Raajanna siricilla : శివుడే పెనిమిటిగా..
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:05 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) పురోహితులు, వేదమంత్రాలు పఠిస్తుండగా సీతారాముల కళ్యాణ వేడుకలను భక్తకోటి జగదానందంగా వీక్షిస్తారు.
- రామయ్య తలంబ్రాలు.. రుద్రాక్షే మంగళసూత్రం..
- రాజన్న క్షేత్రానికి ‘ధారణ’కు తరలివస్తున్న శివపార్వతులు
- నేడు వేములవాడలో శివపార్వతుల కల్యాణానికి ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పురోహితులు, వేదమంత్రాలు పఠిస్తుండగా సీతారాముల కళ్యాణ వేడుకలను భక్తకోటి జగదానందంగా వీక్షిస్తారు. రామయ్య పెళ్లి వేడుకలకు ఊరు వాడా సంబరపడుతారు. రామయ్య తలంబ్రాల ఘట్టాన్ని నయనానందకరంగా జరుపుతారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరపడానికి అన్ని దేవాలయాల్లోనూ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే రాములోరి పెళ్లిలో మాత్రం ధర్మ ప్రచారకులుగా ఉన్న శివపార్వతులు శివుడే పెనిమిటిగా తమ వివాహాలను పునరుద్ధరించుకునే వేడుక కూడా చూడాల్సిందే. సీతారాముల కల్యాణ వేడుకల్లో వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో త్రిశూలం గంటల మోత.. వర్షపు జల్లుగా కురిసే తలంబ్రాలు శివసత్తుల పూనకాలతో దద్దరిల్లిపోయే ఆ సన్నివేశాలు మహా అద్భుతాలుగానే చెప్పుకోవచ్చు. ఈ పెళ్లి తంతును జంగాలుగా పరిగణించే వీరశైవులు రుద్రాక్షే మంగళసూత్రంగా, కాళ్లకు రాగిమట్టెలు, చేతికి త్రిశూలాన్ని ఇచ్చి పెళ్లి తంతు నిర్వహిస్తారు.
ఆగని ధారణ...
లోకజ్ఞానం తెలియని ఆడ పిల్లలను సైతం శివపార్వతులుగా శివుడితో పెళ్లి చేసే తంతు వేములవాడ వేదికగా ‘ధారణ’ పేరుతో సాగిపోతునే ఉంది. స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ యంత్రాంగం కూడా చిన్నారులకు పెళ్లి తంతు నిర్వహించవద్దని కౌన్సెలింగ్ చేసినా ఆచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లోని ప్రతి ప్రాంతంలోనూ శివపార్వతులుగా మారిన స్త్రీ, పురుషులు, పిల్లలు సైతం తరలివస్తారు. ఆడ,మగ తేడా లేకుండా శివపార్వతులుగా మారుతున్న తీరును తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల కొంతమేరకు ఫలితాలు ఇస్తున్నాయి.
శ్రీరామ నవమి రోజు పెళ్లిళ్ల పునరుద్ధరణ..
