Raajanna siricilla : నీటి మీద బతుకు పోరాటం
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:09 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల ) ఏటికి ఎదురీదినా కష్టాల పయనం సాగిస్తున్నారు. కమ్ముకున్న మంచులోనూ... చలివేసినా.. వానొచ్చినా... భుజాన బుట్ట.. చేతిలో వలతో మత్స్యకార్మికుడు సాగిపోతాడు.
- కష్టాల మధ్యే మత్స్యకారుల జీవనం
- మృగశిర కార్తె.. చేపల సందడి
- జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు, 456 చెరువులు, కుంటలు
- జిల్లా వ్యాప్తంగా 168 మత్స్య పారిశ్రామిక సంఘాలు, 9,220 మంది సభ్యులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )
ఏటికి ఎదురీదినా కష్టాల పయనం సాగిస్తున్నారు. కమ్ముకున్న మంచులోనూ... చలివేసినా.. వానొచ్చినా... భుజాన బుట్ట.. చేతిలో వలతో మత్స్యకార్మికుడు సాగిపోతాడు. గంగమ్మతల్లిని నమ్ముకొని బతుకు పోరాటాన్ని సాగిస్తున్నారు. ఉరుములు మెరుపులకు గుండెల్లో భయానికి తావివ్వకుండా ప్రకృతి ఆవేశాలకు కాస్త వెనకడుగు వేసినా తిరిగి తన బతుకు పోరాటాన్ని కొనసాగిస్తాడు. వారు బతుకు నిత్యం ఒడ్డున పడ్డ చేపలా విలవిల్లాడినా కుటుంబాలను పోషించుకోవడానికి చేపల వేట సాగిస్తాడు. ప్రభుత్వం చేయూతను అందిస్తుండడంతో ఉపాధిలో మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగిన ఎత్తిపోతలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరుతో పాటు చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మత్స్యశాఖ సబ్సిడీపై చేపపిల్లలను చెరువుల్లో వదలడం, రుణాలు, వాహనాలు, అందిస్తూ వ్యాపారానికి ఊతం ఇస్తున్నారు. మనుషుల జీవనంలో ఆహారంలో ముఖ్యమైన వాటిలో చేపలు కూడా ఒకటి. ఎన్ని కష్టాలు వచ్చినా చెరువులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టాలు పడుతూనే ఉన్నారు. బీసీ ఏ గ్రూప్‌లో ఉన్నప్పటికీ సాంఘికంగా, ఆర్థికంగా రాజకీ యంగా వెనుకబడే ఉన్నారు. వీరి వృత్తిలోకి కాంట్రాక్ట్ పద్ధతిలో ధనికులు రావడంతో వీరి ఉపాధికి గండిపడుతోంది.
జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు, 456 చెరువులు, కుంటలు
మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునిచ్చే ఉచిత చేప పిల్లల పంపిణీ గత సంవత్సరం ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు చేపట్టారు. వర్షాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టులు, చెరువులు చేప విత్తనాలను వదలాల్సి ఉంది. పూర్తిగా వంద శాతం రాయితీతో చేప పిల్లల పంపిణీకి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలోనే చేప పిల్లల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేవారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు చెరువులు కుంటలు ప్రాజెక్టులలో నీటిలో సామర్థ్యాన్ని బట్టి చేప పిల్లలను వదిలేవారు. గత సంవత్సరం వర్షాకాలం సీజన్ రుతు పవనాలు సకాలంలో వచ్చిన ప్రారంభంలో అనుకూలమైన వర్షాలు కురవకపోవడంతో టెండర్ల ప్రక్రియ చేపట్టలేదు. అల్పపీడన ప్రభావంతో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో చెరువులు. ప్రాజెక్టులోకి నీరు చేరి జలకళ సంతరించుకుంది. చేప విత్తనాల పంపిణీ జాప్యంపై మత్స్యకారుల నుంచి వచ్చిన డిమాండ్, నిరసనలతో చివరకు టెండర్లకు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి నవంబర్ మాసంలో చేపపిల్లలు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం 348 చెరువులు, కుంటలు, శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు, ఎగువ మానేరు ప్రాజెక్ట్, అన్నపూర్ణ ప్రాజెక్ట్, మల్కపేట ప్రాజెక్టులో 1.35 కోట్ల చేప పిల్లలను వదిలారు. నాలుగు రకాల చేప పిల్లలు ప్రధానంగా బొచ్చె, రవులు, బంగారు తీగ, మేరియా రకాల పిల్లలను వదిలారు. చేప పిల్లలు సకాలంలో వదలక పోవడంతో ఎదుగుదలపై ప్రభావం చూపిందని మత్స్యకారులు అంటున్నారు.
జిల్లాలో మత్స్య సహకార పరిస్థితి
జిల్లాలో మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో మత్స్యశాఖ పరిధిలో 401 చెరువులు ఉన్నాయి. 168మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 9,220 మంది సభ్యులు ఉన్నారు. 48 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రెండు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. గత అర్థిక సంవత్సరం వరకు మిడ్ మానేరులో చేపలు పట్టడానికి 741 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 251 మంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 52 మంది మత్స్యకారులకు లైసెన్స్ జారీ చేశారు.
చేపల వంటకాలు.. సాగు ఆరంభం
జిల్లాలో మృగశిర కార్తె సందడి ఒక్కరోజు ముందే మొదలైంది. మృగశిర కార్తె సోమవారం నుంచి మొదలు కావడంతో ఎక్కువగా ఆ రోజు ఉపవాసాలు పాటించేవారు ఆదివారమే చేపల వంటకాల ఘుమఘుమలు ఆస్వాదించారు. ప్రధానంగా కార్తెలు వ్యవసాయం రైతులతో ముడిపడి ఉన్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలను స్వాగతిస్తూ మృగశిర కార్తెతో రైతులు సాగు పనులు ప్రారంభించుకుంటారు. వ్యవసాయ పనులు మొదలవుతున్న క్రమంలోనే మృగశిర కార్తె రోజున చేపలు తినడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీంతో సిరిసిల్ల మార్కెట్లో ఆదివారం సందడి కనిపించింది. చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయంతో అందరి వంటింట్లో చేపల వంటకాలతో కుటుంబ సభ్యులు ఆస్వాదించారు.