పబ్లిక్ స్కూళ్లతో నాణ్యమైన విద్య
ABN , Publish Date - May 22 , 2026 | 12:48 AM
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. యంగ్ ఇండియా స్కూళ్లతోపాటు ప్రతీ మండలానికి రెండు పాఠశాలలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం గత ఏడాది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు రూపకల్పన చేసింది. మొదట 100 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేసిన తర్వాత, మండలాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్రీ పైమ్రరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యార్థులు చదువుకునే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్వహించనున్నారు. ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయనున్నారు. అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాలోని వంగూరు మండలం వంగూర్, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో అత్యాధునిక భవనాల నిర్మాణం కొనసాగుతున్నది. ఆరుట్ల పాఠశాలలో తరగతులను కూడా గడిచిన విద్యా సంవత్సరం నుంచే ఆరంభించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృ త్వంలో ఈ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
ఫ జిల్లాలో మూడు పాఠశాలలు
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పాఠశాలలను గుర్తించారు. మంథని నియోజకవర్గం పరిధిలోని మంథని పట్టణంలో గల ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు జెడ్పీ పాఠశాల కొనసాగుతుండగా, జూనియర్ కళాశాల కూడా నడుస్తున్నది. స్థలం కూడా 5 ఎకరాలకు పైబడి ఉండడంతో దీనిని ఎంపిక చేశారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని సుల్తానాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం హైస్కూల్‌తోపాటు జూనియర్ కళాశాల కొనసాగుతున్నది. మైదా నం స్థలం కూడా 5 ఎకరాలకు పైగా ఉన్నది. అలాగే రామగుండం నియో జకవర్గ పరిధిలోని రామగుండంలో గల ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశారు ఇందులో జూనియర్ కళాశాలతోపాటు హైస్కూల్ నిర్వహిస్తు న్నారు. ఇక్కడ కూడా స్థలం అణువుగా ఉండడంతో దీంట్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యా శాఖ అధికారి శారద నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో పాఠశాల భవనాల సముదాయానికి 12 నుంచి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నారు.
ఫ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా..
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పని చేస్తాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ సమకూరుస్తారు. నర్సరీలో చేరితే పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదు వుకోవచ్చు. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల బడులు, జూనియర్ కళాశాల లుంటే ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సులు సమకూరుస్తారు. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో తరగతికి ఒక టీచర్‌ను నియమిస్తారు. నాణ్యమైన విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇస్తారు. సైన్స్, గణితం, ఆంగ్ల ల్యాబ్‌లు ఉంటాయి. ఒక అంత ర్జాతీయ స్థాయి పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో, అవన్నీ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో సమకూరుస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందడంతోపాటు తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున ఫీజుల రూపేనా చెల్లించే డబ్బులు ఆదా కానున్నాయి.