Raajanna siricilla : మహోజ్వల పోరాటంలో ముఖ్య భూమిక..
ABN , Publish Date - Jan 26 , 2026 | 01:54 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) మహోజ్వలంగా సాగిన స్వాత్రంత్య ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ముఖ్య భూమికను పోషించారు.
- ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన ఆంధ్రా మహాసభ
- మానాల కేంద్రంగా గెరిల్లా శిబిరాలు
- సిరిసిల్లలో చేనేత కార్మిక మహాసభ
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ఇన్‌చార్జి కలెక్టర్
- పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మహోజ్వలంగా సాగిన స్వాత్రంత్య ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ముఖ్య భూమికను పోషించారు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది. మన మేధావులు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరిగే వేడుకల్లో, స్వాత్రంత్య ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటాలకు ముఖ్య భూమికగా మారిన సిరిసిల్ల జిల్లాలో ప్రజలు పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ఫ చరిత్ర గర్వించే పోరాటాలు..
చరిత్ర గర్వించే నాటి పోరాటాలు నేటి యువతకు స్ఫూర్తి జ్ఞాపకాలుగా నిలిచాయి. జాతీయ పోరాటాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఘనమైన చరి త్ర ఉంది. జిల్లా వ్యాప్తంగా నిప్పు కణికల్లా ఉవ్వెత్తున ఎగిసి బ్రిటీష్, నిజాం పాలకులకు ఎదురొడ్డి ధీరత్వాన్ని చాటిన వారున్నారు. ఆనాటి పోరాటాలకు సంబంధించిన ఎన్నో ప్రదేశాలు ఇప్పుడు జ్ఞాపకాలుగా యువత సంకల్పాన్ని గుర్తుచేస్తున్నాయి. ఉద్యమాల్లో జిల్లా ప్రజలు పోషించిన పాత్రను జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటాల్లో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు, సిరిసిల్లలో చేనేత కార్మిక మహాసభలు, సిరిసిల్ల పాత తాలూకాలోని మానాల అడవుల్లో గెరిల్లా శిబిరాలు, ఖాదీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా మహాసభలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలు కదంతొక్కారు. పోరాటాలకు సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ ఉమ్మడి జిల్లాకు స్ఫూర్తి నిచ్చింది. నిజాం సంస్థానంలో భాష సంస్కృతులు అణచి వేయబడుతున్న కాలంలో ఆంధ్రజన కేంద్ర సంఘం 1928లో ఆంధ్రా మహాసభగా రూపుదా ల్చింది. 1935లో నాలుగో ఆంధ్రమహాసభ సిరిసిల్ల లో భీమకవి నగరంగా మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన సభ జరిగింది. మహాసభ నిర్వహణలో సిరిసిల్ల తాలూకాలోని గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ముఖ్య భూమికను పోషించాడు. ఇదే ప్రాంగణంలో 4వ ఆంధ్ర మహిళ సభ కూడా నిర్వహించారు. ఈ మహాసభల స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొత్త మలుపు తిరిగాయి.
ఫ సిరిసిల్లలో చేనేత కార్మిక సభ..
ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో సిరిసిల్ల నేత కార్మికులు కూడా ముందుకు సాగారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం చేనేత కార్మిక సంఘం ఏర్పడింది. కార్మిక సంఘం తెలం గాణ తృతీయ మహాసభను సిరిసిల్లలో జరుపుకున్నారు. సిరిసిల్ల ఖాదీ ఉద్యమంలోనూ ముందు వరసలో నిలిచింది. 1946లో నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటం ఉదృతంగా సాగింది. ఖాదీ కార్యక ర్తలపై నిర్భందాలు విధించారు. స్వాతంత్ర పోరా టంలో ఉన్న ఉద్యమకారులపై నిర్భందాలు ఉండ డంతో చరఖా సంఘాల్లో తలదాచుకునే వారు. స్వాతంత్య్రం సాధించిన తరువాత నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఉధృతంగా సాగిన క్ర మంలో నాడు సిరిసిల్ల పాత తాలూక , ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మానాల అడవి గెరిల్లా శిక్షణ శిబిరాలకు కేంద్రంగా మారింది. సిరిసిల్ల, రుద్రంగి, కామారెడ్డి, అర్మూర్, ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు మానాలలో శిక్షణ పొందేవా రు. మానాల గ్రామ భూస్వామి రాజిరెడ్డి శిక్షణ శిబిరాలకు ఎంతో సహకరించేవాడు.
ఫ గ్రంథాలయోద్యమం..
నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న ప్రజలను పోరాట బాటలో నడిపించడానికి గ్రంథాలయోద్యమం కూడా ముఖ్యమైంది. అక్షర జ్ఞానం నేర్పి పత్రికా పఠనం ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. 1886లో మందిన ఆదినారాయణ అనే ఉపాధ్యాయుడు విశాఖపట్నంలో మొదట గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఆ క్రమంలోనే గ్రంథాలయాలు స్థాపనకు నాంది పలికాయి. ప్రథమంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1922లో బస్వేశ్వర్‌రావు, వెంకట్రామారావులు, శ్రీవిశేశ్వర భాషా నిలయం పేరిట గ్రంథాలయ ఉద్యమానికి నాంది పలికారు. దామెర్ల నరహరి లైబ్రేరియన్‌గా చాలాకాలం పని చేశారు. 1925లో సిరిసిల్లలో శ్రీ నారాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. 1923లో మంథనిలో ఉస్మానియా గ్రంథాలయం, 1928లో శ్రీసరస్వతి నిలయం స్థాపించారు. జగిత్యాలలో శ్రీ జగదీశ్వర గ్రంథాలయం, సుల్తానాబాద్‌లో శ్రీవేణుగోపాల స్వామి భాషానిలయం, ఇదే క్రమంలో కోరుట్లలో ఆంధ్రా గీర్వాణీ, శ్రీవాణి గ్రంథాలయం, 1922లో మంథనిలో విశ్వేశ్వరాంధ్ర భాషా నిలయం, 1923లో తెలుగు గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర పోరాటం కోసం ప్రజలు ఆలపించడానికి జాతీయ గీతంగా వందేమాతరం ఉండేది. వందేమాతరం గీతాలాపనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల్లో దేశభక్తి మొదలైంది. అదే స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మజిపేటకు చెందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి నడిపించారు.
ఫ గణతంత్ర వేడుకలు ఇలా...
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం పరేడ్ గ్రౌండ్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 5 నిముషాల వరకు జాతీయ పతాకావిష్కరణ, 9.05 నుంచి 9.10 వరకు గౌరవ వందనం స్వీకరణ, 9.10 నుంచి 9.25 వరకు కలెక్టర్ సందేశం, 9.25 నుంచి 9.55 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.55 నుంచి 10.45 గంటల వరకు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ప్రధానం చేయనున్నారు. 10.45 నుంచి 11 గంటల వరకు స్టాళ్ల సందర్శన ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.