Share News

Raajanna siricilla : రుణ పరిమితి ఖరారు

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:06 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) వానాకాలం సీజన ప్రారంభానికి ముందే పంట రుణాల పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స) ప్రణాళికను ఖరారు చేశారు.

Raajanna siricilla :  రుణ పరిమితి ఖరారు

- వానకాలం, యాసంగి సీజనలో 128 పంటలకు వర్తింపు

- స్వల్పంగానే పెంపుదల.. రైతుల్లో నిరాశ

- వరి, పత్తి కి రూ. 2వేలు, మొక్కజొన్నకు రూ. 3 వేలు

- జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు

- 1.34 లక్షల మంది రైతులకు లబ్ధి

- 2026- 27 నాబార్డు రుణ లక్ష్యం రూ. 4,287 కోట్లు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వానాకాలం సీజన ప్రారంభానికి ముందే పంట రుణాల పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స) ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయం మేరకు2026-27 వానాకాలం, యాసంగి సీజనలకు సంబంధించిన 128 పంటలకు సంబంధించి రుణ పరిమితిని పెంచారు. గతేడాదితో పోలిస్తే రాజన్నసిరిసిల్ల జిల్లాలో సాగుచేసే ప్రధాన పంటల్లో కొన్ని పంటలకు మాత్రమే స్వల్పంగా పరిమితి పెరిగింది.

వరి, పత్తికి రెండు వేల రూపాయలు, మొక్కజొన్నకు మూడు వేల రూపాయలు పెంచారు. గత సంవత్సరం వరికి ఎకరానికి రూ. 46,000 పరిమితిని రూ. 48,000కు పెంచింది. పత్తి రూ. 50,000 వేలు ఉండగా రూ. 52,000కు పెరిగింది. గత సంవత్సరం రుణాలు ఇవ్వని వివిధ రకాల పంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. నీటిపారుదల సౌకర్యం కలిగి ఉన్న పత్తి సాగు చేసే రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందించలేదు. ఈసారి ఎకరానికి రూ. 52,000 చొప్పున బ్యాంకులో రుణాలు ఇవ్వనున్నారు. విత్తన వరి పంటకు ఎకరానికి రూ. 45,000, మిర్చీ రూ. లక్ష, పుదీనా రూ. 35,000, అంటుకట్టిన కూరగాయలు ఎకరానికి రూ. 70,000, మల్బరీకి రూ. 64,000, స్వీట్‌ జొన్నకు రూ. 24,000 చొప్పున రుణాలు ఇవ్వనున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా 2.47 ఎకరాకలకు సంబంధించి 75,931 మంది రైతుల వద్ద 81,416 ఎకరాల భూమి ఉంది. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధిచి 25,092 మంది రైతుల వద్ద 86,460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8,346 మంది రైతుల వద్ద 53,560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1,427 మంది రైతుల వద్ద 18,962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2,756 ఎకరాల భూములు ఉన్నాయి.

- పాడి రైతులకు రుణాల పెంపు

పాడి రైతులకు అందించే రుణాలను కూడా పెంచారు. 2025-26 సంవత్సరంలో గేదెకు రూ. 35,000 ఉండగా 2026-27లో రూ. 37,500 పెంచారు. ఆవుకు రూ. 35,000 ఉండగా రూ. 38,000 పెరిగింది. గొర్రెలు, మేకల కొనుగోలుకు సంబంధించి మేకల యూనిటుకు రూ. 29,000 నుంచి రూ. 32,000కు. గొర్రెల యూనిట్‌ రూ. 29,000 నుంచి రూ. 35,000కు పెరిగింది. గతంలో బాయిలర్‌ ఒక్కో కోడి పిల్ల రూ. 210 ఉండగా ఈసారి రూ. 230, లేయర్‌ కోడి పిల్ల రూ. 440 నుంచి రూ. 450 కి పెరిగింది. చేపలు ఒక హెక్టారుకు రూ. 4 లక్షలను యఽథావిధిగా ఉంచారు.

- కూరగాయల సాగు రైతులకు నిరాశే

జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటలు, ఉద్యానవన పంటలకు రుణ పరిమితి రైతులను నిరాశపరిచింది. ఎకరానికి వెయ్యి మాత్రమే పెంచారు. ఆయిల్‌పామ్‌ సాగుకు సంబంధించి రూ. 48,000 నుంచి రూ. 50,000 వరకు రుణ పరిమితి ఐదేళ్ల వరకు నిర్ణయించారు. మిర్చికి సంబంధించి రూ. 86,000 నుంచి రూ. 90,000 వరకు, మల్చింగ్‌ సంబంధించి రూ. లక్ష, టమాట రూ. 57,000 నుంచి రూ. 58,000 వరకు నిర్ణయించారు. ములక్కాడ రూ. 36,000 నుంచి రూ. 40,000, అల్లం రూ. 71,000 నుంచి రూ. 72,000కు, వెల్లుల్లి రూ. 40,000 నుంచి రూ. 41,000కు పెరిగింది. దాదాపుగా సాగుపై నామమాత్రంగానే పెరగడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

- వ్యవసాయానికి రూ. 3,456.81 కోట్ల్లు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2026-27 అర్థిక సంవత్సరంలో రూ 4,287.17 కోట్లు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) రుణం అందించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రొటెన్సియన లింక్‌డ్‌ క్రెడిట్‌ ప్లాన (పీఎల్‌ఫీ)ని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సమక్షంలో ఈనెల 18న ఎల్‌డీఎం మల్లికార్జునరావు, ఆర్బీఐ ఏజీఎం రాములు సబావత, నాబార్డ్‌ డీడీఎం దిలీప్‌, యూబీఐ ఏజీఎం సురేష్‌ కుమార్‌, టీజీబీ ఆర్‌ఎం రాజనరేంద్ర, డీఆర్‌డీవో గీత ఆవిష్కరించారు. దాని ప్రకారం జిల్లాకు రూ. 4,287 కోట్ల రుణ సహాయాన్ని అందించాలని జిల్లాలోని బ్యాంక్‌లకు నిర్దేశించింది. వ్యవసాయానికి రూ3,456.81 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ 673.53 కోట్లు, ఎగుమతులకు రూ3.20 కోట్లు, విద్యారంగానికి రూ 30.11 కోట్లు, గృహా నిర్మాణాలకు రూ 42.84కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలకు రూ 11.56 కోట్లు, ఇందన రంగానికి రూ 31.10 కోట్లు, ఇతర విభాగాలకు రూ 35.84 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025-26 సంవత్సరంలో డిసెంబరు వరకు జిల్లాలో రూ. 4,890. 84 రుణ ప్రణాళిక లక్ష్యంగాను రూ 3,469.91 కోట్లు రుణాలు అందించారు.

పంట రుణం పరిమితి మేరకు రుణాలు

మల్లికార్జునరావు, లీడ్‌ బ్యాంక్‌, జిల్లా మేనేజర్‌

2026-27 సంవత్సరానికి సంబంధించి రుణ పరిమితి ఖరారు చేశారు. దీని ప్రకారం రుణాలు ఇవ్వడం జరుగుతుం ది. రైతులు పెరిగిన పంటల రుణ పరిమితిని సద్వినియోగం చేసుకోవాలి. రుణ పరిమితి ఆధారంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రుణాల పంపిణీ చేస్తాం.

Updated Date - Mar 23 , 2026 | 01:06 AM