Share News

Raajanna siricilla : అర్హులకే ‘చేయూత’

ABN , Publish Date - May 18 , 2026 | 01:23 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) సజీవంగా ఉంటేనే చేయూత పింఛన్‌ పొందే వీలు ఉంటుంది.

Raajanna siricilla :  అర్హులకే ‘చేయూత’

- బోగస్‌ పింఛన్లకు చెక్‌

- మృతుల పేరిట ఇంకా విడుదలవుతున్న పింఛన్ల గుర్తింపు

- జూన్‌ 15 వరకు సజీవ నిర్ధారణ సర్వే

- జిల్లాలో 1.16 లక్షల పింఛన్ల పునఃపరిశీలన

- జిల్లాలో ప్రతి నెలా రూ 25.53 కోట్ల చెల్లింపు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సజీవంగా ఉంటేనే చేయూత పింఛన్‌ పొందే వీలు ఉంటుంది. చేయూత పింఛన్‌ లబ్ధిదారుల్లో మృతిచెందిన వారి పేర్ల తొలగింపునకు కార్యాచరణ మొదలైంది. సజీవ నిర్ధారణ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వ స్వీకారం చుట్టింది. గత సంవత్సరం జూలై నుంచి గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా పింఛన్‌ డబ్బులు చెల్లిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి రావడంతో బతికి ఉంటేనే పింఛన్‌ డబ్బులు తీసుకునే అవకాశం ఏర్పడింది. మున్సిపాలిటీలో అర్హులకు పింఛన్లు అందుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పకడ్బందీగా చేయూత పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పింఛన్‌దారుల గుర్తింపు కోసం లైవ్‌నెస్‌ అథెంటిఫికేషన్‌ యాప్‌ విధానం తీసుకొచ్చింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్‌ ఆఫీస్‌ల ద్వారా అందించే పింఛన్లు ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్వేర్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌), బయోమెట్రిక్‌ ద్వారా పింఛన్‌ ఇస్తున్నారు. బ్యాంకుల్లో పింఛన్‌ తీసుకునే వారికి ప్రతినెల సాంకేతిక తనిఖీలు లేకుండానే ఖాతాలో జమవుతున్నాయి. ఇందులో ఎక్కువగా మరణించిన వారు, జిల్లా నుంచి వెళ్లిపోయిన వారి ఖాతాల్లోనూ డబ్బులు జమవుతున్నాయి. వాటిని ఇతరులు తీసుకుంటున్న సందర్భాలు వెలుగుచూశాయి. ఈక్రమంలోనే సాంకేతిక ఆధారంగా పింఛన్‌ డబ్బులు అందించే విధంగా చర్యలు మొదలుకావడంతో అనర్హుల పింఛన్లు తొలగిపోనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేయూత పథకంలో ప్రభుత్వం ప్రస్తుతం లక్షా 16 వేల 323 పింఛన్‌దారులకు ప్రతినెలా రూ 25.35 కోట్లు పంపిణీ చేస్తుంది. ఇందులో వృద్ధాప్య ఫించన్లు 30,965 మందికి రూ.6.24 కోట్లు, దివ్యాంగుల పింఛన్లు 9,570 మందికి రూ 3.84 కోట్లు, వితంతువు 23,962 మందికి రూ 4.78 కోట్లు, చేనేత కార్మికులు 3,433 మందికి రూ 69 లక్షలు, గీతాకార్మికులు 2245 మందికి రూ 45 లక్షలు, ఒంటరి మహిళలు 1,787 మందికి 36 లక్షలు, బీడీ కార్మికులు 43,183 మందికి రూ 8.69 కోట్లు, పైలేరియా 949 మందికి 19 లక్షలు, డయాలసిస్‌ పేషెంట్లు 133 మందికి రూ 3 లక్షలు, బీడీ టేకేదార్లు 465 మందికి రూ 9 లక్షలు జమ చేస్తున్నారు.

జూన్‌ 15 వరకు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీ ప్రాంతాల్లో జూన్‌ 15 వరకు ఎఫ్‌ఆర్‌ ఎస్‌ యాప్‌లో పింఛన్‌ లబ్ధిదారుల నమోదు జరుగుతుంది. పింఛన్‌దారుల మొఖం, చేతి వేలిముద్రలు నమోదు చేస్తారు. వృద్ధులు, ఇతరులకు చేతి వేళ్లు గుర్తింపు కాకపోతే వారికి రిమార్కులో సడలింపులు ఇస్తారు. స్థానికంగా అందుబాటులో లేని వారికోసం మరో విడతలో అవకాశం కల్పిస్తారు. గ్రామపంచాయతీలో గ్రామదీపికలు, పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపాలిటీలో మెప్మా ఆర్పీలు, వార్డు ఆఫీసర్లు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు ఇచ్చారు.

విచారణ చేశాకే తొలగింపు

చేయూత పింఛన్ల సర్వేలో భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం మరణించిన వారి పింఛన్లు మాత్రమే జాబితాల నుంచి తొలగించేందుకు నమోదు ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు. లబ్ధిదారులు స్థానికంగా నివాసం ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటే సమగ్ర విచారణ చేసి నిర్ధారించుకుంటారు. చేయూత పింఛన్‌ పొందడానికి అర్హులు అయినప్పటికీ స్థానికంగా అందుబాటులో లేకపోతే లైవ్‌నెస్‌ అథెంటిఫికేషన్‌ నిర్వహించుకునేందుకు గడువు కూడా ఇస్తారు. ఇచ్చిన గడువులోపు ఎఫ్‌ఆర్‌ఎస్‌ చేయించుకోకపోతే లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. పింఛన్‌ లబ్ధిదారులు సజీవంగా ఉంటేనే చేయూత అందించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది.

బతికి ఉన్నట్లుగా నిర్ధారణకే..

- ఖదీర్‌ఫాషా, కమిషనర్‌ మున్సిపల్‌ సిరిసిల్ల

చేయుత పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారులు ద్వారా తమ వివరాలను వార్డు అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. పింఛన్‌దారుడు బతికి ఉన్నట్లుగా నిర్ధారించుకోవడానికి మాత్రమే సర్వే. పెన్షన్‌ తొలగింపునకు కాదు. వార్డు ఆఫీసర్లకు లబ్ధిదారులు సహకరించాలి.

Updated Date - May 18 , 2026 | 01:23 AM