Raajanna siricilla : ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:27 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా అధ్యాపకులు ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులను సిద్ధం చేశారు.
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు
- జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు, 8,106 మంది విద్యార్థులు
- 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు
- నిముషం ఆలస్యాన్ని ఐదు నిమిషాలకు సడలింపు
- సీసీ కమెరాల నిఘా
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా అధ్యాపకులు ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులను సిద్ధం చేశారు. ఇనచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. విధి విధానాలు పకడ్బందీగా అమలుచేసే దిశగా దిశానిర్దేశం చేశారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్‌ల ప్రశ్నపత్రాలు మూడు సెట్లు పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బంధీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలో మాస్ కాపీయింగ్‌కు చెక్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షనను అమల్లో ఉండనున్నది. వంద మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. పరీక్ష సమయంలో జిరాక్స్, కంప్యూటర్ కేంద్రాలను మూసివేసే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, ఓఆర్‌ఎస్ ప్యాకేట్లు, మంచి నీటి సౌకర్యం వంటివి కల్పిస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాల బాక్స్‌లు తెరవడం నుంచి సమాధాన పత్రాల ప్యాకేట్లు సీల్ చేసి పంపించే వరకు పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నారు.
- 8,106 మంది విద్యార్థులు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16 కేంద్రాల ద్వారా ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తి చేసినా పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు. ఒక నిముషం ఆలస్యాన్ని ఐదు నిమిసాలకు సడలింపు చేశారు. ఇతర గ్రామాల నుంచి పరీక్షలకు వచ్చే విద్యార్థుల కోసం బస్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలకు 8,106 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,046 మంది రెండో సంవత్సరం విద్యార్థులు 4,060 మంది ఉన్నారు.
- 350 మంది సిబ్బంది
జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 350 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కొ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌లుగా 16 మంది, అదనపు డిపార్ట్‌మెంటల్ అధికారులు 16 మంది, మరో ఐదు మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ నుంచి ముగ్గురు సభ్యులతో ఫ్లయింగ్ స్క్వాడ్, ముగ్గురు కస్టోడీయన్సను నియమించారు. పరీక్ష పత్రాలు సీసీ కెమెరాల ముందే తెరవనున్నారు. ప్రతీ 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. 350 మంది ఇన్విజిలేట ర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలు కచ్ఛితంగా పాటించాల్సి ఉంటుంది. పరీక్ష గదుల్లోకి సెల్‌ఫోన్లు ఇతర ఎలకి్ట్రకల్ వస్తువులకు అనుమతి లేదు. విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లలో పొరపాట్లు ఉంటే చూసుకోవాలి. ఫొటోలు, సబ్జెక్ట్‌లు వంటివి సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి. సాధారణ చేతి గడియారాలు కూడా అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సమయాన్ని గుర్తు చేసేలా అరగంటలకు ఒకసారి బెల్ మోగిస్తారు. ఇన్విజిలేటరు ్లకూడా గుర్తు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
- హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హాల్ టికెట్లను ఆనలైన ద్వారా విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్, నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను వెతుక్కునే సమస్య లేకుండా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ద్వారా ఓపెన చేయగానే పరీక్ష కేంద్రం వివరాలుతో పాటు లొకేషన కూడా వస్తుంది.
ప్రిన్సిపల్ సంతకం లేకున్నా అనుమతి
ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఫీజు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వబోమని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాల నేపథ్యంలో ఈసారి ఆనలైన ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించింది. అంతేకాకుండా హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను తొలగించారు. ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. దీనివల్ల విద్యార్థులకు ఎంతో ఊరట కలిగింది.
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
- చెరుకు శరతకుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఇంటర్మీడియట్ బోర్డ్ సైట్ నుంచి విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి 45 నిమిషాల ముందు చేరుకోవాలి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులు పెడితే ఫిర్యాదు చేయవచ్చు. విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 8333916289 ఏర్పాటు చేశాము. ఏమైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించవచ్చు. హాల్‌టికెట్‌లో ఫొటో, సబ్జెక్ట్‌లు వంటివి సరిగా ఉన్నాయా లేదా అనేది విద్యార్థులు సరిచూసుకోవాలి. ఏమైనా పోరపాట్లు తప్పులు ఉంటే సంబంధిత కళాశాల దృష్టికి తీసుకురావాలి.