శ్రీరామ నవమి రోజునే ఆలయ ప్రాంగణంలో జరిగే కల్యాణం వేళ శివపార్వతులు ఎక్కడ ఉన్నా వేములవాడకు వచ్చి శివుడితో వివాహం చేసుకున్నట్లు పెళ్లి తంతును నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు లక్షల మంది శివపార్వతులు తమ పెళ్లిళ్లను పునరుద్ధరించుకుంటారు. సీతారాముల కల్యాణం జరుగుతుండగా జంగమయ్య ఆధ్వర్యంలో పెళ్లి తంతు నిర్వహించుకుంటారు. నూతన వస్త్రాలు ధరించి, నుదుట పెద్దబొట్టు, బాసికాలు, తలపై జీలకర్ర, బెల్లం, చేతిలో త్రిశూలం ధరించి జోలె, అక్షింతలు పట్టుకొని దేవునితో తమ వివాహం చేసుకుంటారు. తాహతు మేరకు కట్నాలు కూడా చదివిస్తారు. పెళ్లిళ్లు చేసుకొని పిల్లాపాపలతో కుటుంబ జీవనం గడుపుతూనే శివపార్వతులుగా మారిన వారు కూడా ఉంటారు. అనారోగ్యానికి గురైన సందర్భంలో దేవుడికి మొక్కుగా మారిన తదనంతర కాలంలో శివపార్వతులుగా మారిపోతున్నట్లు చెప్పుతుంటారు. వేములవాడ దేవస్థానంలో జరిగే ఈ శివపార్వతులు పెళ్లి తంతును జంగాలుగా పరిగణింపబడే వీర శైవులు నిర్వహిస్తారు. శివపార్వతిగా మారే వారికి జంగమయ్యనే మెడలో రాగి మంగళసూత్రం, కాళ్లకు రాగి మట్టెలు తొడిగి స్త్రీ, పురుష భేదం లేకుండా చీర కట్టిస్తారు. చేతికి త్రిశూలాన్ని ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు. దీంతో ఆయా స్త్రీ, పురుషులు శివపార్వతులుగా మారినట్టు భావిస్తారు. ఆనాటి నుంచి వారు ఆదిభిక్షువైన శివుడి అడుగుజాడల్లో నడుస్తూ భిక్షాటన చేస్తారు. ఒకసారి శివుడితో పెళ్లి చేసుకున్న తరువాత శివుడి భార్యగానే కొనసాగుతారు. ఈ సాంప్రదాయం ఎప్పటినుంచో ఉన్నా ఇటీవల కాలంలో వీరి సంఖ్య బాగా పెరిగింది. వారి జీవనం కూడా దయనీయంగానే ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు వయస్సు వచ్చిన ఆడపిల్లలను కూడా దేవుడి పేరుతో శివపార్వతులుగా వదలి వేస్తున్నారు. ఏళ్ల తరబడి దేవుడి పేరుతో గడిపిన స్త్రీలు వయస్సు ఉడిగాక తమ వారంటూ లేక ఆలయం మెట్ల మీదనే కాలం వెల్లదీస్తున్నారు.
సాధారణ జీవితం గడుపుతూ....
ఆర్థికంగా, సామాజికంగా కొంత మెరుగైన స్థితిలో ఉన్న శివపార్వతులు తమ మామూలు జీవితంలో పెళ్లిళ్లు చేసుకొని సంసారాలు చేస్తూనే శివపార్వతులుగా కొనసాగుతున్న వారున్నారు. వివిధ ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వీరు కూడా ప్రతియేటా శ్రీరామ నవమికి వేములవాడ శివుడి వద్దకు వచ్చి పెళ్లిని పునరుద్ధరించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ శివపార్వతులు దురాచారం రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని దేవదాసీలు, కర్నూలు జిల్లాలోని బసివినులు, నిజామాబాద్ జిల్లాలోని జోగినిల ఆచారాలకు దగ్గరగా ఉన్నా అందులో మహిళలకే పరిమితం కాగా శివపార్వతుల ఆచారం స్త్రీ, పురుషులకు సంబంధించినదిగా ఉంటుంది. జోగిని, దేవదాసి, బసివినిల్లో లైంగిక దోపిడీ, వ్యభిచారం ఉండగా శివపార్వతుల్లో కేవలం భిక్షాటన, ఽధార్మికత ప్రధానంగా ఉంటుంది. శివపార్వతులు పెళ్లిళ్లు చేసుకొని పిల్లాపాపలతో కుటుంబ జీవనం గడుపుతూనే శివున్ని పెళ్లాడుతుంటారు. శివపార్వతులు వేములవాడ ఆలయ ప్రత్యేకతను చాటుతూ ధార్మిక ప్రచారకులుగా ఎనలేని సేవలను అందిస్తున్నారు.