Share News

Raajanna siricilla : నిరీక్షణకు తెరపడేనా?

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:44 AM

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) బడుగు బలహీన వర్గాలకు కాస్త భరోసాగా నిలిచే చేయూత పింఛన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు.

Raajanna siricilla :  నిరీక్షణకు తెరపడేనా?

- ‘చేయూత’లో కదలిక

- 2నకొత్త పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం

- ఇప్పటికీ పాత పింఛనే..

- దివ్యాంగులు, ఇతర వృత్తి పింఛన్లకు వర్తించని బదలాయింపు

- 15 వరకు సజీవ నిర్ధారణ సర్వే

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

బడుగు బలహీన వర్గాలకు కాస్త భరోసాగా నిలిచే చేయూత పింఛన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో పింఛన్లపై మళ్లీ ఆశలు చిగురించాయి. నిరీక్షణకు తెరపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే చేయూత పథకంలో అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు సజీవ నిర్ధారణ సర్వే కొనసాగుతోంది. జూన్‌ 15 వరకు అసలైన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తామనడంతో గతంలో దరఖాస్తులు చేసుకున్న వారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణితో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలనతో పాటు కొత్త దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు మౌఖికంగా ప్రభుత్వ నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దరఖాస్తులు ఇస్తూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం జూన్‌ 2 నుంచి అందించే కొత్త పింఛన్ల మంజూరులో ప్రాధాన్యత మేరకు పింఛన్లు అందిస్తారని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్ల మంజూరుపై అనుసరించాల్సిన విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయని దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రభుత్వం రెండు లక్షల మందికి పింఛన్ల హామీతో ఆశలు కల్పించింది ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తుండడంతో ఈసారి చేయూత పింఛన్లపై ఆశలు చిగురిస్తున్నాయి.

ఇప్పటికే పింఛన్‌ కోసం 76,501 మంది దరఖాస్తులు

జిల్లాలో గత ప్రభుత్వం ఆసరా పథకం కింద ఫించన్లు అందిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి స్థానంలో ‘చేయూత’ ప్రకటించింది. జిల్లాలో ఆరు గ్యారంటీలకు 1.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ప్రధానంగా ఫించన్‌ కోసం 76,501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చేయూత పింఛన్‌కు 71,677 మంది, దివ్యాంగులు 4,824 మంది దరఖాస్తులు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ప్రకటించినా కాంగ్రెస్‌ పింఛన్‌ సొమ్ము సాధారణ పింఛన్‌దారులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించినా అమల్లోకి రాలేదు. పెంచడంతో పాటు అర్హులైన వారందరికి ఫింఛన్లు మంజూరుచేస్తామని స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలిగే తీరు మాత్రం కనిపించడం లేదు. కుటుంబంలో వృద్ధాప్య పింఛన్‌దారులు ఒకరు చనిపోతే వారి కుటుంబంలో భార్యకు గానీ, భర్తకు గానీ పింఛన్‌ మంజూరు చేసి బదలాయింపు ప్రక్రియ మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇది కూడా అందరికి వర్తింపచేయడం లేదు. జిల్లాలో పింఛన్ల కోసం మూడున్నర ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో ఒకసారి మాత్రమే కొత్తవారికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో చాలా మందికి పింఛన్లు రాలేదని ఎదురుచూశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తుల స్వీకరణతో హడావిడి చేసినా పింఛన్‌ మాత్రం అందడం లేదు. వృద్ధాప్య పింఛన్లు మాత్రం ఒకరు మరణిస్తే ఒకరికి అందిస్తున్నారు. ఇందులో కూడా కేవలం వృద్ధప్య పింఛన్‌ మాత్రమే బదలాయింపు చేస్తున్నారు. దివ్వాంగులు, ఇతర చేనేత, గీతా కార్మికులు చనిపోతే బార్యలు వితంతు పింఛన్‌ కింద ఇవ్వడం లేదు.

