Raajanna siricilla : ‘ముగ్గు’ మనోహరం..
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:43 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల/వేములవాడ) నింగిలోని ఇంద్రధనస్సులు నేలపై వాలినట్లు.. ఆకాశంలోని తారలన్నీ పొడుగుపై మెరిసినట్లు, విభిన్న వర్ణాలు వినూత్న రూపాల రంగవల్లులు మనోహరంగా ఆకట్టుకున్నాయి.
- మురిపించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గులు
- వేములవాడలో ఉత్సాహంగా జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు
- మహిళల నుంచి విశేష స్పందన
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల/వేములవాడ)
నింగిలోని ఇంద్రధనస్సులు నేలపై వాలినట్లు.. ఆకాశంలోని తారలన్నీ పొడుగుపై మెరిసినట్లు, విభిన్న వర్ణాలు వినూత్న రూపాల రంగవల్లులు మనోహరంగా ఆకట్టుకున్నాయి. మహిళల సృజనాత్మక భావాలతో తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గులు సప్త శోభిత వర్ణాలుగా ఒదిగిపోయాయి. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ.. స్థానిక స్పాన్సర్ వేములవాడలోని ద్రోణ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడ కేంద్రంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షణ్ హాల్, శ్రీలక్ష్మీ ఆర్గనైజర్స్ వద్ద నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లాస్థాయి ముత్యాల ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా వివిధ మండలాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధరూపాల్లో వేసిన ముగ్గులు అబ్బురపర్చాయి. మహిళలు తమలో దాగిన సృజనాత్మకతను చాటుతూ విభిన్న అంశాలను ముగ్గుల్లో పొందుపరిచారు. ధనుర్మాసం, సంక్రాంతి విశిష్టత, ముక్కోటి ఏకాదశి, వేములవాడ, అయోధ్యలోని దేవాలయాలు, ధాన్యపు సిరులు, అమ్మవార్లు, గొబ్బెమ్మలు, బంతి, చామంతి తదితర పూలతో అలంకరించి ఆకట్టుకున్నారు. ఆంధ్రజ్యోతి ఏబీఎన్ అందిస్తున్న ప్రత్యేక కథనాలను ప్రశంసిస్తూ ముగ్గులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. సంక్రాంతి పర్వదినం ముందే వచ్చిందా అన్నట్లుగా సాగిన ముత్యాల ముగ్గుల పోటీల సంబరాల్లో బహుమతులు అందించడానికి ముగ్గులను ఎంపిక చేయడానికి న్యాయ నిర్ణయితలు ఇబ్బందిపడే విధంగా పోటీపడి ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీకి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బహుమతులను అందించారు. ముగ్గులను స్వయంగా పరిశీలించి మహిళలను అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీ ప్రథమ విజేతగా ఈ రూపిక, రెండో బహుమతి పి శ్రీలత, మూడో బహుమతి ఎం మాధవిలు, రూ.6 వేలు, రెండో బహుమతి రూ.4 వేలు, మూడో బహుమతి రూ.3 వేల చొప్పున నగదు, జ్ఞాపికను ప్రభుత్వ విప్ శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ టీవీ నారాయణలు అందజేశారు. కన్సోలేషన్ బహుమతులు పి మానస, వి అనిత, ఎం శిరీష, వై వాణి, డి మనుశ్రీలు అందుకున్నారు. వారందరికీ ద్రోణ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఊగిల నాగరాజు, డైరెక్టర్లు కౌడుక రమేష్, బోనాల నాగరాజు, డోకే నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేష్, సర్పంచులు రాజు, లక్ష్మారెడ్డి, దేవరాజు, వెంకటేశంగౌడ్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ టీవీ నారాయణ, వేములవాడ ఇన్‌చార్జి అమరగొండ కిషన్, రిపోర్టర్లు గడ్డం సత్యనారాయణరెడ్డి, కంకణాల సాయిశరత్, చింతకింది శ్యాంకుమార్, సిద్ధుల మురళి, పిల్లి శ్రీనివాస్, తూముకుంట శ్రీనివాసరెడ్డి, పాపగారి యాదగిరి, రాచర్ల రాజు, ఎలిగేటి సూర్యకిరణ్, కౌడగాని సత్యం, దుంపేటి గౌరీశంకర్, సీహెచ్ మైలారం, రొక్కం దేవారెడ్డి, లాల చంద్రశేఖర్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం..
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ దురాచారాలను రూపుమాపే విధంగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ప్రతిఏటా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మహిళలు మన సంస్కృతికి ప్రతిబింబాలన్నారు. చదువులో రాణిస్తూ అన్నింటా ఎదగాలన్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిపోతున్న తరుణంలో అంతరించిపోతున్న సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలన్న సదుద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతృప్తికరంగా ఉంద.ని, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్రజ్యోతి దురాచారాలను రూపుమాపుతూ అనేక కథనాలను ప్రచురిస్తోందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉందన్నారు. పోటీలలో ముగ్గులను చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్లుగా ఉందన్నారు. వేములవాడ టెంపుల్ సీటీగా మారుతుందన్నారు.
ముగ్గులు వేయడం ఒక కళ
- విజయలక్షి, ద్రోణ స్కూల్ ప్రిన్సిపాల్
ముగ్గులు వేయడం ఒక కళ. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఇలాంటి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం మహిళలకు చక్కని గుర్తింపుతో పాటు వారిలోని కళా నైపుణ్యం వెలికితీసే అవకాశం ఉంటుంది, వంటింటికి పరిమితమయ్యే మహిళలు, యువతులకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి.