నేడు పల్స్ పోలియో
ABN , Publish Date - Jun 28 , 2026 | 01:06 AM
జిల్లాలో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 91,178 మంది ఉన్నట్లు గుర్తించారు.
- జిల్లాలో 91,178 మంది ఐదేళ్లలోపు చిన్నారులు
- ప్రచారంలోపంతో అయోమయం
సుభాష్‌నగర్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 91,178 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, హుజూరాబాద్, జమ్మికుంట ఏరియా ఆసుపత్రులతోపాటు 16 మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఆరు అర్బన్ హెల్త్‌సెంటర్లలో పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో కూడా చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
ఫ ఎటువంటి ముందస్తు కార్యక్రమాలు లేకుండానే..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గతంలో విస్తృత ప్రచారం నిర్వహించేది. ఎక్కడకెక్కడ, ఇటుక బట్టీలు, సంచార జాతులు ఉండే, జాతరలు, సంతలు నిర్వహించే ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో అర్హులైన చిన్నారులందరికీ పోలీయో చుక్కలు వేయించేలా తల్లిదండ్రులను చైతన్యపరిచేవారు. అక్కడక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతోపాటు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి జిల్లాలో ఎంత మంది చిన్నారులున్నారు.. వారందరికి ఎక్కడెక్కడ చుక్కలు వేసేందుకు ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశాము, ఎంతమంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారనే సమాచారాన్ని ముందస్తుగా వెల్లడించేవారు. ముందస్తు ర్యాలీలు నిర్వహించి అంగవైకల్యం నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ప్రతి చిన్నారి తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలను వేయించాలని, ప్రభుత్వం ఉచితంగా ఈ మందును పంపిణీ చేస్తుందని ప్రచారం చేసేవారు. సామాజిక సేవకులు, యువకులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వంటి వలంటీర్లనుకూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసే వారు. ఐదేళ్లలోపు చిన్నారులు ఒక్కరు కూడా తప్పిపోకుండా వంద శాతం పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం విజయవంతం చేసేది. తప్పిపోయిన వారు తమ పిల్లలకు చుక్కలు వేయించుకునేందుకు వీలుగా ఇంటింటికి వైద్య ఆరోగ్య సిబ్బందిని పంపించివారు. దీంతో అక్షరాస్యులే కాకుండా నిరక్షరాస్యులు, స్థానికేతరులు కూడా వారి చిన్నపిల్లలకు ఎక్కడో ఒక చోట పోలియో చుక్కలను వేయించేవారు. ఈసారి జిల్లా అధికారయంత్రాంగం కానీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కానీ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఆసుపత్రులకు వీలుకాకుంటే ఎక్కడ వేయించుకోవాలో, ఎంత మంది ఉంటారో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
ఫ పల్స్‌పోలియో విజయంతం చేయండి
జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీరాం కోరారు. జిల్లా కేంద్రంలోని పీపీ యూనిట్, బుట్టి రాజారాం అర్బన్ హెల్త్ సెంటర్, మోతాజ్‌ఖాన అర్బన్ హెల్త్ సెంటర్, హౌసింగ్ బోర్డు కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్, సప్తగిరి కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లను ఆయన శనివారం సందర్శించారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాక్సిన్ నిల్వ, కోల్డ్‌చైన్ నిర్వహణ, పోలియో బూత్‌ల ఏర్పాటు, వ్యాక్సిన్ పంపిణీ, అవసరమైన మందులు రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,178 ఉన్నారని, వారందరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. ప్రజలు తమ పిల్లలను సమీప పోలియో బూత్‌లకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో డెమో శ్రీనివాస్, డీపీఎం స్వామి పాల్గొన్నారు.