Raajanna siricilla : చివరి దశకు ప్రచారం
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:33 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) బల్దియా ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో మైకులు మౌనం దాల్చానున్నాయి.
- కొన్ని గంటల్లో.. మైకుల మౌనం.. దావతుల జోరు
- ఇంటింటికి మాంసం, బాస్మతి బియ్యం, మద్యం సీసాలు
- మున్సిపాలిటీల్లో వేడెక్కిన రాజకీయాలు
- ప్రధాన పార్టీల నేతలకు సవాల్
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
బల్దియా ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో మైకులు మౌనం దాల్చానున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచార సమయం ఉండడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రాజకీయం వేడెక్కింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా 283 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా 170 మంది, వేములవాడలో 28 వార్డులు ఉండగా 113 మంది పోటీలో నిలిచి తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. బరిలో ఉన్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదివారం కావడంతో ఓటర్లను ఆకర్షించడానికి మాంసం, మద్యం, కూల్‌డ్రింక్స్, బాస్మతి బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎన్నికల నిఘా బృందాలు, పోలీస్ నిఘా ఉన్నప్పటికీ రెండు మున్సిపాలిటీల్లో దావతుల జోరు.. మద్యం పంపిణీతో ప్రచారం హోరుగా మారింది.
అగ్రనేతల నుంచి గల్లీ నేతల వరకు..
గల్లీ నేతల వరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో సవాల్‌గా తీసుకొని ప్రచారం చేస్తున్నారు రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆదివారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. శనివారం వరకు సిరిసిల్ల, వేములవాడలో బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు కార్నర్ సమావేశాలు, వార్డుల్లో కమ్యూనిటీల భేటీ నిర్వహించి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడలో ప్రచారాలు నిర్వహించారు. వీరికి తోడుగా జిల్లా నాయకత్వం ఆయా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు, ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లో టికెట్లు లభించక బరిలో ఉన్న అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.. వీరి ఓట్లు ఏ పార్టీకి నష్టం కలిగిస్తుందనే చర్చ జరుగుతోంది.
ప్రలోభాల ప్రయత్నాలు..
ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో రెండు మున్సిపాలిటీలో అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించుకున్న అభ్యర్థులు నేరుగా డబ్బులు వారికే అందించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నట్లుగా చర్చించుకుంటున్నారు. చివరి రెండు రోజులు మద్యం, నగదు పంపిణీపైనే అభ్యర్థులు దృష్టి పెట్టిన నేపథ్యంలో పోలీస్ నిఘాను పెంచారు.
లేబర్ అడ్డాలు ఖాళీ..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంది. కేవలం రెండు రోజులే ప్రచారానికి గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి జనం కోసం నానా తంటాలు పడుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ప్రచారానికి జనం దొరకక లేబర్ అడ్డాలపై గ్రామీణ ప్రాంతాల కూలీలను ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటాపోటీగా ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి భారీ జన సమీకరణతో ప్రచారం చేస్తున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు రాజకీయ కూలీల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.. ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతో పాటు రూ.500 ఇస్తున్నారు. పురుషులకు అదనంగా మద్యం అందిస్తున్నారు. గ్రామాల నుంచి సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు భవన నిర్మాణాలు, ఇతర పనుల కోసం వచ్చే కూలీలను లేబర్ అడ్డాల నుంచి ప్రచారానికి పార్టీలు తీసుకుని వెళ్తుండడంతో రోజువారి పనులకు బ్రేక్ పడింది. రోజు కూలి పని దొరకని వారికి ఎన్నికల ఉపాధి ఊరటనిస్తున్నా అనేక పనులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లో ఉండే మహిళలు కూడా బీడీలు, దుస్తులు కుట్టడం వంటి పనులను వదిలి ప్రచారానికి వెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నా కొందరు అభ్యర్థులకు ప్రచారానికి కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ప్రచారానికి పిలుస్తున్నారు. అభ్యర్థులు మాత్రం గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వెనకాడడం లేదు.