శుద్ధ జలం.. పచ్చి అబద్ధం
ABN , Publish Date - Jun 24 , 2026 | 01:05 AM
వేసవి తాపం ఇంకా వీడడం లేదు. నైరుతి ముఖం చాటేయడంతో తాగునీటి వ్యాపారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా సాగుతోంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
వేసవి తాపం ఇంకా వీడడం లేదు. నైరుతి ముఖం చాటేయడంతో తాగునీటి వ్యాపారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లాలో వాటర్ ప్లాంట్లు నిబంధనలకు నీళ్లు వదులుతూ శుద్ధ జలం పచ్చి అబద్ధం అన్నట్లుగా మార్చారు. నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే దాదాపు పది రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో మాత్రం వీటిని పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఫ్యూరిఫైడ్ వాటర్‌గా మినరల్ వాటర్ భావించి తాగుతున్నారు. రోజూ ప్యూరిఫైడ్ వాటరే తాగుతున్నామని ప్రజలు నమ్మకంగా ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీ కేంద్రాల్లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్‌లు విచ్ఛలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఐఎస్‌ఐ నిబంధనలు పాటించకుండా అమ్మకాలు సాగిస్తున్న నీటి ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మినరల్ వాటర్‌తో మోసపోతూనే ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోనే 120కు పైగా ఉండగా, జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో కలుపుకుంటే 800 వరకు వాటర్ ప్లాంట్‌లు ఉన్నాయి. గల్లీకో వాటర్ ప్లాంటే కాకుండా ఇండ్లలో కూడా ప్లాంట్‌లు వేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. నీటి శుద్ధతపై పర్యవేక్షణ లేకపోవడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. మున్సిపల్ అధికారులు కూడా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
కొరవడిన పర్యవేక్షణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాటర్ ప్లాంట్లలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి శుద్ధిని పరిశీలించాల్సి ఉన్నా తనిఖీలు జరుగుతున్న దాఖలాలు లేవు. మెడికల్ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్లమా పొందిన కెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్ ఒకరు తప్పనిసరిగా ఉండాలి. నీటిని శుద్ధిచేసే ముందు, శుద్ధి చేసిన తర్వాత నీటి శాంపిళ్లను పరీక్షించి వచ్చిన రిపోర్టు ఆధారంగా మార్కెటింగ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలో ఎక్కడా కూడా నిబంధనలు పాటించడం లేదు. ప్యూరిఫైడ్ పేరిట విచ్ఛలవిడిగా వాటర్ ప్లాంట్ల నిర్వాహకులే రసాయనాలు కలపడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. క్యాన్ నీటితో అనేక దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తున్నట్లు వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, సోడియం క్లోరైడ్‌లాంటి లవణాలు బయటకు పంపేసి లవణ రహిత నీటిని మాత్రమే అందించడం ద్వారా జీర్ణాశయ వ్యవస్థ, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు బీఐఎస్, ఐఎస్‌ఐల నుంచి సర్టిఫికెట్లు పొందాలి. వాల్టా చట్టం కింద భూగర్భ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. మున్సిపల్, గ్రామ పంచాయతీ, రెవెన్యూ, కార్మిక, కాలుష్య మండలి, ప్రజారోగ్య, తూనికలు, కొలతలు, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల నుంచి అనుమతులు ఉండాలి. ఈ అనుమతులేవి పాటించడం లేదు. దీంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు సంబంధించిన నిబంధనల ప్రకారం ఫుడ్ కంట్రోలర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లు ప్లాంట్‌ను సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. కానీ సిరిసిల్లతో పాటు గ్రామాల్లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. నీటిలో అత్యధికంగా టోటల్ డిజాల్స్ సాలీడ్స్(టీడీఎస్) పరిమితికి మించి ఉంటే ఆ నీటిని విషతుల్యంగానే భావిస్తారు. ఆ నీరు తాగితే మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటారు. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు బోరుకు మోటార్లు వేస్తూ రివర్స్ అస్మోసిస్ పద్ధతిలో జలాలను శుభ్రపరుస్తూ విక్రయిస్తున్నారు. వృథా నీటిలో టీడీఎస్ ఉంటుంది. భూగర్భ జలాల్లోకి పంపడం, డ్రైనేజీల్లో కలవడం ద్వారా నష్టాన్నే కలిగిస్తాయి. వస్తున్న నీటిని డ్రై బెడ్స్‌లో కేక్‌గా మార్చి పారబోయాల్సి ఉంటుంది. ఇందుకు ప్లాంట్ విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఇళ్ల మధ్య ఉండడం ద్వారా ఇలాంటివి ఎవరూ పాటించడం లేదు. అధికారులు కూడా తనిఖీలు చేయడం లేదు. ప్లాంట్లలో కూడా రసాయనాలు ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారు.
కానరాని శుభ్రత...
నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్‌లలో నీటి శుద్ధి జరుగుతున్నట్లు తెలుస్తున్నా కనీసం నీళ్లకు ఉపయోగించే డబ్బాలను కూడా శుభ్రం చేయడం లేదు. వాటినే యథావిధిగా ఉపయోగించడంతో క్యాన్లలో ఫంగస్ ఏర్పడి రోగాల బారిన పడుతున్నారు. ఇళ్లలో కూడా ప్లాంట్ అపరిశుభ్రంగా, ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల నిర్వహణను కూడా పట్టించుకునే వారే లేకపోవడంతో నిర్వాహకులకు ఇష్టారాజ్యంగా మారింది. నిత్యం ఇళ్లలో వాడే వాటర్ క్యాన్‌లు రూ 15 నుంచి రూ 20 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలను అనారోగ్యంపాలు చేస్తుంది.