Raajanna siricilla : రోళ్లు పగులుతున్నాయి..
ABN , Publish Date - May 25 , 2026 | 01:41 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఈసారి మాత్రం పెద్దల మాట వాస్తవమని ప్రజలు అల్లాడిపోతున్న తీరును చూస్తే తెలుస్తోంది.
- మే మాసంలో 46 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు
- జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
- దుక్కులు దున్నుతున్న రైతులు
- నేటినుంచి రోహిణికార్తె
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఈసారి మాత్రం పెద్దల మాట వాస్తవమని ప్రజలు అల్లాడిపోతున్న తీరును చూస్తే తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మే మాసంలో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతుండంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. జిల్లాలో కొన్ని మండలాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్‌గా ఉంటుంది. రోహిణికార్తెతో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎండల జోరు మాత్రం తగ్గకపోయినా రైతులు వ్యవసాయ పనులకు ప్రారంభించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రోహిణీకార్తె ఆగమనంతో పల్లెల్లో సందడి మొదలుకానుంది. ఎండలు మండిపోతున్న రైతులు ఖరీఫ్ కోసం ఎరువాకకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుంటూనే వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, సిద్ధం చేసుకుంటూనే మరోవైపు దుక్కులు దున్నుకుంటున్నారు. నారుమడిని సిద్ధం చేసుకోవడానికి నిమగ్నమయ్యారు. పల్లెల్లో దళారులు కూడా నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. రైతులకు నకిలీ విత్తనాలపై జాగ్రత్తలు వహించే విధంగా వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రచారాలు చేస్తున్నారు. వాతావరణ శాఖ వర్షాలు ఉంటాయని చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసింది.
కనుమరుగైన రోహిణికార్తె సంబరం
రోహిణీకార్తె వచ్చిందంటే రైతులు సాంప్రదాయబద్దంగా ఎన్నో పనులు చేసే వారు కనుమరుగైపోయిన రోహిణికార్తె సంబరంపై రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రోహిణికార్తెకు వాతావరణమంతా చల్లబడి మబ్బులు కమ్ముకునేవని, ఎండ వేడితో దుక్కులతోనే సరిపోతుందన్నారు. రోహిణికార్తెకు చిన్నపాటి రైతులు తీపి పదార్థాలు చేసుకుంటే... పెద్దరైతులు గొర్రెపిల్లనో, మేకపిల్లనో కోసుకొని పెద్ద పండుగను జరుపుకునే వారన్నారు. ఇప్పుడు రోహిణికార్తె వచ్చినా సిరిసిల్లకు కూలీ పనులకు పోతున్నారు. ఆరేడు ఎకరాలు ఉన్నవారు కూడా ఊరు వదిలి పట్టణాల్లో కూలీనాలి చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కార్తెకార్తెకు తీరొక్క విత్తనాలు వేసేవాళ్లమని, ఇప్పుడు కార్తెలనే పట్టించుకునే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
వానాకాలం లక్ష్యం 2.48 లక్షల ఎకరాల సాగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 48 వేల 507 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 91 వేల366 ఎకరాలు, పత్తి 47120ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3430 ఎకరాలు, ఇతర పంటలు 5593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 123790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు సంబంధించి 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, ఎరువులు 57399 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25944 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3760 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22710మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4225 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 760 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.
జిల్లాలో 11.15 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు
జిల్లాలో వ్యవసాయ బోరు బావుల పైనే ఆధారపడ్డ రైతులకు ఈసారి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావులు నీళ్లు పోయలేక బోరుమంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ఏప్రిల్ మాసంలో 11.15 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. దీనికి తోడుగా ప్రాజెక్టుల్లో కూడా దిగువకు నీటిని వదలడంతో ప్రాజెక్టుల్లో నీటి నిలువ తగ్గుతోంది. జిల్లాలో ప్రధానంగా ఉన్న మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఫిబ్రవరి మాసం వరకు 27.55 టీఎంసీల సామర్థ్యంగా 24 టీఎంసీల వరకు నీటినిల్వ ఉంచారు. ప్రసుత్తం మే మాసంలో దిగువకు నీళ్లు వదలడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 7.63టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయాయి. అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.50 టీఎంసీలకు 1.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మిడ్ట్ మానేరు ప్రాజెక్టులో నీటిలో తగ్గడంతో బ్యాక్ వాటర్ లేకపోవడంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో ప్రధానంగా రైతులు బోరుబావుల పైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నా, జిల్లాలో 80389 బోరు బావులు ఉన్నాయి. బోర్ వ్యవసాయ బావుల్లో నీటిమట్టం తగ్గడంతో రైతులు మళ్లీ పుడికలు తీశారు. మే మాసంలో మరింత జలాలు అడుగంటినట్లుగా తెలుస్తోంది. యాసంగిలో పోలాలు బీటలువారి రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. వానాకాలం సాగులో భూగర్భ జలాలు పెరుగుతాయనే అశతో ఉన్నారు.
జిల్లాలో ఖరీఫ్ సాగు ఇలా
మండలం వరి పత్తి ఇతర మొత్తం
గంభీరావుపేట 19200 150 521 19871
ఇల్లంతకుంట 23800 12800 1638 38238
ముస్తాబాద్ 25000 650 1229 26879
సిరిసిల్ల 4600 750 97 5447
తంగళ్లపల్లి 21600 1300 1152 24052
వీర్నపల్లి 8096 200 00 8296
ఎల్లారెడ్డిపేట 18600 3300 14 21914
బోయినపల్లి 13000 7000 1260 21260
చందుర్తి 15600 5500 412 21512
కోనరావుపేట 19200 4400 587 24187
రుద్రంగి 6180 1820 2287 10287
వేములవాడ 5440 5050 452 10942
వేములవాడ రూరల్ 11050 4200 372 15622
---------------------------------------------------------------------------------------------
మొత్తం 191366 47120 10021 248507
---------------------------------------------------------------------------------------------