Raajanna siricilla : మోగిన బడిగంట..
ABN , Publish Date - Jun 15 , 2026 | 01:43 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) బడి గంట మోగింది.. పొద్దునే లేవాలి.. బడికి పోవడానికి దాదాపు రెండు నెలల పాటు ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు సెలవులకు బైబై చెప్పి పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
- నేటి నుంచి బ్యాక్ టు స్కూల్
- పిల్లలను సిద్ధం చేసిన తల్లిదండ్రులు
- జిల్లాలో 483 ప్రభుత్వ పాఠశాలలు.. 40 వేల మంది విద్యార్థులు
- ఉచితంగా 2.59లక్షల ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు
- అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే డ్రెస్ కోడ్
- ఇంకా జిల్లాకు చేరని యూనిఫాం.. ప్రత్యేక కిట్లు
- ఈసారి పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్.. మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి
- పాఠశాలల్లో విద్యార్థుల సందడి షూరు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
బడి గంట మోగింది.. పొద్దునే లేవాలి.. బడికి పోవడానికి దాదాపు రెండు నెలల పాటు ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు సెలవులకు బైబై చెప్పి పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పొద్దున్నే లేచి పిల్లలను రెడీ చేయడంతోపాటు టిఫిన్లు పెట్టి పాఠశాలలకు వెళ్లమని మారాం చేసే పిల్లలను బుజ్జగించడం మొదలవుతుంది. కొత్తగా పాఠశాలల్లో చేరే పిల్లలను ఆలవాటు చేయించడం కోసం తల్లిదండ్రులు పడే తంటా అంతాఇంతా కాదు. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి బడి బాట షెడ్యూల్ కూడా ప్రకటించారు. 19వ వరకు బడిబాట నిర్వహిస్తారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోని పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి. జిల్లాలోని పాఠశాలలు ఆకర్షించే విధంగా సంస్కృతి సంప్రదాయాలను అద్దంపట్టే విధంగా బస్సు, రైలుబండి, జంతువుల చిత్రాలు, మహానీయుల చిత్రాలతో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 626ఉన్నాయి. దాదాపు 80 మంది విద్యార్థులు చదువుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల 483 ఉండగా, రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 111 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 13 కేజీబీవీ, 7మోడల్ స్కూల్, 314 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 38 మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, మూడు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఒకటి ఆర్‌బీఎస్, ఒకటి డీఎన్‌టీ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 40 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 18,179 మంది. బాలికలు 20,450 మంది ఉన్నారు. 21 రెసిడెన్షియల్ పాఠశాలలో 7,762 మంది విద్యార్థులు ఉండగా, బాలురు 2,583 మంది, బాలికలు 5,179 మంది ఉన్నారు.
తొలిరోజే బ్యాగ్ నిండా పుస్తకాలు
పాఠశాలల పునఃప్రారంభం నుంచే బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గతంలో త్రైమాసిక పరీక్షల సమయానికి కూడా అన్ని పుస్తకాలు వచ్చేవి కావు. సీనియర్ల పాత పుస్తకాలతో సర్దుకునే పరిస్థితి ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈసారి ముందస్తుగానే జిల్లాలకు పాఠ్యపుస్తకాలను చేరవేసింది. తొలిరోజే బ్యాగు నిండా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు అందజేసే ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2 లక్షల 59 వేల 720 పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకోగా విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు పుస్తకాలు పంపించారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా విద్యార్థులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠ్య పుస్తకాలపై బార్ కోడ్ ముద్రించారు. పాఠ్యపుస్తకాలపై నంబర్లు కూడా ముద్రించడం ద్వారా జిల్లా కేంద్రం నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసే సమయంలో కూడా నంబర్లను నమోదు చేసుకుంటారు. అంతేకాకుండా పాఠశాల హెచ్‌ఎంలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించే సమయంలో కూడా నంబర్లను నమోదు చేసుకుంటారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా ప్రభుత్వ పుస్తకాలను గుర్తుపట్టే వీలు ఉంటుంది.
మధ్య తరగతి కుటుంబాలకు స్కూల్ భయం...
పాఠశాలలు తెరుచుకోవడం, ప్రైవేటు పాఠశాలకు పంపించే మధ్య తరగతి కుటుంబాలకు మాత్రం స్కూల్ భయంగానే మారింది. పాఠ్యపుస్తకాల ధరలు, ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత విద్యార్థుల తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. ప్రతి ఇంటికి అదనంగా రూ లక్ష ఖర్చు జూన్ మాసంలో ఉంటుంది. ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ ఇతర చదువులకు లక్షల్లోనే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి రూ 25 నుంచి రూ 80 వరకు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తోడుగా బస్ రవాణా చార్జీలు, ఇతర వర్క్‌బుక్‌లు, స్కూల్‌లో ఇతర యాక్టివిటీస్ ఫీజులతో మధ్య తరగతి కుటుంభాలు అల్లాడుతున్నాయి.
