Share News

Raajanna siricilla : సంక్షోభంలో అద్దకం పరిశ్రమ

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:09 AM

సిరిసిల్ల, మార్చి 7 (ఆంరఽధజ్యోతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదుగుతూ మరమగ్గాలు, అనుబంధ పరిశ్రమల వైపు అడుగులు వేసింది.

Raajanna siricilla :  సంక్షోభంలో అద్దకం పరిశ్రమ

- సిరిసిల్లలో తగ్గిన కాటన ఉత్పత్తి

- ఉపాధి కోల్పోతున్న కార్మికులు

- 280 డైయింగ్‌ పరిశ్రమలు మూత

సిరిసిల్ల, మార్చి 7 (ఆంరఽధజ్యోతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదుగుతూ మరమగ్గాలు, అనుబంధ పరిశ్రమల వైపు అడుగులు వేసింది. మరమగ్గాలపై కాటన వస్త్రాలు ఉత్పత్తి అయితే వాటికి రంగుల అద్దకంతో దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ అగ్రగామిగా నిలిచింది. చిన్నచిన్న యంత్రాలతో కుటీర పరిశ్రమగా రంగుల ప్రపంచంలో ఎంతో మందికి ఉపాధి లభించింది. అధునిక యంత్రాలు, మిల్లు బట్ట నుంచి ఎదురైన పోటీతో పరిస్థితులు తలకిందులు అయ్యాయి. మరమగ్గాలకు అనుబంధంగా ఉన్న అద్దకం పరిశ్రమ కష్టాల్లో పడింది. రంగురంగుల వస్త్రాలతో దక్షిణాది రాష్ట్రాలకు పెటీకోట్స్‌ బట్ట అందిస్తున్నా సిరిసిల్ల కాటన అద్దకం పరిశ్రమ సంక్షోభంలో చిక్కింది. కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు.. తమిళనాడు, గుజరాత రాష్ట్రాల్లోని పరిశ్రమలతో తీవ్ర పోటీని ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేస్తున్నా రంగులు, రసాయనాల ధరలు పెరిగిపోవడంతో అద్దకం కూలీ గిట్టుబాటు కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత పభుత్వ హయాంలో బతుకమ్మ చీరలతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న స్వశక్తి చీరలతో పాటు పెటీకోట్స్‌ ఇవ్వాలని అద్దకం పరిశ్రమ యజమాన్యం, కార్మికులు కోరుతున్నా ప్రభుత్వాలు ఆ దిశగా అలోచన చేయకపోవడంతో అనేక పరిశ్రమలు మూత పడ్డాయి.

డైయింగ్‌, సైజింగ్‌లకు మొదలైన కష్టాలు..

సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలు ఉండగా వీటిలో ఎక్కువ శాతం గతంలో బతుకమ్మ చీరలు, ప్రస్తుతం స్వశక్తి చీరలు, ఇతర పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తి జరిగేది. చీరల ఆర్డర్లతో కాటన బట్ట ఉత్పత్తి నిలిచిపోయింది. గతంలో దాదాపు 15 వేల మరమగ్గాలపై నడిచే కాటన ఉత్పత్తి ఇప్పుడు 1500 మరమగ్గాలకు పడిపోయింది. కాటన ఉత్పత్తులకు అనుబంధంగా మొదలైన 28 సైజింగ్‌ల్లో 20 సైజింగ్‌లు మూతపడ్డాయి. దీనికి తోడు కాటన, రసాయనాల ధరలు కూడా పెరిగిపోయాయి. దీనికి అనుగుణంగా మార్కెట్‌లో బట్ట ఉత్పత్తికి ధర పెరగకపోవడంతో పరిశ్రమ ఇబ్బందులో పడింది. ఇప్పుడు ఎనిమిది సైజింగ్‌లు నడుస్తున్నా అందులోనూ నెలకు 15 రోజులు మాత్రమే కార్మికులకు పని దొరుకుతుంది. మరోవైపు 300 డైయింగ్‌ పరిశ్రమల్లో 280 వరకు మూతపడ్డాయి. 20 డైయింగ్‌లు నామమాత్రంగా అద్దకం జరుపుతున్నాయి. నెలలో కేవలం రెండు వారాలు మాత్రమే కార్మికులకు పని ఉంటుంది. పూర్తిస్థాయిలో పని ఉంటే ఒక కార్మికుడు నెలకు 20,000 రూపాయల వరకు సంపాదించుకునే వారు. ప్రస్తుతం 10,000 రూపాయలకు మించి లభించడం లేదు. అద్దకం పనిలేని రోజు ఇతర పనులు చేసుకుంటున్నారు. గతంలో అద్దకం సైజింగ్‌ పరిశ్రమపై 5,000 మంది ఉపాధి పొందేవారు ప్రస్తుతం వారు ప్రత్యామ్నాయ వృత్తులోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెయ్యి మంది వరకు పనులు చేస్తుండగా ఆ పనులు కూడా దొరకని పరిస్థితి ఉంది. గతంలో సిరిసిల్ల డైయింగ్‌ పరిశ్రమ నుంచి రంగుల బట్ట దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోని తమిళనాడు, గుజరాతలో అద్దకం పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం రాజస్థానలోని బలోత్రాలో ఆధునిక డైయింగ్‌ యూనిట్లు రావడం ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండడంతో సిరిసిల్ల అద్దకం పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడింది. అద్దకం పరిశ్రమకు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రొత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 01:10 AM