Share News

Raajanna siricilla బాలికలదే పైచేయి..

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:29 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లాలో ఈసారి కూడా బాలికలు సత్తా చాటారు. ఆదివారం ప్రకటించిన ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు.

Raajanna siricilla బాలికలదే పైచేయి..

- ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌లో 49.05 శాతం ఉత్తీర్ణత

- రెండో సంవత్సరం జనరల్‌లో 58.69 శాతం ఉత్తీర్ణత

- ప్రథమ, రెండో సంవత్సరంలో 2105 మంది బాలికలు అధికంగా ఉత్తీర్ణత

- రాష్ట్రస్థాయిలో జిల్లాకు 35వ స్థానం

- మే 13 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లాలో ఈసారి కూడా బాలికలు సత్తా చాటారు. ఆదివారం ప్రకటించిన ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. పలు కళాశాలలో ప్రైవేట్‌ కాలేజీ విద్యార్థులతో పోటీపడి ప్రభుత్వ కళాశాలకు చెందిన పిల్లలు అత్యధిక మార్కులు సాధించారు. అయితే రాష్ట్ర స్థాయిలో జిల్లాలో లాస్ట్‌లో నిలవడం నిరాశపరిచింది. రాష్ట్ర స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానం ఏటా పడిపోతూ వస్తోంది. 2023-24లో మొదటి సంవత్సరం 13వ స్థానం, రెండవ సంవత్సరం 16వ స్థానంలో నిలిచింది. 2024-25 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం 24వ స్థానం, రెండవ సంవత్సరంలో 28వ స్థానంలో నిలిచింది. ఈసారి 2025- 26 సంవత్సరం వార్షిక పరీక్షల్లో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో 35వ స్థానంతో నిలిచింది. ఈ సంవత్సరం వార్షిక ఇంటర్‌ ఫలితాల్లో మాత్రం మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో చివరి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచి అందరీని నిరాశపరిచింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో జనరల్‌ 49.05 శాతం, రెండో సంవత్సరంలో 58.69 ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో రెగ్యులర్‌ ఇంటర్‌, ఒకేషనల్‌ ఫలితాల్లో 51 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌లో 4201 మంది ఉత్తీర్ణత

జిల్లాలో ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 7,594 మంది పరీక్షలకు హాజరుకాగా 4,201 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,393 మంది ఫెయిల్‌ అయ్యారు. ఈసారి కూడా బాలికలు అత్యధికంగా 2,105 మంది అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మొదటి సంవత్సరంలో జనరల్‌లో 3,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,754 మంది ఉత్తీర్ణులయ్యారు. 49.05శాతంగా ఉంది. ఇందులో బాలురు 1,302 మంది పరీక్షలకు హాజరుకాగా 365 మంది ఉత్తీర్ణులయ్యారు. 28.03 శాతం ఉండగా బాలికలు 2,274మంది పరీక్షలకు హాజరుకాగా 1,389 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం ఫలితాల్లో 3,149మంది పరీక్షలకు హాజరుకాగా 1,848 మంది ఉత్తీర్ణులయ్యారు. 58.69 శాతంగా ఉంది. ఇందులో బాలురు 1,101మంది హాజరు కాగా 434 మంది ఉత్తీర్ణులయ్యారు. 39.42 శాతం ఉంది. బాలికలు 2,048మంది హాజరుకాగా 1,414 మంది ఉత్తీర్ణులయ్యారు. 69.04 శాతంగా ఉంది.

ఒకేషనల్‌లో 599మంది ఉత్తీర్ణత

జిల్లాలో మొదటి, రెండవ ఇంటర్‌ ఒకేషనల్‌లో 869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 599 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 270 మంది ఫెయిలయ్యారు. మొదటి సంవత్సరంలో 470మంది విద్యార్థులకు 325మంది ఉత్తీర్ణులయ్యారు. 69.15శాతంగా ఉంది. 145 మంది ఫెయిలయ్యారు. బాలురలో 241 మందికిగాను 133 మంది, 55.19శాతం, బాలికల్లో 229మందికి 192 మంది ఉత్తీర్ణత సాధించారు. 83.84శాతం ఉంది. రెండవ సంవత్సరంలో 399 మంది విద్యార్థులకు 274మంది ఉత్తీర్ణులయ్యారు. 68.67శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురలో 212 మందికి 116 మందితో 54.72 శాతం, బాలికల్లో 187 మందికి 158 మందితో 84.49 శాతం ఉత్తీర్ణులయ్యారు.

