Raajanna siricilla : రైతులపై భారం
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:18 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) అన్నదాతకు సాగు మొదలు నుంచి పంట అమ్మకం వరకు అన్ని కష్టాలే.. వ్యయప్రయాసలకు ఓర్చి వానాకాలం, యాసంగి పంటల సాగు చేసుకునే రైతులకు ఎరువులు భారంగానే మారుతున్నాయి.
- వానాకాలం సాగుకు ముందే ఎరువుల ధరలకు రెక్కలు
- జిల్లా రైతులపై దాదాపు రూ.10 కోట్ల భారం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్నదాతకు సాగు మొదలు నుంచి పంట అమ్మకం వరకు అన్ని కష్టాలే.. వ్యయప్రయాసలకు ఓర్చి వానాకాలం, యాసంగి పంటల సాగు చేసుకునే రైతులకు ఎరువులు భారంగానే మారుతున్నాయి. గడిచిన ఏడాది కాలంగా నాలుగుసార్లు ఎరువుల ధరలు పెరిగాయి. యాసంగిలో రెండుసార్లు ఎరువుల ధరలు పెరిగాయి. యాసంగి వరి కోతలు ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు వానాకాలం సాగుకు సిద్ధమయ్యే రైతులకు ఎరువుల భారం ముందుకు వచ్చింది. పశ్చిమాసియా యుద్ధంతో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగడంతో పాటు, ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా రవాణా చార్జీల పెరుగుదల ఎరువులపై ప్రభావం పడింది. ఎరువుల కంపెనీలు ఎరువు ధరలు పెంచాల్సి వస్తుందని ప్రకటిస్తున్నాయి. గత ఏడాది జూలైలో వివిధ ఎరువుల బస్తాలపై ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.330 వరకు పెరిగింది. అదే క్రమంలో నవంబర్‌లో రూ.50 నుంచి రూ.100 వరకు, జనవరిలో యాసంగికి ముందే రూ.50 వరకు పెంచారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో కాంప్లెక్స్, పొటాష్ ఎరువులపై రూ.225 నుంచి రూ.300 వరకు ధరలు పెరిగాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు వానాకాలం సీజన్‌కు ముందే ఎరువుల ధరలు పెరగడంతో పరిస్థితి ముందు ఎలా ఉంటుందోననే ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో వానాకాలం సాగు 2.43 లక్షల ఎకరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వానాకాలం సాగు దాదాపు 2.43 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. ఇందులో వరి 1.84 లక్షలు, పత్తి 50 వేల ఎకరాల వరకు ఉంటుంది. ఇందుకోసం రైతులు 56060 మెట్రిక్ టన్నుల వరకు వివిధ రకాల ఎరువులు ఉపయోగిస్తారు. ఇందులో యూరియా 25370 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3460 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22390 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4115 మెట్రిక్ టన్నులు ఎస్‌ఎస్‌పీ 725 టన్నులు ఉపయోగిస్తారు. ప్రస్తుతం పెరిగిన కాంప్లెక్స్, పొటాష్ ఎరువుల ధరలతో జిల్లా రైతులపై అదనంగా వానాకాలం సీజన్లో రూ.10 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరల్లో 20:20:0:13 ఎరువుల బస్తాపై రూ.300 వరకు పెరిగింది. పాత ధర రూ.1500 ఉండగా ప్రస్తుతం రూ.1800 చేరింది. 19:19:19 ఎరువులపై రూ.225 పెరిగింది. పాత ధర రూ.2075 ఉండగా కొత్త ధర రూ.2300 పెరిగింది. 12:32:16 బస్తాపై రూ 225 పెరగగా పాత ధర రూ.2025 నుంచి రూ.2250 చెరింది. 14:35:14 ఎరువు ధర కూడా రూ.2175 నుంచి రూ.2250 పెరిగింది. పొటాష్ మాత్రం రూ.125 పెరిగింది. పాత ధర రూ.1850 ఉండగా కొత్త ధర రూ.1975కు చేరింది. డీఏపీ బస్తా రూ.1350, యూరియా బస్తా రూ 266.50 ఇస్తున్నారు. వీటిపై కూడా ధరలు పెరిగిన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తోంది. యాసంగి సీజన్‌తో పోలిస్తే వానాకాలం సీజన్లో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు నాలుగు బస్తాల వరకు, రెండు మూడు రకాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అరబస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. దీంతో వానాకాలం సీజన్లో ఎరువుల భారంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు.