Share News

Raajanna siricilla : సాంకేతిక సమస్యలకు చెక్‌

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:57 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) అంగన్‌వాడీ కేంద్రాల్లో కొంతకాలంగా రికార్డులన్నీ ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా పనితీరును సులభతరం చేశారు. అంగన్‌వాడీ టీచర్లు ప్రతిరోజు విధిగా యాప్‌ల ద్వారా వివరాలు నమోదు చేస్తారు.

Raajanna siricilla :  సాంకేతిక సమస్యలకు చెక్‌

- అంగన్‌వాడీ టీచర్లకు 5జీ ఫోన్లు పంపిణీ

- సులభంగా యాప్‌లలో నమోదు

- జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

అంగన్‌వాడీ కేంద్రాల్లో కొంతకాలంగా రికార్డులన్నీ ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా పనితీరును సులభతరం చేశారు. అంగన్‌వాడీ టీచర్లు ప్రతిరోజు విధిగా యాప్‌ల ద్వారా వివరాలు నమోదు చేస్తారు. ఇందుకోసం గతంలో 4జీ నెట్‌వర్క్‌ ఫోన్‌లను అందించారు. పోన్లు సరిగా పని చేయకపోవడం నెట్‌వర్క్‌ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. చివరకు ఇచ్చిన సెల్‌ ఫోన్లను వాడకుండా సొంత ఫోన్లలోనే యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకుని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోటో క్యాప్చర్‌, ఇతర నమోదులతో వస్తున్న సాంకేతిక సమస్యలను దూరం చేసే దిశగా అంగన్‌వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. గతంలో అందించిన ఫోన్లలో 4జీ టెక్నాలజీ మాత్రమే ఉండడంతో తాజాగా 5జీ టెక్నాలజీ సామర్ధ్యం ఉన్న ఫోన్లను అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 30,532 మంది లబ్ధిదారులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాజెక్టులో 362 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 19,358 మంది లబ్ధిదారులు ఉన్నారు. వేములవాడ ప్రాజెక్టు పరిధిలో 224 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 11,174 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంతలో చిన్నారులు 24,689 మంది ఉన్నారు. వీరితో పాటు దాదాపు 3,234 మంది గర్భిణులు, 2,609 మంది పాలిచ్చే తల్లులు ఉన్నారు. వీరికి పోషకాహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు పిల్లల హాజరు, పౌష్టికాహారం అందించే వివరాలు, పోషణ్‌ ట్రాకర్‌, ఎన్‌ఎస్‌టీఎస్‌ యాప్‌ ద్వారా గర్భిణులు, బాలింతల ఫోటో క్యాప్చర్‌ ఉంటుంది. గతంలో అందించిన 4జీ టెక్నాలజీ ఫోన్లు సరిగా పనిచేయక అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం అధునాతన ఫీచర్లతో 5జీ నెట్‌వర్క్‌ స్మార్ట్‌ ఫోన్లు అందించడంతో ఇక నెట్‌వర్క్‌ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు.

తప్పిన రికార్డుల కష్టాలు

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై నిరంతరం ఉన్నతాధికారులు పర్యవేక్షించే విధంగా యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. మరోవైపు అంగన్‌వాడీ టీచర్లు గతంలో దాదాపు 15 రకాల రికార్డుల్లో వివరాలు నమోదు చేసేవారు. ఫుడ్‌ రికార్డు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పోషణ రికార్డు, పిల్లల అటెండెన్స్‌, టీకా రికార్డ్‌, గృహ సందర్శనలు, పిల్లల గ్రోత్‌ రికార్డ్‌, టేక్‌ హోమ్‌ రేషన్‌, టీచర్లు, ఆయాల అటెండెన్స్‌ రికార్డులు రాసేవారు. రికార్డుల భారం తగ్గిస్తూ యాప్‌ల్లోనే నమోదు చేసే విధంగా రూపొందించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌, పిల్లల ఎత్తు బరువు, వ్యాక్సిన్ల షెడ్యూల్‌, పోషకాహారం పంపిణీ, పాలు, గుడ్లు, బాలామృతం వంటి సమాచారాన్ని పోషణ్‌ ట్రాకర్‌, ఎన్‌హెచ్‌ఏఎస్‌ యాపుల్లో పొందుపరుస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడంతో సాంకేతిక ఇబ్బందులు తొలిగిపోతాయని భావిస్తున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:57 AM