మొక్కుబడిగానే బడిబాట
ఐదేళ్లు నిండిన చిన్నారులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు చేపట్టిన బడిబాట మొక్కుబడిగానే సాగుతోందని విమర్శలు ఉన్నాయి. ఈనెల 6న ప్రారంభించిన బడిబాట కార్యక్రమం 19న తేదీ వరకు నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమంలో కొంతమంది ఉపాధ్యాయులు అనాసక్తి చూపడంతోనే మొక్కుబడిగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలోనూ ఉపాధ్యాయులందరూ బడిబాటలో పాల్గొనకుండా వంతులవారీగా బడిబాటలో పాల్గొంటున్నరనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ప్రత్యేక నిర్వహించే బడిబాటకు ఈసారి స్థానిక నేతల నుంచి కూడా పెద్దగా సహకారం అందడం లేదని విమర్శలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ఉన్న 483 ప్రభుత్వ పాఠశాలలో 2282 మంది హెచ్‌ఎంలు ప్రిన్సిపాల్ స్పెషల్ ఆఫీసర్లు ఉపాధ్యాయులు ఉన్నారు. బడిబాటను పండుగ వాతావరణంలో నిర్వహించాల్సి ఉండగా, ఆ సందడే కనిపించడం లేదు. ఈనెల 19 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించే విధంగా బడిబాట షెడ్యూల్ విద్యాశాఖ విడుదల చేసింది. 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎన్ డే, 17న బాలికల విద్యా దినోత్సవం, 18న డిజిటల్ విద్యపై అవగాహన, 19న క్రీడా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్న సందడి మాత్రం కనిపించడం లేదు.
కొత్త తరగతులకు పాత డ్రెస్సులే..
విద్యార్థుల్లో అందరూ ఒకటే అనే భావం కల్పించే దిశగా ప్రభుత్వం ఒకే రాష్ట్రం.. ఓకే యూనిఫాం విధానాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది. పాఠశాల ప్రారంభంరోజే పుస్తకాలతో పాటు కొత్త యూనిఫామ్‌లు అందించాలని నిర్లయించినా జిల్లాకు మాత్రం చేరలేదు. దీంతో కొత్త పుస్తకాలు, తరగతులు పాత డ్రెస్సులే అన్నట్లుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పేర్లతో ఉన్న పాఠశాలలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న వేర్వేరు రంగులు, డిజైన్లతో కలిగిన యూనిఫామ్ అమలు అవుతోంది. ఈ తేడాను తొలగించే దిశగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండే విధంగా ఒకే రంగు, ఒకే డిజైన్‌తో యూనిఫామ్ అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం మధ్యాహ్నం భోజనంతో పాటు అల్పాహారం కూడా విద్యార్థులకు అందించే కార్యక్రమం కూడా మొదలు పెట్టనుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఒకే రకమైన డ్రెస్‌కోడ్‌తో పాటు 21 వస్తువులతో కూడిన ప్రత్యేకమైన కిట్లను అందించడానికి ఏర్పాట్లు చేసినా తొలిరోజు అందుకోని పరిస్థితి ఉంది. పాఠశాల పునఃప్రారంభం రోజున మూడు జతల యూనిఫాం, రెండు చేతుల సాక్సు, స్కూల్‌బ్యాగ్, బెల్ట్, టై, నోట్‌బుక్స్, టెస్ట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్, జామెంట్రీ బాక్స్, డిక్షనరీ వస్తువులతో పాటు వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ట్రాక్‌సూట్, నైట్‌డ్రెస్ లాంటి దుస్తులతోపాటు బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్, ప్లేట్, గ్లాస్, కప్పుస్పూన్, ట్రంక్ బాక్స్, స్టేషనరీ కిట్‌లాంటి వసతి వస్తువులు కూడా అందించబోయే దానిపై స్పష్టత మాత్రం లేదు.
మరో 48 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఈసారి మరో 48 పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను చిన్నారులకు అందించనున్నారు. ఇందుకోసం ఒక్కో బడికి ఒక బోధకులు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. బోధకులుగా పనిచేసే వారికి ఇంటర్మీడియట్, ఆయాగా పనిచేసే వారికి ఏడో తరగతి విద్యార్హతను నిర్ణయించారు. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అంగన్‌వాడీల నుంచి బయటకు వచ్చిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించే దిశగా ప్రీప్రైమరీ పాఠశాలలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.