జిల్లాలో 1.16 లక్షల పింఛన్లు

ఆసరా పింఛన్లు ‘చేయూత’గా మారిన కొత్త పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు నిరీక్షిస్తున్నారు. ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా అర్హులు దరఖాస్తు చేసుకొని కార్యాలయాలు చుట్టు పింఛన్‌ మహాప్రభో అంటూ తిరుగుతున్నారు. 2022 ఆగస్టులో చివరిసారిగా పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత భర్త చనిపోతే భార్యకు పింఛన్‌ బదిలాయింపు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేయూత పథకంలో ప్రభుత్వం ప్రస్తుతం లక్షా 16 వేల 323 పింఛన్‌దారులకు ప్రతినెలా రూ 25.35 కోట్లు పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 30,965 మందికి రూ 6.24 కోట్లు, దివ్యాంగుల పింఛన్లు 9570 మందికి రూ 3.84 కోట్లు, వితంతువు 23962 మందికి రూ 4.78 కోట్లు, చేనేత 3433 మందికి రూ 69 లక్షలు, గీతా కార్మికులు 2,245 మందికి రూ 45 లక్షలు, ఒంటరి మహిళలు 1,787 మందికి 36 లక్షలు, బీడీ కార్మికులు 43,183 మందికి రూ 8.69 కోట్లు, పైలేరియా 949 మందికి 19 లక్షలు, డయాలసిస్‌ పేషేంట్లు 133 మందికి రూ 3 లక్షలు, బీడీ టేకేదార్లు 465 మందికి రూ 9 లక్షలు జమ చేస్తున్నారు. గత ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌కు వయస్సు అర్హతను 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించింది. దీంతో జిల్లాలో 76,501 మంది దరఖాస్తు చేసుకొని చేయూత పింఛన్‌ కోసం దాదాపు మూడున్నర ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం పేరుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలు, డయాలసిస్‌ బాధితులు, పైలేరియా, హెచ్‌ఐవీ పేషంట్లకు పింఛన్లను మంజూరుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే చేయూత పథకంగా పేరు మార్చారు. దీంతోపాటు రూ 2016 ఉన్న పింఛను రూ 4 వేలకు, దివ్యాంగులకు రూ 4016 ఉన్న దానిని రూ 6 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.

జూన్‌ 15 వరకు సజీవ నిర్ధారణ సర్వే

సజీవంగా ఉంటేనే చేయూత పింఛన్‌ పొందే వీలు ఉంటుంది. మృతిచెందిన చేయూత పింఛన్‌ లబ్ధిదారుల తొలగింపునకు కార్యాచరణ మొదలైంది. సజీవ నిర్ధారణ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వ స్వీకారం చుట్టింది. గత సంవత్సరం జూలై నుంచి గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా పింఛన్‌ డబ్బులు చెల్లిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి రావడంతో బతికి ఉంటేనే పింఛన్‌ డబ్బులు తీసుకునే అవకాశం ఏర్పడింది. మున్సిపాలిటీలో అర్హులకు పింఛన్లు అందుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో పకడ్బందీగా చేయితో పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పింఛన్‌దారుల గుర్తింపు కోసం లైవ్‌నెస్‌ అథెంటిఫికేషన్‌ యాప్‌ విధానం తీసుకొచ్చింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్‌ఆఫీస్‌ల ద్వారా అందించే పింఛన్లు ఫేస్‌ రికగ్నేషన్‌ సాఫ్ట్వేర్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌), బయోమెట్రిక్‌ ద్వారా పింఛన్‌ ఇస్తున్నారు. బ్యాంకుల్లో పింఛన్‌ తీసుకునే వారికి ప్రతినెల సాంకేతిక తనిఖీలు లేకుండానే ఖాతాలో జమవుతున్నాయి. ఇందులో ఎక్కువగా మరణించిన వారు జిల్లా నుంచి వెళ్లిపోయిన వారి ఖాతాల్లోనూ డబ్బులు జమవుతున్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీ ప్రాంతాల్లో జూన్‌ 15 వరకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో పింఛన్‌ లబ్ధిదారుల నమోదు జరుగుతుంది. పింఛన్‌దారుల మొఖం, చేతివేళ్ల ముద్రలు నమోదు చేస్తారు. వృద్ధులు, ఇతరులకు చేతి వేళ్లు గుర్తింపు కాకపోతే వారికి రిమార్కులో సడలింపులు ఇస్తారు. స్థానికంగా అందుబాటులో లేని వారికోసం మరో విడతలో అవకాశం కల్పిస్తారు. గ్రామపంచాయతీలో గ్రామదీపికలు, పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపాలిటీలో మెప్మా ఆర్పీలు, వార్డు ఆఫీసర్లు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు ఇచ్చారు.

Updated Date - Jun 01 , 2026 | 01:44 AM