బాలుర కంటే 2,105 మంది బాలికలే అధికం...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే భేష్‌ అనిపించుకున్నారు. మొదటి, రెండవ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాల్లో 7,594మంది విద్యార్థులకు 4,201 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,393 మంది ఫెయిలయ్యారు. బాలురు 1,046 మంది, బాలికలు 3,153 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అధికంగా బాలికలు 2,105 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలురులో 1,543మంది పరీక్షలకు హాజరు కాగా 498మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,503 మంది హాజరు కాగా 1,581 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురకంటే 1,083 మంది బాలికలే అధికంగా ఉన్నారు. రెండవ సంవత్సరంలో బాలురు 1,313 మంది హాజరు కాగా 550 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,235మంది హాజరు కాగా 1,572 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,022 మంది బాలికలు అధికంగా ఉన్నారు.

ప్రభుత్వ కళాశాల విద్యార్థులు భేష్‌

జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో భేష్‌ అనిపించుకున్నారు. సిరిసిల్ల జూనియర్‌ కళాశాలకు చెందిన కే శశికుమార్‌ రెండో సంవత్సరంలో ఎంపీసీలో 982 మార్కులు, మొదటి సంవత్సరంలో ఎస్‌ శ్రీహిత 462 మార్కులు సాధించారు. కేజీబీవీ విద్యార్థుల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 328 మంది విద్యార్థులకు 278మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 478మంది విద్యార్థులకు 400మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో సిరిసిల్లలో బైపీసీలో కీర్తన 436మార్కులు, మర్రిపల్లిలో ఎంపీసీలో మమత 436 మార్కులు, రుద్రంగిలో ఎంపీసీలో జి మమత 466మార్కులు, తంగళ్ళపల్లిలో ఎంపీహెచ్‌డబ్ల్యులో ఎల్‌ శృతికి 490 మార్కులు, సీఈసీలు దివ్య చరితకు 488 మార్కులు, బోయినపల్లిలో ఎంఎల్‌టీలో గాయత్రికి 482 మార్కులు, వేములవాడలో ఏఐఎంఎల్‌లో అక్షితకు 486 మార్కులు సాధించారు. జిల్లాలోని ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 437మంది విద్యార్థులకు 327మంది, రెండవ సంవత్సరంలో 417మంది విద్యార్థులకు 354మంది ఉత్తీర్ణత సాధించారు. బద్దనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో వంద ఉత్తీర్ణత సాధించారు.

వచ్చేనెల 13 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ..

ఇంటర్మీడియట్‌ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 20 వరకు నిర్వహించడానికి షెడ్యూల్‌ ప్రకటించారు. ప్రతిరోజు పరీక్షలు రెండు పూటలు నిర్వహిస్తారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ మే 22 నుంచి 20 వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ఏప్రిల్‌ 13 నుంచి 20వ తేదీ వరకు తాము చదివిన కళాశాలలోని ఫీజులు చెల్లించాలని, ఆన్‌లైన్‌లో చెల్లించవద్దని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి తెలిపారు.

రీకౌంటింగ్‌, వెరిఫికేషన్‌కు అవకాశం

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫలితాలపై సందేహాలు ఉన్నవారు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి తెలిపారు. రీకౌంటింగ్‌ కోసం ఒక సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్‌, స్కాన్డ్‌ కాపీ కోసం సబ్జెక్టుకు రూ.800 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు తెలిపారు.

Updated Date - Apr 13 , 2026 | 01:29 AM