక్టులో నీటిలో తగ్గడంతో బ్యాక్‌ వాటర్‌ లేకపోవడంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో ప్రధానంగా రైతులు బోరుబావుల పైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నా జిల్లాలో 80,389 బోరు బావులు ఉన్నాయి. వ్యవసాయ బావుల్లో నీటిమట్టం తగ్గడంతో రైతులు మళ్లీ పూడికతీత పనులు చేస్తున్నారు. జిల్లాలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పంటలకు నీరు అందని పరిస్థితుల్లో ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల పశువుల మేతకు వరి పైర్లు వదిలేశారు. చెరువులు, కుంటల్లో కూడా నీళ్లు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి దిగుబడి తగ్గుతుందని దిగాలు చెందుతున్నారు.

జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిన తీరు(మీటర్లలో)

మండలం ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 2026 తగ్గుదల (జనవరి)

బోయినపల్లి 7.21 6.30 -0.41

చందుర్తి 5.23 6.14 -1.08

గంభీరావుపేట 11.59 9.64 -0.88

ఇల్లంతకుంట 5.90 5.76 -0.99

కోనరావుపేట 9.72 8.59 -1.33

ముస్తాబాద్‌ 9.79 10.38 -2.16

రుద్రంగి 6.73 7.20 -2.05

సిరిసిల్ల 12.15 13.09 -1.41

తంగళ్లపల్లి 7.87 6.98 -1.78

వీర్నపల్లి 13.45 15.75 -3.82

వేములవాడ రూరల్‌ 4.77 5.10 -0.63

వేములవాడ అర్భన్‌ 13.18 14.41 -0.84

ఎల్లారెడ్డిపేట 15.62 15.04 -2.24

---------------------------------------------------------------------------------------------------------------

జిల్లా సరాసరి 9.28 9.08 -1.50

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - Mar 16 , 2026 | 01:32 AM