Raajanna siricilla : ‘అభయ’ం మరిచినట్లేనా..?
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:51 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) తమ కుటుంబానికి అభయంగా నిలుస్తుందని పొదుపు సంఘాల్లోని మహిళలు ఎంతో ఆశగా, ఉత్సాహంగా అభయ హస్తం పథకంలో చేరిన వారికి నిరాశ మిగిలింది.
- జిల్లాలో 60,881 మంది ‘అభయహస్తం’ లబ్ధిదారులు
- వాటాధనం కోసం ఎదురుచూపులు
- ఊరించి నిరాశపరిచిన ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తమ కుటుంబానికి అభయంగా నిలుస్తుందని పొదుపు సంఘాల్లోని మహిళలు ఎంతో ఆశగా, ఉత్సాహంగా అభయ హస్తం పథకంలో చేరిన వారికి నిరాశ మిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అభయహస్తం లబ్ధిదారులు కనీసం తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని గత ప్రభుత్వం నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు కోరుతున్న స్పందన లేకపోవడంతో ఇక తమ అభయాన్ని మరిచినట్లేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారులకి రావడంతోనే అభయహస్తం డబ్బులు తిరిగి చెల్లిస్తామని, దాని స్థానంలో కొత్త పథకం తీసుకొస్తామని పదేపదే ఆశలు కల్పించిన అమలులోకి మాత్రం రాలేదు. అభయ హస్తం పథకం ద్వారా వాటా దనం చెల్లించిన మహిళలు వారి డబ్బులు తిరిగి ఇవ్వాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కోరుతూనే ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం డబ్బులు తిరిగి ఇచ్చేందుకు గత సంవత్సరం నిర్ణయించినా అమలు కాలేదు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అభయ హస్తం లబ్ధిదారులు వివరాలు కూడా సేకరించారు. నెలలు గడిచిపోయినా మళ్లీ లబ్ధిదారులకు తిరిగి వాళ్లు చెల్లించిన వాటా ధనం ఇచ్చే ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. కనీసం అభయహస్తం డబ్బుల చెల్లింపుకు మంగళం పాడినట్లేనా అనే అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ లబ్ధిదారులు కొంతమంది చనిపోగా, మిగిలిన వారు తాము చెల్లించిన డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60,881 మంది లబ్ధిదారులు తమ వాటాధన కింద రూ.4.82 కోట్లు చెల్లించారు. 2009న ప్రారంభమైన అభయ హస్తం పథకాన్ని 2016లో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకంలో డబ్బులు కట్టిన వారిని తిరిగి చెల్లిస్తామని 2022లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. రాజకీయ పరిణామాల క్రమంలో ప్రభుత్వం మారిపోయింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం లబ్ధిదారులు తాము చెల్లించిన వాటా ధనమైనా ఇప్పించాలని కోరడంతో ప్రభుత్వం 2025లో ఫిబ్రవరి చివరిలోగా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిన ఆచరణలోకి రాలేదు.
నీరుగారిన అభయ హస్తం లక్ష్యం..
ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ పురుడు పోసుకున్న మహిళా పొదుపు సంఘాలు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాలతో వ్యాపారాలు, స్వయంఉపాధితో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే 2009లో అప్పటి ప్రభుత్వం పొదుపు సంఘాల్లోని మహిళలకు ఎల్‌ఐసీ అనుసంధానంతో అభయహస్తం పథకాన్ని అందించినా ఆచరణలో లక్ష్యం నీరుగారిపోయింది. అభయహస్తం పథకంలో చేరిన మహిళలకు ఎంతో ఉపయోగకరంగా కనిపించింది. కానీ ఆ తరువాత వచ్చిన తెలంగాణ స్వరాష్ట్రంలోనే ప్రభుత్వం పథకాన్ని నిలిపివేయడంతో మహిళలు నిరాశ చెందారు. కనీసం ప్రీమియం చెల్లించిన లబ్ధిదారులకు తిరిగి డబ్బులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే చూపుతోంది. పథకం లేకపోయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లబ్ధిదారులకు కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. అభయ హస్తంపై 2022 మార్చిలో లబ్ధిదారులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు అభయ హస్తం వివరాలు ఇవ్వాలని కోరడంతో లబ్ధిదారుల పాలసీ వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు సెర్ప్ సేకరించి ప్రభుత్వానికి పంపించింది. అభయ హస్తం డబ్బులు వస్తాయని భావించినా దాదాపు నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు లబ్ధిదారులకు ప్రీమియం డబ్బులు గానీ, బకాయిలు గానీ అందించలేదు. అభయహస్తం ద్వారా అందాల్సిన పింఛన్, బీమా, ఉపకార వేతనాలు పదేళ్లుగా నిలిచిపోయాయి. ఆసరా పింఛన్ కూడా ఒక వ్యక్తికి ఒకే పింఛన్ నిబంధనతో అభయ హస్తం లబ్ధిదారులు ఆసరా పింఛన్లు కూడా పొందలేకపోయారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకానికి మంచి స్పందన లభించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పింఛన్లు కూడా వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60,881 మంది అభయ హస్తం లబ్ధిదారులు పథకంలో చేరి వాటాధనాన్ని చెల్లించారు. గత ఆరేళ్లుగా పింఛన్‌కు కూడా లబ్ధిదారులో నోచుకోవడం లేదు. జిల్లాలో అభయహస్తం సభ్యులు బోయిన్‌పల్లి మండలంలో 4909మంది, చందుర్తిలో 3176 మంది, ఇల్లంతకుంటలో 5497మంది, గంభీరావుపేటలో 6067 మంది, కోనరావుపేటలో 5860 మంది, ముస్తాబాద్‌లో 6439 మంది, రుద్రంగిలో 2104 మంది, సిరిసిల్ల మున్సిపల్‌లో 7268 మంది, తంగళ్లపల్లిలో 3780 మంది, వీర్నపల్లిలో 1520 మంది, వేములవాడ మున్సిపల్‌లో 83 మంది, వేములవాడలో 5532 మంది, వేములవాడ రూరల్‌లో 3321 మంది, ఎల్లారెడ్డిపేటలో 5325 మంది ఉన్నారు.
జిల్లాలో లబ్ధిదారుల వాటాధనం రూ.4.82 కోట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభయహస్తం పథకంలో చేరినా 60881 మంది సభ్యులు ప్రతి సంవత్సరం రూ.365 చొప్పున రూ.4.82కోట్లు వాటాధనం కింద జమచేశారు. సభ్యుల్లో 60 సంవత్సరాలు దాటిన వారు పింఛన్‌కు అర్హత పొందారు. 2016 సంవత్సరం వరకు పింఛన్ అర్హత పొందిన 3969 మంది ఉన్నారు. పథకంలోని 60 సంవత్సరాల లబ్ధిదారులకు 2015 డిసెంబర్ వరకు పింఛన్, సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు సక్రమంగానే అందాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బకాయిలు 2017 జనవరిలో మాత్రమే పింఛన్ వచ్చింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసి వెబ్‌సైట్‌ను మూసివేశారు.
పింఛన్ బకాయిలు రూ.8కోట్లు..
అభయ హస్తం పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పొదుపు సంఘాల్లోని సభ్యులు పథకంలో చేరారు. పథకాన్ని ఎల్‌ఐసీ సంస్థతో అనుసంధానం చేశారు. పొదుపు సంఘాల్లోని నిరుపేద మహిళలు అర్హులుగా చేర్చి రోజుకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రూ.365 జమ చేయించారు. జమ చేసిన సభ్యుల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి రూ.500 చొప్పున పింఛన్ అందించే వారు. సభ్యురాలికి బీమా సౌకర్యం కల్పించారు. సహజంగా మరణిస్తే రూ.30వేలు, ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం చెందిన రూ.75 వేలు, పాక్షికంగా దివ్యాంగులు అయితే రూ.37500 చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పింఛన్ రావాల్సిన వారికి బకాయిలు రూ 8 కోట్ల వరకు ఉన్నాయి. పింఛన్ బకాయిలతో పాటు ఇన్సూరెన్స్ కూడా అందలేదు.