Share News

నాణ్యమైన సన్నాలనే.. సాగు చేయాలి

ABN , Publish Date - May 30 , 2026 | 01:12 AM

జిల్లాలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో సన్నరకం వరిపంటను సాగుచేసే రైతులు నాణ్యమైన రకాలనే పండించాలని వ్యవసాయశాఖ పేర్కొంటోంది. దీనిపై రైతులకు వ్యవసాయశాఖ విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ కొన్నిరకాల విత్తనాలనే సాగుచేయాలని నిర్ధేశిస్తున్నది.

 నాణ్యమైన సన్నాలనే.. సాగు చేయాలి

- వరిలో తొమ్మిది రకాలను గుర్తించిన జిల్లా వ్యవసాయశాఖ

- విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించిన అధికారులు

- ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉండకుండా ముందస్తు చర్యలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో సన్నరకం వరిపంటను సాగుచేసే రైతులు నాణ్యమైన రకాలనే పండించాలని వ్యవసాయశాఖ పేర్కొంటోంది. దీనిపై రైతులకు వ్యవసాయశాఖ విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ కొన్నిరకాల విత్తనాలనే సాగుచేయాలని నిర్ధేశిస్తున్నది. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం క్వింటాలు వరి ధాన్యానికి 500 రూపాయల చొప్పున బోనస్‌ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్నాలను సాగు చేస్తున్నారు. వచ్చే వానాకాలం సీజన్‌లో 2,75,990ఎకరాల్లో వివిధరకాల పంటలను సాగు చేయ నున్నారని వ్యవసాయ శాఖాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందు లో అత్యధికంగా 2,11,382ఎకరాలను సాగు చేయనున్నారని పేర్కొన్నారు. 2024 వానాకాలం సీజన్‌ నుంచి సన్న రకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్‌ అందజేస్తున్నది. యాసంగిలో సాగు చేసే సన్నాలకు కూడా బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ గత ఏడాది యాసంగిలో సాగు చేసిన పంటకు ప్రభుత్వం బోనస్‌ ఇవ్వలేదు. దీంతో రైతులు గడిచిన యాసంగి సీజన్‌లో పెద్దగా రైతులు సన్నాలను సాగు చేయలేదు. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 83శాతానికి పైగా సన్నరకం వరి పంటను రైతులు సాగు చేశారు. 2025 ఏప్రిల్‌ నుంచి రేషన్‌ కార్డుల ద్వారా వినియోగదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో ప్రభుత్వం నేరుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. అయితే నాణ్యమైన సన్నాలను సాగు చేయడం వల్ల బహిరంగ మార్కెట్‌లో ధాన్యాన్ని విక్రయించుకోవడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించేందుకు సులువుగా ఉంటుందని వ్యవసాయ శాఖాధి కారులు భావిస్తున్నారు.

మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా, కోతలు విధించకుండా చర్యలు..

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలిం చినప్పుడు సదరు మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా, కోతలు విధించ కుండా ఉండేందుకు గాను చర్యలు చేపట్టారు. పంట నాణ్యత, రైస్‌ మిల్లర్ల ఆసక్తి, వినియోగదారులు ఇష్టపడే ధాన్యాన్ని పండించే వ్యవసాయ శాఖాధి కారులు రైస్‌మిల్లర్లు, వినియోగదారుల అభిప్రాయాలను స్వీకరించారు. ఆ మేరకు రైతులు అధిక దిగుబడుల కోసం వారికిష్టమైన రకాలను సాగు చేయ కుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు.

వ్యవసాయశాఖ సూచిస్తున్న రకాలు..

ప్రధానంగా బీపీటీ 5204 సాంబమశూరీ, తెలంగాణ ఆర్‌ఎన్‌ఆర్‌1548రకం, కూనారం సన్నాలు కేఎన్‌ఎం 1638, జైశ్రీరాం, హెచ్‌ఎండీ సోనా, జేజీఎల్‌ 1798 రకం, డబ్ల్యూజీఎల్‌ 1224. కేఎన్‌ఎం 12368, ఎంటీయూ 1282 రకాలను సాగు చేయడం వల్ల రైతులకు లాభాదాయకమని జిల్లావ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. ఎంటీయూ 1262, ఎంటీయూ 1271, కేఎన్‌ఎం 7715, జేజీఎల్‌ 3828, సిద్ధి డబ్ల్యూజీఎల్‌ 44, డబ్ల్యూజీఎల్‌ 962 రకాలను సాగు చేయడం వల్ల ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయని జిల్లా వ్యవసాయ శాఖాఽధికారి బి శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్‌లో లక్షా70వేల ఎకరాలకు పైగా జిల్లాలో సన్నాలను సాగు చేసే అవకాశాలున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నది.

Updated Date - May 30 , 2026 | 01:13 AM