Share News

Raajanna siricilla : హోలీ... ఆనందాల కేళీ

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:09 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) రంగుల పండుగ వచ్చేసింది. హోలీ వేడుకలను మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకోవడానికి చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ సిద్ధమయ్యారు.

Raajanna siricilla :  హోలీ... ఆనందాల కేళీ

- సోషల్‌మీడియాలో జోరు

- డీజేల సంగీత హోరుకు సన్నద్ధం

- చర్మవ్యాధులకు అస్కారం.. వెజిటేబుల్‌ రంగులు శ్రేయస్కరం

- సంబురంగా కామదహనం, ఆలయాల్లో పూజలు

- రేపు జిల్లాలో హోలీ సంబరాలకు సర్వం సిద్ధం

- నేడు కామదహనం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రంగుల పండుగ వచ్చేసింది. హోలీ వేడుకలను మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకోవడానికి చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ సిద్ధమయ్యారు. హోలీ పూర్ణిమగా జరుపుకునే వేడుకల కంటే ముందు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా కామదాహన వేడుకలు నిర్వహించనున్నారు. ఫాల్గుణ శుద్ధ చతుర్ధశి రోజున కామదాహనం, ఫాల్గుణ పౌర్ణిమ కాముని పున్నమి పేరిట సంబురాలు జరుపుకుంటారు. లోక కల్యాణం కోసం పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథున్ని కోరుతారు. అలవాటు ప్రకారం శివుడుపైకి మన్మథుడు బాణాన్ని ప్రయోగించి తపోభంగం చేస్తారు. ఆగ్రహానికి లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. ఇలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల కామదాహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో తగల బెడతారని పురాతన గాథలు చెబుతున్నాయి. దీని ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హోలీకి ముందు రోజు కామదాహన వేడుకలు ఎంతో సంబురంగా జరుపుకుంటారు.

రంగు పడాల్సిందే...

ఆనందాలను తెచ్చే హోలీ రోజు అందరికి రంగు పడాల్సిందే. ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు కూడా యువకులు ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ ఆర్గనైజర్లు రంగంలోకి దిగారు. జోష్‌ను పెంచే దిశగా డీజే సౌండ్ల మోతలు పెరగనున్నాయి. ఒకప్పుడు ప్రకృతిలో దొరికే గోగుపూల నుంచి మొదలుకొని రకరకాల పూల నుంచి సహజ సిద్ధంగా రంగులు తయారుచేసుకుని ఆడుకోనేవారు. ఇప్పుడు ప్రమాదరకరమైన రసాయన రంగులతో ఆడుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. హోలీ పండుగ రంగుల జీవితాన్ని చీకటిమయం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈసారి ప్రకృతి సిద్ధమైన రంగులతోనే సహజంగా ఆడుకోవాలని కోరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పండుగైనా సంప్రాదాయ, ఆచార వ్యవహారంగా జరుపుకుంటారు. రకరకాల రంగులు చల్లుకొని, పూసుకొని, విసురుకొని, చిమ్ముకొని ఉల్లాసంగా జరుపుకునే రంగుల కేళిలో ఆనందమయం కావడానికి యువత ఉత్సాహం చూపుతుంది. కలర్‌ఫుల్‌ రంగులతో మార్కెట్‌ కూడా కళకళలాడుతోంది. ఫెస్టివల్‌ ఆఫ్‌ కలర్స్‌గా జరుపుకోవడానికి యువతీ యువకులు జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, పిల్లలు, సందడిగా జరుపుకోవడానికి ఎదురుచూస్తుంటే డీజేల మోతలో యువతీయువకులు నృత్యాలు చేస్తూ మద్యం మత్తులో మునిగిపోతారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వసంత కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే వసంతోత్సవంగా కూడా చెప్పుకుంటారు.

హానీ కలిగించే రంగులు.. ప్రకృతి రంగులు మేలు..

హోలీ అనగానే రంగుల మేళవింపు గుర్తుకు వస్తాయి. గతంలో సహజ రంగులతో హోలీ అడేవారు. వాటివల్ల ఏలాంటి ప్రమాదం ఉండదు. ప్రకృతిలో లభించే వెజిటేబుల్స్‌, ఆకులు, పూలతో తయారుచేసిన రంగులతో చర్మ రంగు నిగారించడమే కాకుండా రుతువులు మారడం వల్ల వచ్చే దుష్ప్రభావాన్ని నివారిస్తుంది. ఏలాంటి ప్రభావం చూపని పువ్వుల సువాసనలు, కూరగాయల తీయ్యదనాన్ని ఆస్వాదిస్తూ హోలీని ఆడుకోవడం మంచిది.

