Share News

Raajannna siricilla : స్మార్ట్‌గా ‘రేషన్‌’..

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:54 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ కార్డులను త్వరలో జారీ చేయనున్నది.

Raajannna siricilla :  స్మార్ట్‌గా ‘రేషన్‌’..

- రేషన్‌ కార్డుల డిజిటలైజేషన్‌

- పీవీసీ, చిప్‌, బార్‌కోడ్‌ స్మార్ట్‌ కార్డులు

- త్వరలో స్మార్ట్‌ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు

- కొత్త కార్డుల జారీతో అక్రమాలకు అడ్డుకట్ట

- జిల్లాలో 1.96 లక్షల రేషన్‌ కార్డులు.. లబ్ధిదారులు 5.76 లక్షలు మంది

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ కార్డులను త్వరలో జారీ చేయనున్నది. ఇప్పటికే జిల్లాలకు స్మార్ట్‌కార్డులను పంపించే ప్రక్రియ ప్రారంభించారు. ముఖ్యమంత్రి లాంఛనంగా పాత రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభించిన వెంటనే జిల్లాలో కార్డుల పంపిణీ చేయనున్నారు. రేషన్‌ పంపిణీ వ్యవస్థను డిజిటలైజేషన్‌, స్మార్ట్‌ టెక్నాలజీ ఆధారితంగా పంపిణీ చేసే పీవీసీ కార్డు, చిప్‌, బార్‌ కోడ్‌, డిజిటల్‌ వెరిఫికేషన్‌ వంటి టెక్నాలజీతో రేషన్‌ కార్డు లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తుంది. పేపర్‌పై ప్రింట్‌ తీసుకొని ఉపయోగించుకుంటున్న కాగితపు రేషన్‌ కార్డు స్థానంలో ఏటీఎం తరహాలో కార్డు రావడం వల్ల రేషన్‌ సరుకులు పంపిణీ సులభతరం కానున్నది. అంతేకాకుండా లబ్ధిదారుల గుర్తింపును మరింత ఖచ్చితంగా నమోదు చేస్తుంది.

జిల్లాలో 5.76 లక్షల లబ్ధిదారులు

జిల్లాలో 1.96 లక్షల కార్డులు ఉండగా, 5.76లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఆహార భద్రత కార్డులు 182063 ఉండగా 540804మంది లబ్ధిదారులు, అంత్యోదయ అన్నయోజన కార్డులు 13830 ఉండగా 35466 మంది లబ్ధిదారులు, అన్నపూర్ల యోజన కార్డులు 199 ఉండగా 205 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలో రేషన్‌ కార్డుల్లో బోయిన్‌పల్లిలో 13300 కార్డులు, చందుర్తిలో 12223 కార్డులు, గంభీరావుపేటలో 15894 కార్డులు, ఇల్లంతకుంటలో 17359 కార్డులు, కోనరావుపేటలో 15692 కార్డులు, ముస్తాబాదులో 16627 కార్డులు, రుద్రంగిలో 5520 కార్డులు, సిరిసిల్లలో 30453 కార్డులు, తంగళ్ళపల్లిలో 16092 కార్డులు, వీర్నపల్లిలో 4805 కార్డులు, వేములవాడలో 22141 కార్డులు, వేములవాడ రూరల్‌ 8464 కార్డులు, ఎల్లారెడ్డిపేటలో 17522 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారుల్లో బోయిన్‌పల్లిలో 37620 లబ్ధిదారులు, చందుర్తిలో 35282 లబ్ధిదారులు, గంభీరావుపేటలో 46491 లబ్ధిదారులు, ఇల్లంతకుంటలో 49336 లబ్ధిదారులు, కోనరావుపేటలో 46177 లబ్ధిదారులు, ముస్తాబాద్‌లో 49180 లబ్ధిదారులు, రుద్రంగిలో 17561 లబ్ధిదారులు, సిరిసిల్లలో 91549 లబ్ధిదారులు, తంగళ్ళపల్లిలో 46366 లబ్ధిదారులు, వీర్నపల్లిలో 15106 లబ్ధిదారులు, వేములవాడలో 66412 లబ్ధిదారులు, వేములవాడ రూరల్‌లో 24268 లబ్ధిదారులు, ఎల్లారెడ్డిపేటలో 51127 మంది లబ్ధిదారులు ఉన్నారు.

కుటుంబ లబ్ధిదారుల వివరాలతో కార్డు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ స్మార్ట్‌ కార్డులను అందిస్తారు. రేషన్‌ షాప్‌లో పాత కార్డు చూపించి స్మార్ట్‌ కార్డును పొందవచ్చు. అంతేకాకుండా టీఎస్‌ఈపాస్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని కూడా స్మార్ట్‌ కార్డు తీసుకునే వీలు కల్పిస్తారు. కొత్తగా అందించే స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫోటో, రేషన్‌కార్డు నంబర్‌, రేషన్‌ దుకాణం నంబర్‌ ముద్రిస్తారు. కార్డు వెనకవైపు కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇతర అవసరమైన సమాచారాన్ని పొందపరుస్తున్నారు.

లబ్ధిదారులకు ఎక్కడైనా సరుకులు...

ప్రభుత్వం ఇప్పటికే రేషన్‌ సరుకులు బయోమెట్రిక్‌ ద్వారా రేషన్‌ దుకాణాల్లో ఎక్కడైనా సరుకులు పొందే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్మార్ట్‌ కార్డు ద్వారా రాష్ట్రంలోని ఏ రేషన్‌ దుకాణంలోనైనా సరుకులు పొందడానికి సులువుగా మారుతుంది. క్యూఆర్‌ కోడ్‌ ఉండడంతో కార్డులు డూప్లికేట్‌ కాకుండా ఉంటుంది.

Updated Date - Jul 06 , 2026 | 12:58 AM