Raajanna siricilla : బల్దియాల్లో ‘సోషల్’ వార్
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:39 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. షెడ్యూల్ రానున్న నేపథ్యంలో పోటీకి సిద్ధమైన ఆశావహులు వార్డుల్లో ప్రచారాలు మొదలుపెట్టారు.
- ఓటర్లను ఆకట్టుకునేలా పోస్టులు
- సోషల్ మీడియా గ్రూపుల ఏర్పాట్లలో ఆశావహులు
- టికెట్లు ఖరారు కాకున్నా సోషల్ ప్రచారం షురూ
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. షెడ్యూల్ రానున్న నేపథ్యంలో పోటీకి సిద్ధమైన ఆశావహులు వార్డుల్లో ప్రచారాలు మొదలుపెట్టారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆశావహులు ఖర్చు లేకుండా ఉపయోగపడే సోషల్ మీడియాను ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో సోషల్ మీడియా వార్ మొదలైంది. సిరిసిల్లలో 39 వార్డులు, వేములవాడలో 28 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో దాదాపుగా పది నుంచి 20 గ్రూపులుగా సోషల్ మీడియాలో విభజించి ప్రచారానికి తెరలేపారు. వార్డుల్లో పార్టీ గ్రూపులతో పాటు యువజన, ఆధ్యాత్మిక, కులసంఘాల వారీగా గ్రూపుల ఏర్పాటు చేశారు. వాట్సాప్ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లను వేదికలుగా మలుచుకున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజెిపీ పార్టీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియతో పాటు వార్డుల వారీగా సోషల్ మీడియా ఇన్‌చార్జీలను నియమిస్తున్నారు. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు కూడా స్వయంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిని ఎంపిక చేసుకొని బాధ్యతలను అప్పగిస్తున్నారు. బీఆర్‌ఎస్ తమ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ అదే స్థాయిలో పోస్టులు పెడుతుండటంతో చర్చనీయంగా మరుతోంది.
అరచేతిలో ప్రచార అస్త్రం
వాల్‌రైటింగ్, బ్యానర్లకు కాలం చెల్లిపోతున్న సమయంలో సోషల్ మీడియా అరచేతిలో ప్రచార అస్త్రంగా మారింది. స్థానిక ఎన్నికల్లో సోషల్ మీడియాగా మారింది. ఒకప్పుడు వాడలన్నీ పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు రాసేవారు. నాయకుల ఫొటోలతో పోస్టర్లు ముద్రించేవారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, స్టిక్కర్లు వచ్చాయి. తలుపులకు డోర్ స్టిక్కర్లు కొంత మేరకు అతికిస్తున్నా ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లో వీడియోలు, ఫొటోలతో కూడిన పోస్టులకు ప్రాధాన్యం పెరిగింది. వాయిస్‌కాల్స్ మొదలుపెట్టారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో 67 వార్డుల్లో ఖరారైన రిజర్వేషన్లు బరిలో నిలిపి అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో తాను పోటీకి సిద్ధం అంటూ ప్రచారం చేసుకుంటూనే పార్టీ టికెట్ల కోసం పరుగులు తీస్తున్నారు.
ఆలోచింపజేస్తున్న పోస్టులు
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి పెంచుతూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సామాన్యుల్లో పలు చర్చలకు దారితీస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉండే యువతీయువకులు, ఉద్యోగులు, సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్చలు చేస్తున్నారు. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు, వారికి టికెట్ ఇచ్చే పార్టీలపై వస్తున్న పోస్టులపై ఓటర్లు ఆలోచించుకునే పరిస్థితి కూడా వస్తుండడంతో అభ్యర్థులు అయోమయంలోనూ ఉన్నారు.
సోషల్ మీడియా మార్కెటింగ్
మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా మార్కెటింగ్ మొదలైంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో యూట్యూబర్లు తమకున్న సబ్‌స్కైబర్లను చూపుతూ ఆశావహుల వద్ద ప్రచార అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. యూట్యూబ్లో, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తో వీడియోలు పోస్ట్ పెట్టే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పోటీకి సిద్ధమైన అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అభ్యర్థులు కూడా ఎన్నికల ఖర్చు చూపే పని ఉండదని భావిస్తూ ప్రచారానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.