మారుతున్న కాలంలో మార్కెట్‌లోకి రసాయన రంగులు గులాల్‌ చేరడంతో పలు వ్యాధులకు కూడా గురయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. రంగుల్లో లోహాలు, ఆమ్లాలు, అల్కలైట్‌, గాజుపోడి, నలుపు రంగులో ఆక్సైడ్‌, ఆకుపచ్చ రంగులో కాపర్‌సల్ఫైట్‌, ఎరుపు రంగులో మెర్క్యురీసల్ఫెట్‌, వీటితో పాటు చాక్‌పౌడర్‌, సిల్కాన్‌ వంటివి ఉంటాయి. ఇవి చల్లడం వల్ల చర్మ వ్యాధులు, కన్నుల్లో పడితే కన్నులు ఎర్రబారడం, గరగర మంటలు వస్తాయి. చూపు తగ్గిపోవడం ఉంటుంది. చర్మవ్యాధులు, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

పండుగ వెనుక...

హోలీ పండుగ నిజానికి హిందువుల పండగే అయినప్పటికి పంజాబ్‌లో సిక్కులతోపాటు ఉత్తరప్రదేశ్‌లో బృందావనం, మదురలో హోలీ పండుగను 16రోజుల పాటు జరుపుకునే ఆచారం కూడా ఉంది. పురాణ గాథల ప్రకారం కృష్ణుడు చిన్నతనంలో యశోధను రాధ అంత తెల్లగా ఉండగా తాను నల్లా ఉన్నానని మారం చేస్తాడు. కృష్ణున్ని సమాధాన పర్చడానికి రాధకు రంగులు పూసి ఆమె తెలుపు కనబడకుండా చేస్తుందని, అందుకే దీన్ని రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా కూడా ఆ ప్రాంతంలో జరుపుకుంటారు.

రంగుల్లో ఎన్నో భావాలు..

రంగుల్లో ఎన్నో భావాలు వ్యక్తం అవుతాయని చెప్పుకుంటారు. వాయిలెట్‌ రంగు మనస్సును ఆనందాన్ని కలిగిస్తుందని వ్యక్తుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని చెప్పుకుంటారు. నీలం రంగు వ్యక్తి మనస్సులో విజ్ఞానాన్ని ప్రేరేపిస్తుందని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని చెప్పుకుంటారు. ఆకుపచ్చ రంగు మనస్సులో వ్యక్తిపై, వస్తువులపై ఆసక్తి కలిగించడం ప్రేమభావన పెంపొందించడం, పసుపు రంగు మానసిక ఉత్సాహాన్ని, కాశాయం రంగు కల్మశాన్ని తొలగించే గుణం ఉంటుందని భావిస్తారు. ఎరుపు రంగు శక్తికి ప్రతీకగా వెనుకడుగు వేయని తత్వాన్ని పెంచుతుందని భావిస్తారు. ఈ రంగుల మయంలో స్నేహంతో జీవితాన్ని ఆనందమయం చేస్తుందని భావిస్తారు. రంగులు చల్లుకునే సమయంలో కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రోడ్లపై అనైతికంగా, బలవంతంగా రంగులు రుద్దడం మంచిది కాదు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటిపై ఎక్కువ సేపు రంగులను ఉండకుండా చూసుకోవడం మంచిది.

వాట్సాప్‌, సోషల్‌మీడియాలో హోలీ జోరు..

రంగుల పండుగ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లాంటి సోషల్‌మీడియాల్లో హోలీ శుభాకాంక్షలతో ప్రతి ఏటా హోరేత్తిస్తున్నారు. రంగుల రసాయనాలతో హోలీ ఆడుకోవద్దని నిపుణులు చెపుతుంటే.. యువకులు సామాజిక మాధ్యమాల్లో రకరకాల హోలీ పోస్టింగ్‌లు పెడుతున్నారు. రకరకాల మేసేజ్‌లతో హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. రంగులు కొనే ఖర్చులేదు. నీటి వృథా లేకుండా స్మార్ట్‌ ఫోన్‌లలో విజువల్‌ ఎఫెక్ట్‌తో యువతీ యువకులు హోలీకి వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 02:09 AM