Share News

ప్రజా సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:16 AM

ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు.

ప్రజా సంక్షేమమే   ప్రజాప్రభుత్వ లక్ష్యం

పెద్దపల్లి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతోపాటు పారదర్శక పాలనకు ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పెద్దపల్లి ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం జాతీయ గీతం, వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైంది. అనంతరం ప్రభుత్వ విప్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ బలోపేతం, యువతకు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, విద్య, వైద్య రంగాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రభుత్వ విప్‌ తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తూ ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి ప్రతి వర్గం అభ్యున్నతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఫ సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా

జిల్లాలో 2,46,981 బీపీఎల్‌ కుటుంబాల్లోని 7.18 లక్షల మందికి 410 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతీ నెల 4,548 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద రూ.14 కోట్ల సబ్సిడీతో 4.74 లక్షల సిలిండర్లను 1.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.500 అందించామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం ద్వారా రూ.245.27 కోట్లను ఆదా చేసుకున్నారని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 1,40,116 కుటుం బాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ ఇప్పటివరకు రూ.141.64 కోట్ల సబ్సిడీ అందించామని వివరించారు.

ఫ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 7,199 ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి ఆధారంగా ఇప్పటివరకు 5,982 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.135 కోట్ల ఆర్థిక సహాయం జమ చేశామని చెప్పారు.

ఫ రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రభుత్వ విప్‌ తెలిపారు. వ్యవసాయ రంగానికి 75,257 కనెక్షన్ల ద్వారా యేటా రూ.101కోట్ల సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. ఆయిల్‌పామ్‌ విస్తరణలో భాగంగా ప్రస్తుత సంవత్సరం 570 ఎకరాల్లో పంటను విస్తరించామని, మొదటి సంవత్సరం తోటల ఏర్పాటుకు రూ.86.79లక్షలు, 2, 3, 4వ సం వత్సరాల నిర్వహణకు 2,173 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటకు రూ.91.27 లక్షలు, తెలంగాణ సూక్ష్మ నీటి సేద్య పథకం కింద 567 ఎకరాలకు రూ.1.33 కోట్ల రాయితీ అందించామని వివరించారు.

ఫ విద్యార్థులకు ఉచిత అల్పాహారం

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థు లకు పౌష్టికాహారం అందించేందుకు ఉచిత అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. ఇందులో భాగంగా మంథనిలో రూ.7.50 కోట్లతో కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రారంభించారని చెప్పారు. ఈ వంట శాల ద్వారా 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్‌ కళాశాలల్లోని సుమారు 40 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ నంది మేడారంలో రూ.51.28 కోట్ల 7,682 కిలోవాట్ల సోలార్‌ మోడల్‌ ప్రాజెక్టు, పీఎం సూర్య ఘర్‌ ద్వారా 1,517 సోలార్‌ కనెక్షన్లు, పీఎం కుసుమ్‌ ద్వారా 9.50 మెగావాట్ల ప్రాజెక్టులకు చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్‌ తెలిపారు.

ఫ వైద్య రంగంలో మెరుగైన సేవలు

ఆరోగ్యశ్రీ ద్వారా 48,118 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి రూ.120.56 కోట్ల లబ్ధి చేకూర్చామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. వ్యాధి నిరోధక టీకాల్లో 100శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో 4,969 మంది మహిళలకు, అసంక్రామిక వ్యాధుల స్ర్కీనింగ్‌లో 3.01 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 108, 102 సేవల ద్వారా 24 వేల మందికి పైగా అత్యవసర రవాణా సేవలు అందించామని చెప్పారు

ఫ పెద్దపల్లి ప్రజల కల బస్‌ డిపో

పెద్దపల్లి ప్రజల దశాబ్దాల కల ఆర్టీసీ బస్‌ డిపోను ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. బస్‌ డిపో నిర్మాణానికి ఆర్టీసీ రూ.8.40కోట్లు మంజూరు చేసిందని, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలి పారు. త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు బస్‌ డిపోను అందు బాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. అలాగే పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.82 కోట్లు మంజూరు చేశారని ప్రభుత్వ విప్‌ తెలిపారు. నాలుగు వరుసలుగా, సెంట్రల్‌ లైటింగ్‌తో నిర్మించనున్న ఈ బైపాస్‌ రోడ్డు పట్టణ ట్రాఫిక్‌ను తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనుందని చెప్పారు.

ఫ పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊతం

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ టీజీఐపాస్‌ ద్వారా 31 యూనిట్లకు అనుమతులు మంజూరు చేసి రూ.17.75 కోట్ల పెట్టుబడులతో 346 ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేశామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. టీ ఐడియా, టీప్రైడ్‌ పథకాల కింద 24 పరిశ్రమలకు రూ.4.49 కోట్ల సబ్సిడీ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 29 యూనిట్లకు రూ.1.19 కోట్ల సబ్సిడీ అందించామని చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు మంథని మండలంలో 2ఎకరాలు గార్మెం టింగ్‌ యూనిట్ల కోసం కేటాయించామని తెలిపారు. డిజిటల్‌ ఎంప్లాయి మెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కృషితో కోకాకోలా సంస్థ రూ.700 కోట్లకు పైగా పెట్టుబడితో జిల్లాకు వచ్చిందని తెలిపారు. రామగిరి మండలం రత్నాపూర్‌ గ్రామంలో పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించామని చెప్పారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) బి.శ్రీరాములు, డీసీపీ రాంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య, ఆర్డీఓ బి. గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, కలెక్టరేట్‌ ఏఓ ప్రకాష్‌, ఏసిపి జి.కృష్ణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 01:16 AM